-30 మంది అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వరట…
-మద్య నిషేధమని మహిళల మనసులను దోచిన జగనన్న ఇప్పుడు పుస్తెలు దోస్తున్నాడు
-మీ బాబుగాడి సొమ్ములా రాజధాని భూమిని ధారాధత్తం చేయడానికి నీకు ఏ హక్కు ఉంది?
-అమరావతిని అభివృద్ధి చేయనని చెబుతూనే… విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తావా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
నవంబర్, డిసెంబర్ మాసాలలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయం. ముందస్తు ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. తన ముఖం చూసే ప్రజలు ఓటు వేశారని, తన ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఏమైనా అధికారాలు ఉన్నాయా?, బటన్ నొక్కాను, అభివృద్ధి పనులన్నీ తానే చేస్తున్నానని పేర్కొంటూనే, ఇప్పుడు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి దోషులను చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తన ముఖమే చూసి ఓట్లు వేస్తారని చెప్పే జగన్మోహన్ రెడ్డి, మూత్రశాలల నుంచి మొదలుకొని అన్నింటా తన ఫోటో ఉండేలా… కాదేది తన ఫోటోకు అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడేమో 30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, రానున్న ఎన్నికల్లో వారికి టికెట్ నిరాకరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అయినా రేపో మాపో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయే వాడిని, అయినా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నానని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు . పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలనే ప్రామాణికంగా తీసుకుంటే, పులివెందులలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంభూపాల్ రెడ్డికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. పులివెందుల పార్టీ పరిస్థితిని తక్షణం సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. పార్టీ శాసన సభ్యులంతా గడపగడపకు తిరగమని ఆదేశించే జగన్మోహన్ రెడ్డి, తాను మాత్రం పరదాల చాటున తిరగడం సిగ్గుచేటు. వై నాట్ పులివెందుల అంటున్న ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పులివెందులలో పోటీ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని కోరడం విడ్డూరంగా ఉంది. పులివెందులలో అధికార పార్టీని ఓడించడానికి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అవసరం లేదని, బీటెక్ రవిని అభ్యర్థిగా బరిలోకి దించి ఓడిస్తామనే ధీమాలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ప్రతిపక్ష పార్టీల నేతలను మా ఊరికి వచ్చి పోటీ చేయమని అడగడం వృధా ప్రేలాపనలే అవుతాయి. ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బయటకు చెప్పడానికి భయపడుతున్నప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్ పై దాడి ద్వారా మొదలైన ప్రభుత్వ పెద్దల ఉన్మాదం తన పైనుంచి డాక్టర్ అచ్చన్న మీదుగా ఇప్పుడు కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ నాయకులపై దాడి చేసే వరకు వెళ్ళింది. బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై రాళ్ల దాడికి పాల్పడిన వ్యక్తిని పిటికేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టు అనంతరం గుంటూరు ఎస్పీ ఆరిఫ్ మాట్లాడిన తీరు, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి అనంతరం అప్పటి డిజిపి సవాంగ్ మాట్లాడినా విధంగానే ఉన్నది. దున్న నితిన్ అనే వ్యక్తి తన నిరసన తెలియజేయడానికే సత్య కుమార్ వాహనంపై రాయి విసిరినట్లుగా పేర్కొన్న జిల్లా ఎస్పీ, ఆ వాహనంలో సత్య కుమార్ లేరని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ అదే వాహనంలో సత్యకుమార్ ఉండి ఉంటే, రాయి తగిలి తల బద్దలైన, వాహనంలో పడిన రాయిని తీసుకొని ఆయనే తన తలను బద్దలు కొట్టుకున్నాడని ఆరిఫ్ చెప్పి ఉండేవారేమో?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విసిరిన రాయి తగిలి సీఐ కనకారావు కు చిన్న పాటి దెబ్బ కూడా తగలకపోయినాప్పటికీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై హత్యాయత్నం , హత్య వంటి చట్టాల కింద కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేశారు. అదే అధికార పార్టీ కార్యకర్త రాళ్ల దాడికి పాల్పడితే… నిరసన తెలియజేయడానికి రాళ్ల దాడి చేశారని కొత్త నిర్వచనం చెప్పిన ఆరిఫ్ ఇదే ప్రభుత్వం లో డీజీపీగా పదోన్నతి పొందాలని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు . సత్య కుమార్ పై జరిగిన దాడి గురించి కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద వ్యక్తితో తాను మాట్లాడినప్పుడు పిచ్చి పరాకాష్టకు చేరినప్పుడు ఇలాంటి పనులు చేస్తారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పకనే ఆయన చెప్పారు. పల్లె రఘునాథ్ రెడ్డి చిన్న నిరసన తెలియజేయగా, ఆయనపై రాళ్లదాడిని చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి చూసుకుంటోంది. శ్రీకాకుళంలో మరొకరిపై ఇదేవిధంగా దాడి చేశారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ దాడుల పర్వం కొనసాగుతోంది. పోలీసు రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావుకు నోటీసులను అందజేయడానికి 30 మంది పోలీసులు వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నోటీసులు ఇవ్వడానికే 30 మంది పోలీసులు వెళితే, విచారణ పేరిట 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించి అవకాశం ఉంది. ఈ తరహా చర్యలు ఇకనైనా ఆపితే మంచిదని రఘురామకృష్ణం రాజు సూచించారు.
