– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– కృతజ్ఞతలు తెలిపిన 2 వ వైస్ ఎంపీపీ జయరాజు
గుడివాడ, జనవరి 5: ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండల 2 వ వైస్ ఎంపీపీగా ఎన్నికైన కొప్పుల జయరాజు కలిశారు.ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ తనపై విశ్వాసంతో 2వ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు
సహకరించిన మంత్రి కొడాలి నాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థలో మండల పరిషత్ లు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. ప్రభుత్వం మండల పరిషత్ లను ఏర్పాటు చేస్తుందని, వీటికి ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తుందన్నారు. ప్రతి మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుందని, దీని పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. మండల అభివృద్ధికి విడుదలయ్యే జడ్పీ, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు.
అభివృద్ధి విషయంలో గ్రామాల మధ్య సమన్వయం తీసుకురావాలన్నారు. గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం, నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.ప్రాథమిక,మాధ్యమిక పాఠశాలలను సక్రమంగా నిర్వహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపదను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ముందుగా 2 వ వైస్ ఎంపీపీగా ఎన్నికైన జనార్ధనపురం గ్రామానికి చెందిన కొప్పుల జయరాజును మంత్రి కొడాలి నాని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, మండల ప్రముఖులు దారా నిర్మల, కొల్లారెడ్డి నారపరెడ్డి, కొప్పుల వినయ్, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు మెండా చంద్రపాల్, మొండ్రు వెంకటేశ్వరరావు, యార్లగడ్డ బసవయ్య, మాదాసు వెంకట లక్ష్మీకుమారి, అల్లం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.