అమ్మకానికి విద్య

అమెరికా ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ఎక్కువ గ్రాడ్యుయేట్లు ఉండే దేశం. కాని,1970లో విద్యావ్యవస్థ బలోపేతం పేరుతో ప్రైవేటు పరం చెయ్యటం మొదలుపెట్టారో, క్రమేణా వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. నేడు అది ప్రపంచంలో 13 వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో బాగా చదువుకున్న, నైపుణ్యం ఉన్న పనిమంతులు కావాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు.

ఎందుకు ఇలా జరుగుతుంది? అమెరికాలో పిల్లలు కాలేజ్ కి వస్తున్నారంటే ఒక విధమైన భయం. ఆ భయం ఆ కాలేజ్ లో బిడ్డ సెక్యూరిటీ గురించి కాదు, చెడు స్నేహితుల సావాసం అవుతుందేమో అని కాదు, అక్కడి ఆహారం వాడికి పడుతుందో లేదో అని కాదు, అమాయకుడు, ఒంటరిగా ఉండగలడో లేడో అని కాదు, వాడు ఎన్నుకోబోయే కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అని, చదువుకి అయ్యే ఖర్చు తలుచుకుంటే భయం. పెద్ద పెద్ద ఐ.టి. ఉద్యోగాలు చేసే వాళ్ళలోనే ఒక విధమైన భయం, ఇక కింద తరగతి కుటుంబాల పరిస్థితి ఆలోచించండి.

ప్రతి సంవత్సరం షుమారు పది లక్షల మంది విద్యార్ధులు హైస్కూల్ తోనే చదువు ఆపేస్తున్నారు. దానికి ముఖ్యకారణం ఆర్ధిక పరిస్థితి. ఇంట్లో వీరి కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే, ఆ డబ్బులు కోసం ఏదో చిన్న పని చూసుకోవటం, క్రమేణా ఆ పనిలో పడి చదువుని వదిలెయ్యటం. ఇంకా పట్టుదల ఉన్నవాడు, పని చేస్తూనే బ్యాంకులో చదువుకి అప్పులు తీసుకోవటం, ఆ అప్పుల ఊబిలో విలవిలలాడటం. రోజురోజుకి కాలేజ్ విద్య ఖరీదైన వస్తువుగా, సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోయింది.

మొన్నటి వరకు పెట్టుబడిదారి వ్యవస్థ (corporatism) గొప్పదిగా భావించిన అమెరికా ప్రజలు ఇప్పుడు సామ్యవాదం(socialism) వైపు ఆసక్తి చూపుతున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు సోషలిజాన్ని టెర్రరిజంతో సమానంగా చూసిన అమెరికాలో, నేడు అధ్యక్ష ఎన్నికల్లో ఒక సోషలిస్ట్ పోటీ పడుతూ, గట్టి పోటీ ఇస్తున్నాడు. అందర్నీ ఆకర్షిస్తున్న అతని నినాదం కాలేజ్ విద్య ఉచితం చేస్తాను అనటం, అంటే మన వాళ్లకు అర్ధమయ్యే బాషలో చెప్పాలంటే “fee reimbursement”. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలు సోషలిజం వైపు చూస్తున్నారు అనేది అయితే రూడీ అయింది.

ఆర్ధికంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలోనే ప్రజల పరిస్థితి ఇలా ఉంటే, మన దేశంలో మన ప్రభుత్వాలు పెట్టుబడిదారి వ్యవస్థ వైపు చూస్తున్నాయి. విద్య అనేది ప్రభుత్వ భాద్యత కాదు, అది ప్రైవేటు వ్యక్తుల పని అని నిస్సిగ్గుగా చెప్పే ప్రభుత్వాలు వస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యని ఖరీదు చేశారు కానీ, 12 వ తరగతి వరకు ప్రతివాడు చదువుకోగలిగిన విధంగా విద్యా వ్యవస్థని రూపొందించు కున్నారు.

ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు అందరికి నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం భాద్యత తీసుకొంది. ప్రైవేటు స్కూల్స్ గురించి కనీసం ఆలోచించ అవసరం లేకుండా ప్రభుత్వ
education-dis పాఠశాలలు కూడా అంతే ప్రామాణికత కలిగి ఉండే విధంగా జాగ్రత్త తీసుకున్నారు. అందుకనే కనీసం అక్కడి వరకు అందరు చదువుకొంటున్నారు. మన దేశంలో రోజురోజుకి విద్యా వ్యవస్థ దయనీయమైన పరిస్థితిలోకి పోతుంది. ప్రభుత్వాలు కొత్తగా స్కూల్స్ పెట్టటం మానివేసాయి.

ఉన్నవాటిని పట్టించుకోవటం మానివేసాయి. ఒక మంచి ఎలిమెంటరీ స్కూల్ లో పిల్లల్ని చదివించాలంటే ఒక మధ్య తరగతి ఉద్యోగస్తుడి వల్ల కూడా కాని పరిస్థితి, వెనకాల బాబులో, తాతలో సంపాయించిన ఎకరాలైన ఉండాలి, లేకపోతే అవినీతో, తప్పడు పనో చెయ్యాలి. ఎంత దయనీయమైన పరిస్థితి ఇది? అసలు విద్య మా భాద్యత కాదు అని ప్రభుత్వాలు అనటం ఎంత దౌర్భాగ్యం? సమాజంలో రోజురోజుకి హింస, అవినీతి, విచ్చలవిడితనం పెరగటానికి ఇంతకన్నా కారణం ఏమి కావాలి?

ఏ సమాజం అయినా బాగుపడాలంటే ముందు అందర్నీ విద్యావంతులు చెయ్యాలి. విద్య అందరికి అందుబాటులో ఉండాలి. విచ్చలవిడిగా పెరుగుతున్న ప్రైవేటు స్కూల్స్ ని అరికట్టాలి, వాటి ఫీజుల మీద నియంత్రణ విధించాలి. ప్రభుత్వం మరిన్ని స్కూల్స్ పెట్టాలి, వాటిలో ప్రైవేటు స్కూల్స్ కి దీటుగా ప్రమాణాలు పెంచాలి, అవసరమైతే ప్రైవేటు స్కూల్స్ లో కొంత ప్రమాణాలు తగ్గినా పర్వాలేదు!

ఇక విద్య ప్రైవేటీకరణ పేరుతో విదేశీ యూనివర్సిటీలను తెచ్చి మన సమాజం మీద రుద్దొద్దు. అలాగే ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్, మెడికల్ ఫీజులు సామాన్యుడికి అందుబాటులోకి తీసుకు రావాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 90,000 ఉండే ఐ.ఐ.టి ఫీజుని ఏకంగా రెండు లక్షలు చేసింది. అది తెలివి తక్కువ నిర్ణయం.

ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవచ్చు అనే ధైర్యం ప్రభుత్వాలు కల్పించాలి. ఒక తండ్రి తన బిడ్డల చదువులకు ఎంత తాపత్రయ పడతాడో, ఎంత ఖర్చైనా ఎలాగోలా చదివించాలని కష్టపడతాడో సమాజానికి తండ్రి లాంటి ప్రభుత్వం కూడా తన పౌరుల్ని చదివించటానికి అంతే తాపత్రయ పడాలి. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు దుబారా కాదు, రేపటి ఉన్నత సమాజానికి పెట్టుబడి.
– రమేష్ అడుసుమిల్లి

Leave a Reply