రైతులను వేధించడానికే అమరావతిలో ప్లాట్ల పంపిణీ
రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సి ఆర్ డి ఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా చెత్త ఆర్డర్లు ఇవ్వడానికి శ్రీ లక్ష్మీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కడుపుమంటతోనే ఇదంతా చేస్తున్నారు. సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తప్పును ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ప్రస్తుతం ఓట్ల భయం పట్టుకుంది. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు, ఆ దత్త పుత్రుడు అడ్డుకుంటున్నారని… పేదలకు ఇల్లు ఇవ్వడం మంచిదా?, ఆపడం మంచిదా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశారని గుర్తు చేశారు. పేదవారు సినిమాని చూడడానికి టికెట్ల ధరలను తగ్గిస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అంటున్నారోనని దొంగ ఏడుపులు ఏడ్చిన జగన్మోహన్ రెడ్డి, సినిమా నిర్మాతలు, హీరోలు వచ్చి కలిసి మాట్లాడిన తరువాత డీల్ సెట్ అవ్వగానే పేదలంతా ధనవంతులైనట్టుగా సినిమా టికెట్ల ధరలను పెంచేశారు. ఎవరికి తెలువవు ప్రభుత్వ పెద్దల వెధవ స్టంట్ లు.. మీరు మారరని అందరికీ తెలుసు. రాజధాని కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టివేయడం ఖాయమని ముఖ్యమంత్రి కి అర్థమయిపోయింది.
అందుకే రాజధాని అమరావతి ప్రాంతంలో 80 వేల ప్లాట్లను పంపిణీ చేయాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో పనిచేసుకునే వారికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇస్తే ప్రయోజనం ఏమిటి?. వారు ఇక్కడకు వచ్చి ఏ పని చేసుకుని బ్రతుకుతారు. ఎక్కడి వారికి అక్కడే ఇళ్ల స్థలాలను ఇస్తే వారి ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకానీ ఇతర ప్రాంతాలకు చెందిన వారిని తీసుకువచ్చి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇస్తామనడం పాలకుల దుర్బుద్ధి ఏమిటో అర్థమవుతూనే ఉంది. రాజధాని నిర్మాణానికి విముఖంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రాంత అభివృద్ధిని నిలిపివేశారు. ఆయన అణుంగు అనుచరులు రోడ్లను తవ్వేసి కంకర, ఇసుకను అమ్ముకోగా, మిగిలిన స్టిల్ ను కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రాజధాని ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రలిక చెల్లవు. ప్రతిపక్షాలు మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయని, పాలక పక్షం చేస్తున్న ఈ దుశ్చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజధాని ప్రాంతంలో 1150 ఎకరాల భూమిని ఏ హక్కు ఉన్నదని మీ బాబుగాడి సొమ్ములా ధారా దత్తం చేయాలని చూస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు.
గత నాలుగేళ్ల క్రితం రెండు లక్షల టిడ్కో ఇల్లు 90% పూర్తయితే, ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయలేదు. రాజధాని ప్రాంతంలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా, వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే సృహ కూడా లేని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పేదలు గుర్తుకు రావడం ఆశ్చర్యకరం. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడులు చేయించడం ఈ ప్రభుత్వంలో నిత్య కృత్యమైపోయింది. ప్రభుత్వ ధమన నీతిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆహో… ఓహో అంటూ సర్వేలలో చెబుతున్నారని భ్రమ లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో వారే తగిన గుణపాఠం నేర్పుతారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. ఏ ఒక్క లబ్ధిదారునికి ఇంటిని నిర్మించి ఇవ్వలేదు . గతంలో తామే ఇంటి నిర్మాణం చేయించి ఇస్తామని చెప్పినా ముఖ్యమంత్రి ఆ తరువాత మాట మార్చి, ఇళ్ళ నిర్మాణాన్ని మీరే చేసుకోండి అని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీలో దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు దోచుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరు అత్యంత హేయం.. అత్యంత అమానుషత్వం… రాక్షసత్వాన్ని మించిన పైశాచికత్వం. పిశాచాలు, రాక్షసులు కూడా మన వైసీపీ ముష్కరుల ముందు పనికిరారు. రాజమౌళి చిత్రంలోని కాలకేయులను మన వైసీపీ కింకకరులు మించిపోయారు. వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాజధాని రైతులు హౌస్ మోషన్ మూవ్ చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయంపై కచ్చితంగా న్యాయస్థానం స్టే ఇస్తుంది. మళ్లీ న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ వెళ్లి, తమ వాదనలను ప్రధాన న్యాయమూర్తి వినాలని కోరుతారెమో. ప్రభుత్వ నిర్ణయం పై న్యాయస్థానం స్టేను ఇస్తే, ఆ స్టే ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో రాజధాని కేసును జూలై 11 వ తేదీన విచారిస్తామని ఇప్పటికే చెప్పారు. దానితో కలిసి ఈ కేసును వింటామని చెబితే, ఈలోగానే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ప్రభుత్వం పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?, లేకపోతే గుడ్డలూడదీసి కొడుతారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. రాష్ట్ర హైకోర్టు ఎంతవరకు సహకరిస్తుంది అన్నది చూడాలి. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రత్యేక కేసుగా పిటిషన్ దాఖలు చేద్దాం.
రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్లాట్లు పంపిణీ చేసి, పాకలు వేయిద్దామని చూస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయం పై మాటలను అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడుతూ న్యాయ పోరాటం చేద్దామని రాజధాని రైతులకు రఘురామకృష్ణంరాజు సూచించారు. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులోనైనా న్యాయమే గెలుస్తుంది. రాజధాని నిర్మాణానికి పొలాలనిచ్చిన రైతులకు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. రాజధాని అభివృద్ధి పై మంత్రులు ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మరొక అడుగు ముందుకు వేసి తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న మాటలతో ఆవేదనకు గురైన ఎంతో మంది రైతులు ఇప్పటికే ఆందోళనతో మృతి చెందారు. రాజధాని రైతుల మరణాలన్నీ ఈ ప్రభుత్వం చేసిన హత్యలే. ఆత్మ సిద్ధాంతం అన్నది కనుక నిజమైతే, రాజధాని ప్రాంత రైతుల ఆత్మలు ఈ ప్రభుత్వ పెద్దలను వదిలిపెట్టవు. పాపం చేసిన వాడు తాత్కాలికంగా సుఖపడవచ్చు కానీ ఆ తరువాత అతను తగిన శిక్షను అనుభవించవలసిందేనని ఆయన అన్నారు.
ఇకనైనా మీ ఉన్మాదాన్ని ఆపండి. విశాఖలో వేల ఎకరాల భూములను కబ్జా చేశారు. ఆ భూములను పేదలకు పంచండి. రాజధాని అమరావతి ప్రాంతం పై కక్షతో ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పార్టీలో కొనసాగడానికి అసహ్యం వేస్తోంది.
ఈ పదవీ ద్వారానే పేదలకు సహాయం చేయగలను. అందుకే ఈ పార్టీలో కొనసాగుతున్నాను. ఈ పదవి నువ్వు ఇచ్చింది కాదు… నేను తెచ్చుకున్నది. నీ ముఖం చూపించి ఓట్లు అడగలేదు. నా ముఖము చూపించే ఓట్లు అడిగాను. నా ముఖముతోనే నెగ్గాను. ఈ పార్టీలో ఉండడానికి సిగ్గు పడుతూనే ఉంటాను. చేసిన తప్పుకు నన్ను నేనే తిట్టుకుంటూ, పార్టీలో కొనసాగుతాను. ఈ పార్టీలో ఉండడానికి నాకు సిగ్గు లేదు. ఉంచుకోవడానికి మీకు సిగ్గు లేదని జగన్మోహన్ రెడ్డి పై రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.
