Suryaa.co.in

Andhra Pradesh

పబ్లిక్ గా ఏడవకండి… ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది

– సాక్షి రాతల్లో ఏడుపు తప్ప, మరేమీ ఉండదు
– ఏడ్చేవారు ఏడవనివ్వండి
-మేము బూతులు మాట్లాడితే, చెవుల్లోంచి రక్తాలు కారాల్సిందే
– మూడు పార్టీల మధ్య పొత్తు… అప్రహతిత విజయం ఖాయం
– ప్రజా శ్రేయస్సు కోసమే సీట్లు తక్కువైనా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్
– హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్
– 6 విడతల్లో 60 స్థానాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే, పావు గంటలో 99 స్థానాలను ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

మూడు పార్టీల మధ్య పొత్తు కుదరటం ఖాయమని, కూటమి అప్రహతిత విజయాన్ని సాధిస్తుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు. తెదేపా, జనసేన నాయకులను, కార్యకర్తలను రేపు కూడా సాక్షి దినపత్రిక రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తుంది. ఇప్పటికే పొత్తును విచ్చిన్నం చేయాలని సాక్షి దినపత్రిక చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు.

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాక్షి దినపత్రిక కథనాలను చూసి, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా రెచ్చిపోరు. వైకాపా పని అయిపోయింది. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. వైకాపా నేతల ముఖాల్లోని ఫస్ట్రేషన్ చూస్తేనే అర్థమైపోతుంది. మీరెంత దుఃఖంలో ఉన్నారో, మాకు అర్థమవుతుంది. ఇక రేపటి నుంచి సాక్షి రాతల్లో ఏడుపు తప్ప, మరి ఏమి ఉండదని తెలుసు. పొత్తులో భాగంగా, మూడు పార్టీల క్యాడర్ అన్యోన్యంగా కలిసి పనిచేసే కూటమికి అఖండ విజయాన్ని చేకూరుస్తారన్నారు.

తెదేపా, జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్భంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల ముఖాల్లో ఆనందం కనిపించింది . తెదేపా అభ్యర్థుల జాబితా ప్రకటనలో భాగంగా 94వ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు తన పేరును తానే ప్రకటించుకున్నారు . పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా నవ్వుతూ ఉల్లాసంగా కనిపించారు. దీనితో వైకాపా నాయకులకు ఏడుపే మిగిలింది. పబ్లిక్ గా ఏడవకండి… ఏడిస్తే దరిద్రంగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించుకుంటున్నట్లుగా రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.

అయ్యో పాపం… పవన్ కళ్యాణ్ గురించి బాధపడ్డ సజ్జల
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాధపడడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. సజ్జల విలాపం చూస్తే జాలి వేస్తోందన్న ఆయన, 60 నుంచి 70 స్థానాలను పవన్ కళ్యాణ్ కోరుకుంటారనుకుంటే 24 స్థానాలకి పరిమితమయ్యారని సజ్జల ఏడవడం ఆశ్చర్యంగా అనిపించింది. పొత్తులో భాగంగా ఎన్ని స్థానాలకు పోటీ చేశామన్నది ముఖ్యం కాదని, పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలువాలన్న దృక్పథంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ముందుకు వెళ్తున్నారని రఘు రామ కృష్ణమురాజు తెలిపారు.

ఎక్కడ ఎవరు పోటీ చేశారన్నది ముఖ్యం కాదు. పొత్తులో భాగంగా ఒక్క స్థానాన్ని తీసుకొని పోటీ చేసిన పొత్తు పొత్తే. అందరిదీ సమిష్టి నాయకత్వమేనని, ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తు చేశారు. మా పార్టీలు, మా పొత్తులను మేము చూసుకుంటాం . ఇప్పటికైనా సజ్జల తన ఏడుపును మానివేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి డెసిషన్ మేకింగ్ లో ఎంతో స్పీడ్ గా ఉంటారని అంటుంటారు. ఆరు విడతల్లో ఆయన 60 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేస్తే, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పావు గంటలో సంయుక్తంగా 99 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించారని పేర్కొన్నారు.

