– జనంలో లేని పేపర్ టైగర్లను పక్కనపెట్టే శక్తి ఉందా?
– ముదురు నేతలతో ముందుకు వెళ్లడం కష్టమే
– అగ్రనేతలందరికీ ఢిల్లీ పరిచయాలు
– సీనియర్లు సహకరించడం అనుమానమే?
– సంఘ్‌తో సమన్వయమే అసలు సమస్య
– ఇప్పటిదాకా ఆమెది సొంత బాటనే
– ఎవరితోనూ సమన్వయం చేసుకోలేని మనస్తత్వం
– రిజర్వుడుగా ఉండే నేతగా పేరు
– మేధావి, లౌక్యురాలిగా పార్టీలో ప్రశంసలు
– కోర్ కమిటీలోనూ లౌక్యంగా తప్పించుకునే నేర్పు
– తన అభిప్రాయం ఏనాడూ వెల్లడించని సమయస్ఫూర్తి
– పెద్దల మాటే తన మాట అని తప్పించుకునే లౌక్యం
– నేతల ఫోన్లు తీయరన్న వ్యాఖ్యలు
– పీఏలతోనే మాట్లాడాలన్న విమర్శలు
– సర్కారుపై సమరంలో పురందీశ్వరి వైఖరేమిటి?
– సర్కారు, జగన్‌ను విమర్శిస్తేనే పార్టీ వర్గాల్లో విశ్వసనీయత
– మరి జగన్‌పై నాయకత్వం ఇచ్చిన ఆదేశాలేమిటి?
– అది తేలితేనే ఏపీలో ‘కమల వికాసం’
– పురందీశ్వరికి ఏపీ పువ్వుతోటలో ముళ్లబాట
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆమె ఉన్నత విద్యావంతురాలు. పైగా తెలుగుదేశాధీశుడి పుత్రిక. వక్త. అంతకు మించిన మేధావి. పార్టీ కోర్ కమిటీ భేటీలలో ఆమె శైలి విభిన్నం. కీలమైన ఆ భేటీలలో అగ్రనేతలంతా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. సూచనలు చేస్తారు. వాదులాడుకుంటారు. కానీ ఆమె మౌనంగా ఉంటారు. తనకేమీ పట్టనట్లు ప్రేక్షకురాలిగా కనిపిస్తారు. ఢిల్లీ కీలక నేతలు తమ అభిప్రాయం చెప్పిన తర్వాత, మీరు చెప్పిందే రైటంటారు… తానూ అదే భావిస్తున్నానంటారు… ‘కొన్ని సమస్యలున్నా మీరే కరెక్ట’ని చెబుతారు.. చివరగా.. ‘మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా’ అంటారు! అంటే ఏదీ సొంతంగా తన అభిప్రాయం చెప్పరన్నమాట!!
మరి ఇంత లౌక్యం.. ఇన్ని తెలివితేటలు.. అపార మేధస్సు.. అంత అద్భుతమైన ‘స్థితప్రజ్ఞతతో కూడిన ప్రాప్తకాలజ్ఞత’ కలబోసిన ఆమె.. పువ్వు పార్టీని సొంత అభిప్రాయాలతో నడిపించగలరా? ధైర్యంగా సొంత నిర్ణయాలు తీసుగోలరా? పార్టీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన ముదురు సంఘాలను తట్టుకుని, పార్టీని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలరా? జగన్ సర్కారుపై ఏ దిశలో వెళ్లాలన్న అంశంపై, నాయకత్వం ఆమెకు దిశానిర్దేశం చేసిందా?
అసలు జగన్ సర్కారుపై ఆమెది సీరియస్ సమరమా? లేక తమలపాకు యుద్ధమా? ‘ఢిల్లీ వ్యూహం ప్రకారం’ తన కులం వారిని గంపగుత్తగా కమలవనంలో చేర్చే శక్తి ఆమెకు ఉందా?… ఆ ప్రయత్నంలో ఆమెతో కలసివచ్చే, సొంత సామాజికవర్గ సంఖ్య సైజు ఎంత? అన్నింటినీ అధిగమించి, పువ్వు పార్టీని ఆంధ్రాలో పరిమళింపచేస్తారా? ఇవీ.. దగ్గుబాటి పురందీశ్వరికి, ఏపీ బీజేపీ పగ్గాలు అందించిన తర్వాత.. ఆ పార్టీ శ్రేణుల్లో తెరపైకొచ్చిన సందేహాలు.
