• సీపీఎస్ రద్దు పేరుతో ఉద్యోగుల్ని వంచించాడు.. మద్య నిషేధమని చెప్పిమహిళల్ని మోసగించాడు
• జీతాలు పెంచుతానని, డీఏలు, ఇతర బకాయిలు ఇస్తానని చెప్పి ఉపాధ్యాయుల్ని, అంగన్ వాడీ సిబ్బందిని, పారిశుధ్యకార్మికుల్ని, 108-104 సిబ్బందిని వంచించాడు. ఆఖరికి వాలంటీర్లను కూడా మోసగించాడు
• ప్రజలు జగన్ రెడ్డినే మార్చాలనే నిర్ణయానికి వచ్చారు
– టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి
రైతుభరోసా కేంద్రాలు పూర్తిగా విఫలమయ్యాయని, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం ఘోరంగా వ్యవహరించాయని, దాని ఫలితమే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచిందని, సాగునీటి రంగాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా గాలికి వదిలేశాడని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ చంద్రబాబునాయుడు ప్రతిసోమవారాన్ని పోలవారంగా మార్చి, పోలవరం ప్రాజెక్ట్ ను 72శాతం పూర్తిచేస్తే, జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, కమీషన్ల కక్కుర్తితో జాతీయప్రాజెక్ట్ ను సర్వనాశనం చేశాడు. అకాలవర్షాలు, తుఫాన్ల వల్ల నష్టపోయిన రాష్ట్రరైతుల్ని ఆదుకోవడంలో కూడా జగన్ రెడ్డి విఫలమయ్యాడు. అధికారంలోకి రావడానికి ముందు యువతకు అనేక హామీలిచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక వారిని గంజాయి, కల్తీ మద్యానికి బానిసల్ని చేశాడు.
2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ నిర్వహణ వంటి హామీల్ని జగన్ విస్మరించా డు. ఆఖరికి టీడీపీ హాయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని కూడా ఏపీ నుంచి తరిమేశాడు. చంద్రబాబు తన పాలనలో 6 లక్షల మంది యువతకు నిరుద్యోగభృతి ఇస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఆ భృతి నిలిపేశాడు. చంద్రబాబు యువతకు ఉపాధి కల్పిస్తే, నేడు జగన్ వారిని మాదకద్రవ్యాలకు బానిసల్ని చేసి, రాష్ట్ర భవిష్యత్ ను నిర్వీర్యం చేశాడు.
తన పాలనలో జగన్ రెడ్డి ఎప్పుడూ తానుఇచ్చిన హామీలకు కట్టుబడలేదు..మాటపై నిలబడలేదు
4 ఏళ్ల 8 నెలల పాలనలో జగన్ రెడ్డి ఎప్పుడూ మాటపై నిలబడలేదు. మద్యనిషేధం హామీ ఏమైందో ముఖ్యమంత్రి మహిళలకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి విక్రయిస్తున్న కల్తీ మద్యం తాగి మరణించిన వారి సమాధుల పునాదలపై తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్న జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక 9 సార్లు పెంచాడు. వాటికి తోడు వివిధ రకాల పన్నులు, ఆఖరికి చెత్తపై కూడా పన్నులేసి చెత్తముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కాడు.
సీపీఎస్ రద్దుచేస్తానని ఉద్యోగుల్ని నమ్మించిన జగన్ రెడ్డి, నేడు వారికి సకాలంలోజీతాలు ఇవ్వకుండా పనిభారం పెంచి వారిని వేదిస్తున్నది నిజం కాదా? ఉపాధ్యాయులపై కక్షకట్టి, వారిని హింసిస్తున్నది నిజం కాదా? జగన్ రెడ్డిని నమ్మిన పాపానికి నేడు అంగన్ వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు, పారిశుద్యకార్మికులు, 108-104 వాహనాల సిబ్బంది రోడ్లెక్కారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం అంగన్ వాడీలకు ఇస్తానన్న జగన్ రెడ్డి, హామీలు నెరవేర్చమన్న వారిపై ఎస్మా చట్టం ప్రయోగించాడు. ఆఖరికి తాను తీసుకొచ్చిన వాలంటీర్లను కూడా జగన్ మోసగించాడు. వారితో వెట్టిచాకిరీ చేయిస్తూ జీతాలు పెంచకుండా వారిని వేధిస్తున్నాడు.
నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడుతున్నజగన్ రెడ్డి మోసకారీ సంక్షేమంతో ప్రజల్ని వంచిస్తున్నాడు
జగన్ రెడ్డి అమలుచేస్తున్నది మోసకారీ సంక్షేమమే. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడుతున్నాడు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలుచేసిన 130కి పైగా సంక్షేమపథకాల్ని జగన్ రెడ్డి రద్దుచేశాడు. విదేశీవిద్య, పెళ్లి కానుక, చంద్రన్నబీమా, స్టడీసర్కిళ్ల వంటి అనేక కార్యక్రమాలు రద్దుచేశాడు. జగన్ రెడ్డి మోసకారీ సంక్షేమంతో పేదల్ని మరింత పేదలుగా మార్చాడు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీయువతకు స్వయంఉపాధి రుణాలు అందించి వారికాళ్లపై వారు నిలబడేలా చేస్తే, జగన్ రెడ్డి ఇన్నేళ్లలో ఒక్కవర్గంలో ఒక్క యువకుడికి కూడా రూపాయి ఇవ్వలేదు. అమ్మఒడి పేరుతో తల్లులకు ఏటా రూ.13వేలు ఇస్తున్న జగన్ రెడ్డి, నాన్నబుడ్డి కింద ఏటా రూ.75వేలు కొట్టేస్తున్నాడు.
రాష్ట్రంలోని కొద్ది మంది డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఇస్తూ, వారినుంచి వివిధ ట్యాక్సులు, పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో ఏటా లక్షకు పైగా కొట్టేస్తున్నాడు. చంద్రబాబు తన పాలనలో వివిధ వర్గాల యువతకు ఇన్నోవా కార్లు ఇచ్చి వారిని యజమానుల్ని చేశాడు. జగన్ రెడ్డి బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించింది నిజం కాదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు 16వేలకు పైగా పదవులు దూరం చేసింది నిజం కాదా? ఎస్సీ..ఎస్టీ.. బీసీ.. మైనారిటీలు అంటే జగన్ రెడ్డికి చిన్నచూపు. వారు సంతోషంగా ఉండటం.. సమాజంలో పైకిరావడం జగన్ కు సుతరామూ ఇష్టం లేదు. కోడికత్తి డ్రామాలాడి అమాయకుడైన దళిత యువకుడిని ఐదేళ్లకు పైగా జైల్లోనే మగ్గబెట్టాడు.
తన రంగులపిచ్చితో జగన్ రెడ్డి పేదల్ని గూడులేనివారిగా మార్చి రోడ్లపాలు చేశాడు. చంద్రబాబు పేదలకోసం కట్టించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేసి, వాటిని సకాలంలో వారికి ఇవ్వకుండా వేధించింది నిజంకాదా? సర్వేరాళ్లు, పట్టాదార్ పాసుపుస్తకాలపై జగన్ తన బొమ్మలు వేసుకోవడం ఏమిటి? ఆ భూములు ఆయనేమైనా రైతులకు ఇచ్చాడా? ఆఖరికి మరుగుదొడ్లపై కూడా జగన్ రెడ్డి తన బొమ్మలు వేసుకుంటున్నాడు.
అలీబాబా 40 దొంగల్లా జగన్ రెడ్డి.. సజ్జల అండ్ కో తయారయ్యారు
అలీబాబా 40 దొంగల్లాగా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి తయారయ్యారు. ఎస్సీ…ఎస్టీ..బీసీ,..మైనారిటీల నిధుల్ని కూడా దిగమింగారు. రాజ్యాంగబద్దంగా వారికి అందాల్సిన వాటిని లేకుండా చేశాడు. ఆయా వర్గాల కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి, వాటికి కేటాయించిన నిధుల్ని కూడా దారిమళ్లించా డు. చివరకు కేంద్రప్రభుత్వమిచ్చిన నిధుల్ని కూడా దుర్వినియోగం చేశాడు. ఎస్సీ..ఎస్టీ..బీసీ కార్పొరేషన్ నిధులు దారిమళ్లించే హక్కు జగన్ రెడ్డికి ఎక్కడిది..ఎవరిచ్చారు?
జగన్ రెడ్డి ఏంచేసినా తనస్వార్థంకోసం.. తన వర్గం కోసమే చేశాడు తప్ప, నిజంగా దళితులు, బలహీనవర్గాలకు చేసిందేమీలేదు. జగన్ రెడ్డి చర్యలను బీసీలు, దళితులు గమనిస్తు న్నారు. సరైన సమయంలో వారు చేయాల్సింది చేస్తారు. జగన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థుల్ని మార్చినా ప్రజలు ఆయన్ని నమ్మేస్థితిలో లేరు. జనం జగన్ రెడ్డినే మార్చాలనే నిర్ణయానికి వచ్చేశారు. చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి, తమకు, తమ బిడ్డలకు భవిష్యత్ ఉంటుందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు.” అని గురుమూర్తి స్పష్టం చేశారు.