బీజేపీ పొత్తు లోకి వచ్చిన తర్వాత మిగిలిన 76 అసెంబ్లీ స్థానాలతో పాటు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటిస్తారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి మిగిలిన అభ్యర్థులను 30 విడతలలో ప్రకటిస్తారేమోనని, అందులోనూ మార్పులు చేర్పులు ఉంటాయేమోనన్నారు. ఇప్పటికైనా వైకాపా నేతలు తమ పని తాము చూసుకుంటే మంచిదని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

సాక్షి దినపత్రికలో నిత్యం కనిపించే ఆందోళనలు… ఈ రోజు కూడా కనిపించాయి
తెదేపా, జనసేన పార్టీలలోని నాయకులు ఆ ఊర్లో, ఈ ఊర్లో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని సాక్షి దినపత్రికలో ప్రతినిత్యం కనిపించే వార్తలే, ఈరోజు కూడా కనిపించాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెదేపా, జనసేన నాయకులను రెచ్చగొట్టాలని కొన్ని చిల్లర చానల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటికి జనసేన పక్షపాత చానల్స్ గా ముద్ర వేసి, అందులో తింగరి మాటలను మాట్లాడించి, పొత్తుకు విఘాతం కలిగించాలనే ప్రయత్నాలను చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించారు.

ఆ చానల్స్ ఏమిటో ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా ఆ చానల్స్ యాజమాన్యం తమ ప్రవర్తనను మార్చుకోవాలి. ప్రజల శ్రేయస్సు కోసమే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్, 24 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకరించారు. 24 స్థానాలు తక్కువే కావచ్చు. కానీ పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుపొందాలన్న లక్ష్యంతోనే ఆయన అంగీకరించారన్నారు. వైకాపా నేతలు ఎంత చెత్త మాట్లాడినా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి ఆయన పొత్తుకు ముందుకు వచ్చారన్నారు. హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏడ్చేవారు ఏడవనివ్వండి. ఏనుగు వెళ్తుంటే , కుక్కలు మొరిగినట్లుగా కొంతమంది వ్యవహరిస్తుంటారని విమర్శించారు.

దళిత నాయకులకు తొలి జాబితాలో స్థానం
ప్రముఖ దళిత నాయకుడు, రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికపుడి శ్రీనివాసరావు, మహాసేన మీడియా ద్వారా లక్షలాది మందిని చైతన్య పరుస్తున్న మహాసేన రాజేష్ కు తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలోనే సీటు దక్కడం పట్ల రఘురామకృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. దళితులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినంత అన్యాయం చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయలేదన్నారు. దళితులకు తెదేపా, జనసేన కూటమి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు.

దళితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, వారికి సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని పేర్కొన్నారు. ఎప్పటినుంచో ఈ ఇద్దరు నాయకులు ప్రజలని చైతన్యవంతుల్ని చేస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎవరి ఎన్నికల ప్రచార పర్వంలో వారు బిజీగా ఉంటారని, ఈ లోగానే దళితులకు జరిగిన దారుణమైన అన్యాయాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలన్నారు.

ఈ విషయాన్ని మేము కూడా చెబుతామని, అయితే అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు దళితులకు కనువిప్పు కలిగించే విధంగావివరిస్తూ, ముందుకు వెళ్లాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. తెదేపా, జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థులకు ముందస్తుగానే అభినందనలను తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరంతా కచ్చితంగా విజయాన్ని సాధించి చట్టసభల్లో అడుగుపెడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. గత రెండేళ్ల క్రితం నుంచి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని నేను చెబుతూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పాను. భీమవరంలో ఆయన 50 వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారని, కుల, మతాలకతీతంగా పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రఘురామకృష్ణం రాజు రాజీనామా
వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రఘురామకృష్ణం రాజు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. శివకుమార్ స్థాపించిన వైకాపా కు, ప్రస్తుత అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపినట్లుగా వివరించారు. మహమ్మద్ గజినీ తరహాలో ఎన్నోసార్లు నన్ను డిస్ క్వాలిఫై చేయించడానికి ఎంతోమంది పారిశ్రామికవేత్తలను పంపించి ఎన్నో ప్రయత్నాలను చేసినా, నీ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమే అయ్యాయి.

నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన నేను రెట్టించిన ఉత్సాహంతో నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉన్నాను. గత నాలుగేళ్లుగా భౌతికంగా నన్ను నిర్మూలించడానికి ప్రయత్నించిన, నీ ప్రయత్నాలన్నీ నన్ను మరింతగా మోటివేట్ చేసి, ప్రజాసేవ చేయడానికి దోహదపడ్డాయి బుజ్జి కన్నా… అని అన్నారు. మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. నీ దారిలో నువ్వు… నా దారిలో నేను ఎన్నికల్లో పోటీ చేసుకోవాలి. అక్కర్లేని సంబంధాన్ని ఇక్కడి నుంచి తెంచుకుందాం మిత్రమా అని పేర్కొన్నారు. రాజీనామాను అంగీకరించమని అడగడం ఒక ఫార్మాలిటీ. రాజీనామాను అంగీకరించిన అంగీకరించకపోయినా నేను రాజీనామా చేసినట్లే.

కానీ అడగడం అనేది సభ మర్యాద. సభా మర్యాద ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించినట్లుగా తెలియజేయాలని కోరుతున్నానన్నారు. గతంలో కొంతమంది వై చీప్స్ గాళ్లు నన్ను రాజీనామా చేయమన్నారు. డిస్ క్వాలిఫై చేయమని అడిగారు కదా… నేను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించడమే కాకుండా, రాజీనామా చేస్తే భయపడి చేసినట్లు అవుతుందని చెప్పాను.. అయినా కొంతమంది కారు కూతలు కూశారు. ఆ కారు కూతలు కూసిన వారికే చెబుతున్నానని అన్నారు.

పిల్ల సజ్జలకు చెందిన రెండు చానల్స్ వైయస్ జగన్ దెబ్బకు భయపడ్డారని వార్తా కథనాన్ని ప్రసారం చేశాయి. అంత వీరుడా జగన్మోహన్ రెడ్డి? ఆయన దెబ్బకు భయపడడానికి అంటూ రఘురామ కృష్ణంరాజు సెటైర్లు వేశారు. నాలుగేళ్లు ఛాన్స్ ఇచ్చాను… ఎంత మగాడివో ప్రూవ్ చేసుకోమ్మని, దిక్కుమాలిన పోలీసులను పంపించి దొంగ అరెస్టు చేయించి, చీకట్లో దెబ్బలు కొట్టించే తింగరి వేషాలను వేయాల్సిందే తప్ప, ప్రత్యక్షంగా నన్ను ఎదుర్కోలేవని జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

మీ ఎన్నికలను మీరు చూసుకోండి… మా ఎన్నికలను మేం చూసుకుంటాం. చెత్త మాట్లాడవద్దు. చెత్త మాట్లాడితే నేను కూడా భయంకరమైన చెత్త మాట్లాడగలను. గోదావరి జిల్లాకు చెందిన వారం… మేము బూతులు మాట్లాడితే, చెవుల్లోంచి రక్తాలు కారాల్సిందేనని ఒకప్పటి వైకాపా సహచరులకు చెబుతున్నానన్నారు. ఇక ఇప్పుడు మనం విడిపోయాం, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

పొత్తులపై స్పష్టత వస్తే ఒక పార్టీ అభ్యర్థిగా నేను… స్పష్టత రాకపోతే కూటమి భవిష్యత్తు అభ్యర్థిగా నేనే
తెదేపా, జనసేన, బిజెపి పొత్తులపై స్పష్టత వస్తే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఒక పార్టీ అభ్యర్థిగా ఈనెల 28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు లో నిర్వహించే తెదేపా, జనసేన బహిరంగ సభలో పాల్గొంటానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఒకవేళ పొత్తులపై స్పష్టత రాకపోతే, కూటమి భవిష్యత్ అభ్యర్థిగా బహిరంగ సభకు హాజరవుతానన్నారు. అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే సమయంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొత్తులోకి జనసేన తో పాటు బిజెపి కూడా త్వరలోనే రావచ్చునని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

