-తెనాలిని సుందరా నగరంగా తీర్చిదిద్దాలి
-మున్సిపల్ కమిషనర్ తో పెమ్మసాని
‘తెనాలి శివారుల్లోని డంపింగ్ యార్డ్ నుంచి ఉత్పన్నం అవుతున్న దుర్గంధం వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై పడేస్తున్న చెత్త, బొండాలు వంటి వ్యర్ధాల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్టోబర్ కల్లా ఆ డంపింగ్ యార్డ్ తొలగింపు చర్యలు ప్రారంభించాల్సిందే.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
పెమ్మసానిని ఆయన నివాసంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శనివారం వచ్చి కలిశారు. ఈ సందర్భంగా తెనాలి ప్రధాన సమస్యలలో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సెగ్రిగేషన్, తరలింపు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ కు ఆనుకుని ఉన్న రోడ్లపై చెత్త వేయకుండా నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయించాలని, భద్రతాపరంగా స్థానిక వార్డు కౌన్సిలర్లను వాలంటీర్లుగా బాధ్యత తీసుకునేలా సంప్రదించాలని ఈ సందర్భంగా పెమ్మసాని సూచించారు.
అలాగే తెనాలి పట్టణాన్ని సుందరీ కరణ చేసేందుకు గల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రీనరీ, ప్లాంటేషన్ తదితర బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టాలని కమిషనర్ కు స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలి కానీ, పనులు మాత్రం ఆలస్యం కాకుండా చూడాలని తెలిపారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ లోపు టెండర్ల దశను పూర్తి చేయించి, అక్టోబర్ మొదటి వారంలో యార్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.