– వైసీపీ క్యాడర్ కు మంత్రి సవిత హితవు
పెనుకొండ : జగన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకు బలికావొద్దని వైసీపీ యువతకు, కార్యకర్తలకు మంత్రి సవిత హితబోధ చేశారు. పెనుకొండ పట్టణంలో శనివారం అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన అనంతరం ఆమె విలేకరులతో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు.
ఉచిత ఇసుక, మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అమలు చేస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసి పేదల కడుపు నింపామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, పెన్షన్లను రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచామన్నారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశామన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి జగన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడన్నారు. ప్రజల్లో ఉనికిని కోల్పోతున్నానన్న భయంతో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు తెర తీశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్… మీడియా ఎదుట రపా…రపా…అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
వైసీపీలో ఉన్న యువకులను, కార్యకర్తలను తప్పుడు ప్రచారాలతో జగన్ రెచ్చగొడుతున్నాడన్నారు. శవ రాజకీయాల చేయడం ఆయనకు అలవాటు మారిందన్నారు. ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే, అంబులెన్స్ పిలిచి ఆసుపత్రికి పంపిస్తామన్నారు. వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందే పడి ప్రాణం కోల్పోయినా, మానవత్వం లేకుండా రోడ్డు పక్కకు ఈడ్చి పడేశాడన్నారు. ఆయన మాటలు వింటే నష్టపోయేది వైసీపీ కార్యకర్తలేనన్నారు. జగన్ క్షుద్ర రాజకీయాలకు బలికావొద్దని వైసీపీ కార్యకర్తలకు, యువతకు మంత్రి సవిత పిలుపునిచ్చారు.