ఎవరూ ఊహించని విధంగా.. ఏపీ కమల కిరీటం దక్కించుకున్న, కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరికి ఎదురయ్యే సమస్యలపై.. పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఇప్పటిదాకా ఏపీ బీజేపీలో పెద్దగా చురుకైన పాత్ర పోషించకుండా, లోప్రొఫైల్‌లో పనిచేసిన ఆమె, ఇప్పుడు వాయువేగంతో పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి.
ఆరెస్సెస్ ఒకప్పటి కీలక నేత బాగయ్య సర్వశక్తులొడ్డి… కట్టబెట్టించిన అధ్యక్ష పగ్గాలు అందుకున్న ఆమెకు, సీనియర్లు ఎంతవరకూ సహకరిస్తారు? ‘నాయకత్వం కోరుకున్నట్లు’, సొంత కులం ఆమెతో ఏ మేరకు నడుస్తుంది? జగన్‌పై ఆమె వైఖరి ఏమిటి? ఆ విషయంలో ఆమె.. కన్నా లక్ష్మీనారాయణ బాటలో నడుస్తారా? వీర్రాజు వేసిన మార్గంలోనే పయనిస్తారా? అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పార్టీ వర్గాలతో పెద్దగా అనుబంధం లేకుండా.. నేతలతో సంబంధ బాంధవ్యాలు లేకుండా, లో ప్రోఫైల్‌లో ఉండే పురందీశ్వరికి దక్కిన అధ్యక్ష పదవి, ఒకరక ంగా ముళ్లబాటేనని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. నేరుగా ఢిల్లీతో సంబంధాలుండే కొందరు సీనియర్లతో, పనిచేయించడం కత్తిమీద సామేనంటున్నారు.
జనంతో సంబంధం లేకుండా.. కేవలం మీడియా, ఇతర ఆర్ట్‌ఆఫ్‌లివింగ్ కార్యక్రమాలు, పెద్దలను ‘అన్ని రకాలుగా సంతృప్తి’ పరిచి పెద్ద పదవులు పొందే వారిని పక్కనపెట్టే అంశంలోనే, ఆమె నాయకత్వ పటిమ బయటపడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒకరకంగా ఆమెకు అధ్యక్షురాలిగా అదే తొలి పరీక్ష అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక కమ్మవర్గాన్ని గంపగుత్తగా దరిచేర్చుకుని, టీడీపీని దెబ్బతీయాలన్న నాయకత్వ ఆశలను.. ఆమె ఏ మేరకు నెరవేరుస్తారన్న దానిపై, ఆమె నాయకత్వ ప్రతిభ ఆధారపడి ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ దెబ్బతీసి, తర్వాత ఆ స్థానం తాను ఆక్రమించాలన్నది.. బీజేపీ నాయకత్వం చాలాకాలం నుంచి కోరుకుంటున్న వాస్తవం.
కానీ అది అమలయ్యే అవకాశం మరో దశాబ్దం వరకూ కనిపించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో, అలాంటి అవకాశాలు కనిపించాయి. అయితే నాయకత్వం హటాత్తుగా ఆయనను తొలగించి, సోమును నియమించడంతో, బీజేపీ నాయకత్వ ఆలోచనలకు సంపూర్ణ సమాధి కట్టినట్టయింది.
ఇప్పటికే కమ్మ సామాజికవర్గం మొత్తం, మానసికంగా టీడీపీ మద్దతుదారుగా ఉంది. గతంలో కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ కమ్మ ఎమ్మెల్యే అభ్యర్ధుల వైపు మొగ్గిన ఆ వర్గం.. ఇప్పుడు పూర్తి స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా మారింది. అమరావతిని విధ్వంసం చేసిన జగన్‌కు, బీజేపీ దన్ను ఉందన్న భావన కమ్మ వర్గంలో బలంగా నాటుకుపోయింది. జగన్‌ను కేసులు, ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా అప్పులు ఇస్తూ.. బీజేపీనే కాపాడుతోందన్న ఆగ్రహం కమ్మవారిలో కనిపిస్తోంది. దానితో ఈసారి ఎలాగైనా.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న కసి, కమ్మ వర్గంలో తీవ్రంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి… కమ్మ ఓట్లపై కమలం కన్ను?
మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు,అధికారుల పోస్టింగుల్లో తమకు అన్యాయం జరుగుతోందన్న భావన, కమ్మవర్గంలో ఉంది. బీజేపీ సహకారం వల్లే.. జగన్ తమను తొక్కివేస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న కమ్మవర్గం.. పురందీశ్వరి సారథ్యంలోని బీజేపీ వైపు, ఏవిధంగా అడుగులు వేస్తారు? వారిని ఆమె ఏవిధంగా పార్టీ వైపు ఆకర్షితులను చేస్తారన్నదే ప్రశ్న. ఇది కూడా చదవండి: బీజేపీ వ్యూహం బూమెరాంగ్?
బీజేపీ నేతలు సహజంగా.. జనాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఒకరిద్దరు మినహా ఫోన్లకు అందుబాటులో ఉంటారు. కానీ అధ్యక్ష పదవి చేపట్టిన పురందీశ్వరి ఫోన్లు తీయరని, ఎవరికీ అందుబాటులో ఉండరన్న విమర్శ పార్టీ వర్లాల్లో ఉంది. ఆమె పీఏ వెంకటేశ్వరరావుతోనే, నాయకులు టచ్‌లో ఉంటారన్న ప్రచారం ఉంది. ఆమెకు ఏ విషయమైనా చేరవేయాలంటే, ఆమె పీఏకే ముందు ఫోన్ చేయాలంటున్నారు. అధ్యక్ష పదవి అందుకున్న తర్వాత, అదే పద్ధతి కొనసాగిస్తే కష్టమేనంటున్నారు.
ఇక సంఘ్‌తో సమన్వయమే అసలు సమస్య అని, పార్టీ సీనియర్లు చెబుతున్నారు. బాగయ్య ఆరెస్సెస్ అగ్రనేతగా ఉన్న సమయంలో, పురందీశ్వరిని బాగా ప్రోత్సహించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపించేది. ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా, ఆయన చేసిన లాబీయింగ్ వల్లే వచ్చిందన్నది పార్టీ వర్గాల కథనం.
అయితే బాగయ్య ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోవడం, ప్రాంత ప్రచారక్‌గా భరత్‌జీ స్థానంలో ఆదిత్యజీ రావడంతో.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నది పార్టీ వర్గాల విశ్లేషణ. ఆర్గనైజేషన్ విషయంలో.. ముక్కుసూటిగా వ్యవహరించే ఆదిత్యజీతో, ఆమె సమన్వయం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.
ఇక రాష్ట్రంలో పార్టీ బూత్‌కమిటీలు, మండల-పట్టణ-శక్తి కేంద్రాలు పూర్తి స్ధాయిలో భర్తీ చేయడం ఆమె నాయకత్వ ప్రతిభకు సవాలు. వాటిని ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయారు. శక్తికేంద్రాలు-బూత్‌కమిటీల్లో కాకిలెక్కలే తప్ప, వాస్తవం లేదన్నది పార్టీ వర్గాల విమర్శ.
అసలు పురందీశ్వరి సొంత కారంచేడు మండలంలోనే, పార్టీ అత్యంత బలహీనంగా ఉందన్నది ఓ విమర్శ. అక్కడ ఏ కమిటీలూ పూర్తి స్థాయిలో లేవన్నది పార్టీ వర్గాల కథనం. ఆ ప్రకారంగా ఆమె ముందు ఇంట గెలిచి, తర్వాత రచ్చ గెలవాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి.. ఆమె సొంత పోలింగ్ బూత్‌లో కేవలం 3 ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల మొత్తానికి 703 ఓట్లు మాత్రమే పోలైన దుస్థితి. నోటాకే బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు రావడం ప్రస్తావనార్హం.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్ధులే కరవైన దయనీయం. బీజేపీ నిర్వహించే సభలకు వందల్లో కూడా జనం రాని దుస్థితి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి కొన్ని లక్షలమంది హాజరయ్యారని, అందులో మగ-ఆడ వారి లెక్కలు పేర్కొంటూ, కాకిలెక్కలతో ట్వీట్ చేసిన ఓ ప్రధాన కార్యదర్శి అభాసుపాలయ్యారు. ఈ విషాదం నుంచి పార్టీని గట్టెక్కించి, వైసీపీ-టీడీపీకి ప్రత్యామ్నాయంగా పువ్వును ఎలా పరిమళింపచేస్తారో చూడాలి.