నాలుగు వేల కోట్ల నుంచి మద్యం ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి
మద్యం ఆదాయాన్నీ నాలుగువేల కోట్ల నుంచి నాసిరకం మద్యం విక్రయిస్తూ, పిచ్చి, పిచ్చి బ్రాండ్లతో నాలుగు రెట్లకు ఎక్కువ పెంచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 2016-17 లో రాష్ట్ర మద్యం ఆదాయం 4,644 కోట్ల రూపాయలు కాగా, 2017- 2018 లో 5, 460 కోట్లు, 2018-2019 లో 6220 కోట్ల రూపాయలైతే, 2022-23 లో 16,167 రూపాయలని తెలిపారు. ప్రజల రక్త మాంసాలను పీల్చుకుతినే మద్యం ఆదాయం మనకు అవసరమా? అని ఎన్నికలకు ముందు మహిళల మనసులను కొల్లగొట్టి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మహిళల పుస్తెలను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. నాలుగు వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం నుంచి 16 వేల కోట్ల రూపాయలకు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎన్నికలకు ముందు మద్యం నిషేధం చేస్తామని చెప్పినా జగన్మోహన్ రెడ్డి, నాసిరకం మద్యం పిచ్చి పిచ్చి బ్రాండ్ల ద్వారా మూడు రెట్ల ఆదాయం పెంచారు. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా స్ఫూర్తితో మహిళలు జాగృతమై ఇకనైనా మద్యంపై పోరాటం చేయాలి. రాష్ట్రంలో మహిళలే హీరోలని, విలన్ ఎవరో అందరికీ తెలుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అని చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం వేల కోట్ల రూపాయల మద్యం అమ్మ కాలన్నీ నగదులోనే కొనసాగుతున్నాయి.
దేశంలోనే మద్యం అమ్మకాలను నగదులోనే కొనసాగిస్తున్న ఏకైక సిగ్గులేని, తెలివైన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అధికారిక మద్యం తో పాటు, అనధికారిక మద్యాన్ని కలిపి విక్రయిస్తుండడం వల్లే, నగదు లావాదేవీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అనధికారిక మద్యాన్ని 30% విక్రయించిన ప్రస్తుతం ప్రభుత్వానికి లభిస్తున్న 18 వేల కోట్లలో 6 నుంచి 7000 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నాయనేది ప్రజాభియోగం. దేశంలో ఎక్కడా కనపడని బ్రాండ్లను మద్యపాన ప్రియులకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్లను ల్యాబ్ లలో పరీక్షలు చేస్తే రసాయన అవశేషాలు ఉన్నట్లుగా నివేదికలు అందాయి. మద్యం దుకాణాలలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడతామని ఇదిగో… అదిగో అంటూ కాలం వెళ్ళబుచుతూ న్యాయస్థానాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. ప్రస్తుతానికి 11 వాకింగ్ స్టోర్లలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతూ, త్వరలోనే మిగతా మద్యం దుకాణాలలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడతామని తమ ఆదాయానికి గండి పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
పారదర్శకంగా వ్యవహరిస్తూ, బటన్ నొక్కుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ, మహిళల్లో చైతన్యం మొదలయ్యింది… మా ప్రభుత్వానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. తమ భర్త, పిల్లల ప్రాణాలను కాపాడుకోవడానికి మహిళలే పోరాట పటిమను ప్రదర్శించాలి. నాసిరకం మద్యంపై ఉద్యమించాలి. తమ ప్రభుత్వం చేస్తున్న తప్పులను క్షమించకండి. ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు వస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అమలు చేస్తామని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిని కూడా రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, అవినీతి వల్ల ప్రజలపై పెనుబారం పడుతోంది. ముఖ్యమంత్రి బటన్ నొక్కానని చెబుతున్నప్పటికీ, ఈ నాలుగేళ్లలో ఆయన బటన్ నొక్కే కార్యక్రమము ద్వారా లక్షన్నర కోట్ల రూపాయలు మాత్రమే పంపిణి చేశారు. అందులో 50వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కుడు ద్వారా కాకుండా, నేరుగానే పంపిణీ చేస్తున్నారు. ప్రజలను ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం వంచిస్తుంటే, శిక్షించాలని ప్రజలకు లేదా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం కావాలి… పొత్తులపై స్పష్టత రావాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం అయి, పొత్తులపై ఒక స్పష్టత రావాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. దుగ్గిరాలలో ఒక యువకుడు తన ప్లెక్సీ ని ఏర్పాటు చేస్తే, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆయన్ని స్టేషన్ కు పిలిచి చితకబాదారు. రానున్నది తమ ప్రభుత్వమేనని , తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వారి చేతనే వాటిని తొలగించే విధంగా పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. తన ప్లెక్సీ ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. ఎందుకంటే తాను ఆయన కంటే ఎత్తు ఉంటానని బాధ కాబోలు. తన ప్లెక్సీలను రోడ్లపై ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, తనని అభిమానించే వారి గుండెల్లోనే ఉంటానంటూ రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.