Suryaa.co.in

National

డా. బాబీ ముక్కామలకు ఆచార్య యార్లగడ్డ చేతుల మీదుగా ఘన సత్కారం

– అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం

ఫ్లింట్ (మిచిగన్): అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఈ ఎన్ టి వైద్యుడు డా. బాబీ ముక్కామలకు ఫ్లింట్ నగరంలో ఘన సత్కారం లభించింది. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ముక్కామల అధ్యక్ష పదవికి ఎంపిక కావడం భారతీయులకే కాక, ప్రపంచ వైద్య వృత్తికి గర్వకారణం అన్నారు. సేవా నిరతి, సామాజిక బాధ్యత, నైతిక విలువలు కలగలిసిన డాక్టర్ ముక్కామల వంటి వ్యక్తిని గౌరవించడం మనల్ని మనం గౌరవించుకోవటమే అవుతుందన్నారు.
డా. ముక్కామల గత పదిహేనేళ్లుగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో పలు బాధ్యతలు నిర్వహిస్తూ, వైద్య రంగంలో కీలక మార్పులకు పునాదులు వేసారు. ఇటీవలి ఎన్నికతో ఆయన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 180వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తికి తొలిసారి లభించిన గౌరవంగా ఇది చరిత్రలో నిలిచి పోనుంది.

ఇటీవల మెదడు కణితి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఘనత కూడా ఆయనకు దక్కింది. సన్మాన కార్యక్రమంలో భారతీయ అమెరికన్ వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, ముక్కామల మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE