మేనిఫెస్టో అనేది…అమాయక జనం అనే భ్రమ తో…ఓట్లు దండుకోవడానికి… రాజకీయ పార్టీలు విసిరే ఓ మాయ వల. నీళ్ళల్లో పైకి కనపడని చేపలను పట్టడానికి… ఓ మత్స్యకారుడు విసిరే వల లాటిదే ఈ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోను తీరు తెన్నులు, తాయిలాల పరిమాణాన్ని బట్టే….సమాజం పట్ల ఆ రాజకీయ పార్టీకి గల నిబద్ధతను, ఉద్దేశాలను…. , చిత్త శుద్ధి…లేదా దురుద్దేశాలను అంచనా వేసేయవచ్చు.
ఓ రాజకీయ పార్టీ…. ఓటర్ నాడిని పట్టుకోగలిగిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా… ఉచితాలతో ఊదర గొట్టేయవచ్చు అని రాజకీయ పార్టీలు అనుకుంటుంటాయి. అంతే తప్ప ; జనం తమ చేష్టలను గమనిస్తున్నారని ఏ పార్టీ అనుకోదు. కానీ, వీటికి కాలం చెల్లింది. ఏ పార్టీ అయినా సమాజ శ్రేయస్సు కోరుతున్నదా…. పబ్బం గడుపుకుని, అందినంతవరకు దండుకుందామని అనుకుంటున్నదా అనే విషయం కూడా జనం గమనిస్తున్నారు .
ఉచితాలను ఆరగించడానికి అలవాటు పడిన సామాజిక వర్గాలను తలపించే ఓటర్లే కాదు ; సమాజం అంటే.
ఉచితాలు ఆశించ కుండా…సామాజిక బాధ్యతతో వ్యవహరించే పౌరులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వారు… పార్టీల వారు విదిలించే తాయిలాలకు ఆశపడరు . ఎవరి కష్టార్జితాన్నో తమకు అప్పనంగా దోచిపెట్టాలని కోరుకోరు.
ప్రభుత్వాలకు నేతృత్వం వహించే రాజకీయ పార్టీలు… ప్రజల పట్ల నిజాయతీతో…పారదర్శకం గా వ్యవహరిస్తున్నాయా. . లేదా అని చూస్తారు. మాటల కంటే… చేతల్లోని చిత్తశుద్ధినే ప్రజలు విశ్వసిస్తారు . “వారిలో” అది కనపడనందు వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఆయనకు ఓ 11 ఇచ్చి సరి పెట్టారు. గోచీ కి ఎక్కువ…. లంగోటాకు తక్కువ అన్నట్టుగా… ఈ పదకొండు సీట్లతో ఏం చేయాలో తెలియక…. ‘ మద్య శ్రీ ‘ లు, మతి తప్పి ఏదేదో మాట్టాడుతున్నారు.
ఏవో నాలుగు తాయిలాలు వాళ్ళ మొహాన కొట్టి, అధికారం చేజిక్కించుకోవచ్చుననే ట్రెండ్ తో ఇక కుదరదని మన రాజకీయ పక్షాల వారు గమనించాలి. ప్రజల నాడిని పట్టుకోవాలనే ప్రయత్నం, చిత్త శుద్ధి వాటిల్లో కనిపించడం లేదు.
కొన్ని కొన్ని మేనిఫెస్టోలు చూసినప్పుడు….. పుట్టెడు దుఃఖం కలుగుతుంటుంది.
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు…. తెలుగు దేశం, వైసీపీ పార్టీలు ఓటర్లపై విసిరిన ఈ మేనిఫెస్టోలను ఒకసారి చూస్తే…. మనసు వికలమవుతుంటుంది. ఎంత సేపూ ఏ వర్గానికి ఏ తాయిలాలు విదిలించి, ఆ వర్గం ఓట్లు కొల్లగొడదామా అనే ఆలోచనలే మన రాజకీయ పక్షాలను ఇప్పటికీ నడిపిస్తున్నాయి.
కానీ, తాయిలాలు ఓట్లు కురిపించవు అనే విషయాన్ని 2024 లో మన రాష్ట్రం లోని ” తాయిలాల లబ్ది దారులు “, ఇప్పుడు తమిళనాడు ” తాయిలాల లబ్ధిదారులు “, బెంగాల్ ” తాయిలాల లబ్ది దారులు ” నిరూపించారు.
పాతుకు పోయిన రెండు పార్టీలలో…. పాలనా పరమైన చిత్తశుద్ధి రెండు పార్టీలలోనూ కొరవైనప్పుడు…. ప్రజలు మూడవ ప్రత్యామ్నాయం వైపు చూస్తారని కూడా తమిళనాడు ఫలితాలు ఎత్తిచూపుతున్నాయి.
ఒకరినొకరు పొగుడుకోవడం కొన్నాళ్ళు ఆపి ;ఈ ఫలితాల నుంచి తాము నేర్చుకోవలసింది ఏమైనా ఉన్నదేమో తెలుగు దేశం సారధ్య కూటమి తమ్ముళ్లు ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది. అలాగే, తమిళనాడు లో కమల్ హాసన్, రజనీకాంత్, శివాజీ గణేషన్ లాటి మహామహులు బోర్లా పడిన చోట…పార్టీ పెట్టిన 14 నెలల్లోనే విజయ్ అనే నటుడు ఎలా విజయం సాధించాడో… 12 ఏళ్ళ క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తాలూకు అంతర్గత బృందం ఆత్మావలోకనం చేసుకోవాలి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి వైసీపీ పోటీ కాదు.వైసీపీ కి అధికారం అప్పగిస్తే ; రాష్ట్రం ఎలా ఉంటుందో మొన్న ఒకసారి చూసారు. అయితే అది ట్రయిల్ పార్టీ యే నని ; ఈసారి అధికారం లోకి వస్తే ఫుల్ సినిమానే చూపిస్తామని ఆ పార్టీ నేతలు బహిరఁగంగానే చెబుతున్నారు. మరో సారి అధికారానికి తాను అర్హురాలిని అనే భావాన్ని వైసీపీ పార్టీ ప్రజలకు కలిగించడం మానేసి, వాణ్ణి నరుకుతా…. వీడిని పొడుస్తా…. వాళ్ళ బట్టలు ఊడ దీస్తా అంటూ చిందులు వేస్తున్నది. కనుక, దానికి మరో సారి ప్రజలు అధికారం అప్పగించే ప్రశ్నే లేదు , అందువల్ల, దానినుంచి కూటమికి భయమే లేదు. కూటమికి అసలైన పోటీ మరొకటి ఉంది.
అది… ఎవరో కాదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ తో కూడిన కూటమే!
ఈ కూటమి పాలన లో చిత్తశుద్ధి, జవాబుదారీ తనం, నిజాయతీ తో కూడిన నిర్ణయాలు, వాటి అమలు తీరు ప్రజలకు స్పష్టంగా కనిపించక పోతే ; కూటమే…. కూటమి పాలిట రాజకీయ శత్రువుగా పరిణమిస్తుంది. ప్రతి చిన్న, పెద్ద విషయానికీ మొదటి పేజీ ప్రకటనలు, అనుకూల మీడియా భజనలు, కూటమి నేతలను ముంచెత్తే అన్నమాచార్య కీర్తనలు, అధికార, అనధికారులపై చంద్రబాబు నాయుడు అడపా దడపా వ్యక్తం చేసే ఆగ్రహావేశాలు, హెచ్చరికలు, విజనరీజం, 79 ఏళ్ళ చురుకుదనం మొదలైన సద్గుణాలు వేటినీ ఓటర్లు పట్టించుకోరు. తమిళనాడులో డీఎంకే కి కర్త, కర్మ, క్రియ అయిన స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొలత్తూరు లో ఓడిపోయారు. ఈ ఓటమిని కూటమి పరిగణన లోకి తీసుకోవాలి. స్పీచ్ లు పని చేయవు.
“నువ్వు నిజాయతీగా ఉన్నావా? నీ మాటల్లో… చేతల్లో చిత్త శుద్ధి ఉందా?” అనే విషయం ఒక్కటే… ఓటర్ల మనసులను గెలుచుకుంటుంది.
బ్లఫ్ మాస్టర్ల రోజులు పోయాయి . ఇప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాల ను ఎవరికి నచ్చిన రీతిలో వారు విశ్లేషంచుకోవచ్చు.
– కళారత్న భోగాది వేంకట రాయుడు