Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి

– చోద్యం చూస్తోన్న జగన్ రెడ్డి ఎంపీలు
– రాష్ట్రాన్ని అధోగతిలోకి నెట్టిన ప్రాంతీయ పార్టీలు
– వ్యవసాయరంగానికి చేయూత ఏదీ ?
– చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా
డిజిటల్ భారత్ పేరుతో పేదల జీవితాలు చిన్నాభిన్నం
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావన లేకపోవడం దారుణం అన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసి ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందని ఎద్దేవా చేశారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు అయన ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని, వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను శైలజనాథ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని అన్నారు. దేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు.

నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కంటాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని, వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు.

వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్న కేంద్ర ఆర్ధిక మంత్రి, ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపి ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. వర్క్ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక్షన్ లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరినా, ఇన్కమ్ టాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నా కేంద్ర బడ్జెట్లో వీటికి అవకాశం కల్పించలేదని, పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయకపోవడం శోచనీయం అన్నారు.

చోద్యం చూస్తోన్న జగన్ రెడ్డి ఎంపీలు
కేంద్రంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ మెడలు వంచుతామన్న జగన్ రెడ్డి పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారని శైలజనాథ్ ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని గతంలో పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రభుత్వం వద్ద వైసీపీ ఎంపీలు మోకరిల్లారని ఆరోపించారు. ప్రజలకు మాయ మాటలు చెబుతూ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని ఆర్ధికంగా, సామాజికంగా దారుణమైన స్థితికి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల్లో ముఖ్యమై ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు, విశాఖ రైల్వే జోన్ గానీ, పోలవరానికి, రాజధానికి నిధుల కేటాయింపు ప్రస్తావన చేయలేదంటే మోదీ ప్రభుత్వం ఆంధ్రాకి చేసే ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసని శైలజనాథ్ గుర్తుచేశారు.

LEAVE A RESPONSE