Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో ఏడాది పాలన.. మెరుపులు! మరకలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అపూర్వ విజయం సాధించిన సందర్భంగా దుష్ట పాలనను ప్రజలు అంతమొందించిన రోజుగా కూటమి పార్టీలు విజయోత్సవాలు నిర్వహించగా, సూపర్ 6 హామీలు అమలు చేయలేదంటూ వెన్నుపోటు దినంగా వైకాపా నిరసన ప్రదర్శనలు చేసింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12, 2025 నాటికి ఒక ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా పాలనా దక్షునిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమేరకు నెరవేర్చింది, వారసత్వంగా సంక్రమించిన ఆర్ధిక ఒత్తిళ్లను తట్టుకుంటూ అభివృద్ధిని ఎలా సాధించ గలుగుతోంది అనేది చర్చనీయాంశంగా మారింది.

అభివృద్ధిని విస్మరించిన సంక్షేమం ప్రజల మన్ననలు పొందదని 2024 ఎన్నికలు రుజువు చేశాయి. నిజానికి అభివృద్ధి, సంక్షేమం రెండు జోడు గుర్రాల వంటివి. ఏది కుంటుపడినా బండి నడక ఆగిపోతుంది. అందుకే సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ఎన్డీయే ప్రభుత్వం సమ ప్రాధాన్యత కల్పిస్తోంది.

సంక్షేమ రాజ్యం..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానంతరం నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి ఐదు సంతకాలైన మెగా డీఎస్సీ, ప్రజలలో భయాన్ని రేకెత్తించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, సామాజిక పింఛన్ల నగదు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, రాష్ట్రంలో నైపుణ్య గణన నిర్వహణలను అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌, 2024నుంచే సామాజిక పింఛన్లను 4వేలకు పెంచి ఏడాదిలో దాదాపు రూ.34వేల కోట్లు సుమారు 64 లక్షల మంది పింఛనుదారులకు అందించడం జరిగింది.

దీపం 2 పధకం ద్వారా కోటి మందిమహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేశారు. దేశంలోనే మొదటిగా ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉచిత ఇసుక విధానం, చెత్తపన్ను రద్దు చేయడంతో పాటు మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచారు. రికార్డు స్థాయిలో 54 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రైతులకు 24గంటల్లోనే డబ్బులు చెల్లించామని .. సేద్యానికి ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ, డ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ అందించి వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

గత ప్రభుత్వం నిలిపివేసిన 98 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో 74 పధకాలను పునరుద్ధరించారు. జూన్ 20న అన్నదాతా సుఖీభవ మరియు ఆగష్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాలు అమలు చేయబోతున్నారు. కాగా జూన్ 12న తల్లికి వందనం పధకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన విద్యార్థుల తల్లుల (35,44,459 మంది తల్లులు, సంరక్షకులు) ఖాతాలోకి రూ.8,745 కోట్లు జమ చేసి పధకాన్ని సూపర్ హిట్ చేశారు.

సంక్షేమానికి చిరునామా అని చెప్పుకునే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇంటికొక బిడ్డకు (42,61,965 మందికి) అమ్మ ఒడి అమలు చేస్తే, ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది బడికెళ్లే పిల్లలుంటే అంతమందికి (67,27,164 మందికి) తల్లికి వందనం అమలు చేసి ప్రజల మనసు గెలిచారు. చంద్రబాబు ప్రతిష్ఠ, అనుభవం, కఠోర శ్రమతో మొదటి సంవత్సరంలోనే 700కు పైగా అభివృద్ధి, సంక్షేమ హామీలను ప్రభుత్వం అమలు చేసిందని కూటమి నాయకులు చెబుతున్నారు.

అభివృద్ధి పధం..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవసరమైన నిధులను సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం, గ్రోత్ ఇంజన్ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. రూ.4,500 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు 20 వేల కిలోమీటర్ల రోడ్లను బాగు చేయడం జరిగింది.

78 ప్రాజెక్టుల ద్వారా రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి షుమారు 6 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంటుకు రూ.11,400 కోట్లు ప్యాకేజీ సాధించి దానిని ప్రైవేటు పరం కాకుండా రక్షించగలిగారు.

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా జూన్ నెలలో మూడు లక్షల మంది పేదలకు ఇళ్లను అందించి, అదేరోజు వారితో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమరావతిలో ప్రారంభం కాబోతున్న క్వాంటం వ్యాలీ టెక్ పార్కుతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని భావిస్తున్నారు.

కట్టుతప్పుతున్న ప్రజా ప్రతినిధులు..

కూటమి ప్రభుత్వపరంగా ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరగడం వలన ప్రజలలో ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడిందనేది సత్యం. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంపై ద్రుష్టి సారించి సుపరిపాలన అందిస్తుంటే, మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక, గ్రావెల్, మద్యం, బూడిద తదితర అవినీతి కార్యక్రమాలలో మునిగిపోయి ప్రజల దృష్టిలో పలచన కావడమే కాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు.

గతంలో వైకాపా అవినీతి చేసింది మనమెందుకు చేయకూడదని వారు భావిస్తున్నట్లున్నారు. అనేకసార్లు ముఖ్యమంత్రి హెచ్చరించినా వారిలో ఎటువంటి మార్పు లేదు. తెలుగుదేశంలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఇది. టిడిపి 1999 ఎన్నికలలో తటస్థులకు సీట్లు, మంత్రి పదవులు ఇచ్చి చేసిన ప్రయోగం విఫలం అయ్యింది. అలాగే తాజా ఎన్నికలలో కూడా ధనవంతులు, ఎన్నారై లకు సీట్లు ఇచ్చి చేసిన ప్రయోగం వికటించినట్లే కనిపిస్తోంది.

ఇటీవల కె కె సర్వేలో కూడా అత్యధిక శాతం ప్రజలు చంద్రబాబు పాలనపై సంతృప్తి, అనేక మంది శాసన సభ్యులపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో అత్యధికులు పార్టీ కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోకుండా అక్రమ సంపాదనలో నిమగ్నమై ప్రజాభిమానం కోల్పోతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

కూటమి ఎమ్యెల్లేలలో 44 మంది ఒటిపి (వన్ టైం పొలిటీషియన్) లేనని, వారు ఎట్టి పరిస్థితిలోను గెలిచే అవకాశం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. కూటమి ప్రభుత్వానికి తలవంపులుగా మారిన ఇటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకుంటేనే కూటమి ప్రతిష్ట నిలబడుతుంది.

వైకాపా అరాచకాలను ఎదిరించి జెండా మోసిన తమను ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్లక్ష్యం చేయడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కార్యకర్తలకు న్యాయం జరగాలి. ఎలాంటి చిన్న అవకాశాన్నైనా ఆయుధంగా మలచుకుని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష విధానాలను దీటుగా ఎదుర్కొనే.. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా ప్రజలకు తెలియచేసే క్రియాశీలక పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి.

కూటమి పార్టీల మధ్య సఖ్యత కోసం నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు వేగవంతం చేయాలి. ఇప్పటికైనా మాటలు కాకుండా “పొలిటికల్ గవర్నెన్స్” పాటించి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా, అవినీతి రహిత సుపరిపాలన అందిస్తే కూటమి తిరుగులేని ప్రజాభిమానం చూరగొంటుంది.

– లింగమనేని శివరామ ప్రసాద్
(రాజకీయ, సామాజిక విశ్లేషకులు )
7981320543

LEAVE A RESPONSE