మూడు పార్టీల పొత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత ఎంపీ అభ్యర్థుల ఖరారు తోపాటు, మిగిలిన అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసి ఏకకాలంలో ప్రకటిస్తామన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈనెల 28వ తేదీ లోగా ఆ ప్రకటన వస్తే కూటమి తరపున ఒక పార్టీ అభ్యర్థిగా బహిరంగ సభలో పాల్గొంటానన్నారు. తెదేపా, జనసేన ఆధ్వర్యంలో ప్రతిపాడు లో నిర్వహించే బహిరంగ సభను తాడేపల్లి ప్యాలెస్ ఏడ్చే విధంగా సక్సెస్ చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

సీనియర్ సిటిజన్ తో అసభ్యంగా మాట్లాడిన సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలి
ఒక సీనియర్ సిటిజన్ తో అసభ్యంగా మాట్లాడిన తిరుపతికి నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ, సిఐలను తక్షణమే సస్పెండ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. రమణ దీక్షితులు మాట్లాడిన మాటలను రామచంద్రయ్య యాదవ్ తన లెటర్ హెడ్ పై రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామచంద్రయ్య చేసిన పోస్టును ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ గా పనిచేసి, జర్నలిజం వృత్తిలో 40 ఏళ్ల పాటు కొనసాగిన పి. రాధాకృష్ణ ప్రసాద్ ఫార్వర్డ్ చేశారు.

రాధాకృష్ణ ప్రసాద్ తనయులలో ఒకరైన ఉమేష్ చంద్ర న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగా, మరొక కుమారుడు పశ్చిమబెంగాల్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా విధులను నిర్వహిస్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన రాధాకృష్ణ ప్రసాద్ తో తిరుపతి పట్టణంలోని ఒక పోలీస్ స్టేషన్ కు చెందిన సీఐ, ఎస్ఐలు ఏరా… ఒరేయ్, నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధించడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడడం దారుణం. పోలీసులకు ఫోన్ చేసి బెదిరించే అధికారం ఉందా? నిబంధనలు అందుకు అంగీకరిస్తాయా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

ఒక పార్టీ అధ్యక్షుడు లెటర్ హెడ్ మీద రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాన్ని ఫార్వర్డ్ చేస్తే బెదిరింపులకు పాల్పడడం ఏమిటంటూ నిలదీశారు. పోలీసులు ఇప్పటికైనా ఈ బరితెగింపు విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారని, ఒకవేళ కేసు నమోదు చేస్తే నోటీసులు ఇవ్వాలే కానీ బెదిరింపులకు పాల్పడడం ఏమిటంటూ నిలదీశారు. ఈ విషయంలో తక్షణమే రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకొని సీనియర్ సిటిజన్ కు క్షమాపణలు చెప్పించాలని కోరారు. అలాగే తిరుపతి ఎస్పీ స్పందించి ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేయాలన్నారు.

వైకాపాకు ఎందుకు ఓటు వేయాలి? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా అమలు చేశారా?
రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఎందుకు ఓటు వేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా? సిద్ధం సభ ద్వారా సిద్ధం అంటే ప్రజలు ఓటు వేయాలా? అంటూ ఒక అజ్ఞాత రచయిత ప్రశ్నించినట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రశ్నలను సంధించారని పేర్కొన్నారు.. సిద్ధం సభలో గొప్పలు చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకపోతే దోషులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు.

120 సార్లు బటన్ నొక్కానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, 200 సార్లు రిజర్వ్ బ్యాంకు వద్ద నుంచి ఓడి తెచ్చిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి, ఇప్పుడు వారిని ఎందుకు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని ఏదో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. మూడు రాజధానులు చేస్తామని చెప్పి, ఉన్న రాజధానిని లేకుండా చేశారని సదరు రచయిత మండిపడ్డారన్నారు . ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన తప్పులన్నింటిని ఆయన తూర్పారబట్టారన్నారు.

LEAVE A RESPONSE