వైసీపీ ట్రాప్ లో పడకండి

కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేయండి
చిత్తూరు జిల్లా కార్యవర్గం సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు

వైసీపీ నాయకులు తాము ఓడిపోతున్నామనే నిర్దారణకు వచ్చేశారు.. అందుకే రకరకాల కుయుక్తులతో జన సైనికులను, వీర మహిళలను, జనసేన శ్రేణులను గందరగోళపరచే కుట్రలు చేస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి  కె.నాగబాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఎవరూ వైసీపీ ట్రాప్​లో పడవద్దని సూచించారు. జనసేన, టిడిపి, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన చిత్తూరు జిల్లా కార్యవర్గం సమావేశంలో  నాగబాబు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించుకునేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పని చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన, పార్టీ కోసం నిలబడిన ప్రతీ ఒక్కరికీ ఉమ్మడి ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అవకాశం కల్పిస్తారని అన్నారు. వైసీపీ నాయకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసత్యపు ఫోటో మార్ఫింగ్, వీడియోలు తయారుచేసి సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారని, అవి చూసిన కొందరు నిజమేననే భ్రమలో తొందరపాటుగా స్పందిస్తున్నారని తెలిపారు.

మీ దృష్టికి వచ్చిన ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకుని అవసరం అయితే బాగా తెలిసిన వారితో చర్చించి నిర్ధారించుకున్న తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని చెప్పారు. జనసేన పార్టీ వైసీపీ లాంటిది కాదని, జనసేన పూర్తి ప్రజాస్వామ్య విధానాలతో పని చేస్తోన్న పార్టీ అని పునరుద్ఘాటించారు. ప్రస్తుత రాజకీయ రణరంగంలో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెట్రేగి పోతోందని, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రతీ నియోజక వర్గంలో కుట్రలు చేసి నెగ్గాలనే దుర్బుద్ధితో వైసీపీ నాయకులు ఉన్నారని అన్నారు. జనసేన అభ్యర్థులకు జన సైనికులు, వీర మహిళలు మనో ధైర్యాన్ని పెంచాలని, మన సహచర పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.

పవన్ కళ్యాణ్  మాట మనందరికీ శిరోధార్యం :  వేములపాటి అజయ్ కుమార్
జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  మాట జన సైనికులుగా మనందరికీ శిరోధార్యం అని జాతీయ మీడియా అధికార ప్రతినిధి  వేములపాటి అజయ్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా ఆ అభ్యర్థి గెలుపు, అత్యధిక మెజారి టీపైనే మనమంతా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. కూటమి గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ ఏకతాటిపై నడవాలని చెప్పారు.

ఐకమత్యంతో పనిచేసి అత్యధిక మెజారిటీ సాధిస్తాం : డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పొత్తులో భాగంగా తిరుపతిలో జనసేన పార్టీని గెలిపించుకునేందుకు తిరుపతి జనసేన కార్యవర్గం అంతా ఐకమత్యంతో పనిచేసి అత్యధిక మెజారిటీ సాధిస్తామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. లోకల్, నాన్ లోకల్ అనేది దుష్ప్రచారం అని, తిరుపతి ప్రజలంతా జనసేన పార్టీకి ఓటేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, తిరుపతి ఇంచార్జీ కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షుడు జె.రాజా రెడ్డి, భీమిలి ఇంఛార్జి  పంచకర్ల సందీప్, పార్టీ నేతలు  కీర్తన,  సుభాషిణి,  వనజ,  శ్యామల,  రాజేష్ యాదవ్,  మధు బాబు,  ఆనంద్,  కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply