Suryaa.co.in

Political News

ఎన్నికల ప్రజాస్వామ్యమా! నీ భవిష్యత్తు ఏమిటి?

1. ఒక మిత్రుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక “వాయిస్ మెసేజ్” పంపాడు. అది మా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినది. ఒక పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో వాళ్ళ నాయకుడితో చేసిన వాదన.

2. మా నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో స్వతంత్ర పార్టీకి కంచుకోట. కాంగ్రేస్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ. తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో కాంగ్రెస్ కు బలమైన ఒక మండలాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ చేర్పించారు. అప్పటి నుండి కాంగ్రెస్, అటుపై వైఎస్సార్సీపీ గెలుస్తున్నది. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాగతంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీ.

3. ఎన్నికల సీట్ల సర్దుబాటులో ఆ స్థానాన్ని జనసేన పార్టీ తీసుకున్నది. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో పెద్దగా బలం లేదు. ఎస్.సి. రిజర్వుడు స్థానం. స్థానికంగా “బలమైన” అభ్యర్థులు దొరక్కపోతే బయటి వారిని అభ్యర్థులుగా పార్టీలు ఎంపిక చేస్తున్నాయి. తిరుపతిలో కూడా ఇదే రగడ. ఆ స్థానాన్ని జనసేన తీసుకొని, వైఎస్సార్సీపీ చిత్తూరు శాసన సభ్యుడ్ని పార్టీలో చేర్చుకొని, అభ్యర్థిగా ప్రకటించారు. అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

4. రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి పూర్తిగా తెలుగు దేశం పార్టీపై ఆధారపడాల్సిన స్థానం. అలాంటి స్థానాన్ని తీసుకొని, ఒక అభ్యర్థిని ప్రకటించారు. ఆ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి రచ్చకెక్కింది.

5. స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయా రాజకీయ పార్టీలు సొంత బలంపైనే ఆధారపడి పోటీ చేస్తాయి. పొత్తులు పెట్టుకొని పోటీ చేసే సందర్భంలో సొంత బలం కనీసం 15%, 20% ఉన్న స్థానాల్లో పోటీ చేస్తే సహేతుకంగా ఉంటుంది కదా!

6. నేడు బిజెపిని చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో! అందరికీ విధితమే కదా! కానీ, మోడీని చూపెట్టి, లొంగదీసుకొని, పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, 10 శాసన సభ స్థానాలు తీసుకొని, అభ్యర్థుల ఎంపికలో ఆపసోపాలు పడుతున్నది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టిడిపి పార్టీల నుండి వలస వచ్చిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నది. బిజెపి అంటే భావజాలానికి కట్టుబడిన పార్టీ అని పేరు. నేడు నేతి బీరకాయ చందంగా తయారైంది.

7. “ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టగలరు”, అన్నదే కొలబద్దగా పార్టీలు అభ్యర్థులను ఎంపి చేస్తున్నాయి. తాము ఎంపిక చేసే అభ్యర్థి, గంట క్రితం వరకు ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళ చరిత్ర ఏమిటి? వారికి ప్రజలతో ఉన్న సంబంధాలేమిటి? వాళ్ళేమైనా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కోవర్టులా? వగైరా అంశాలను ఈ మాత్రం కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ, టిడిపి, జనసేన, బిజెపి, అన్ని పార్టీలు ఒకే తానులోని ముక్కలే! రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న దుస్థితిలో ఇతర పార్టీల నుండి ఎవరొస్తారాని ఎదురు చూడటంలో పెద్దగా ఆశ్చర్యం లేదనుకోండి!

8. మన దగ్గరికి వచ్చాడా! మన గాట్లో కట్టెయ్! నలభై, యాభై కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉందా! అయితే, శాసన సభ అభ్యర్థిగా ఎంపిక చేద్దాం! వంద కోట్లు పెట్టగలడా! లోక్ సభ అభ్యర్థిగా రంగంలోకి దించుదాం! ఇదే, ప్రధాన రాజకీయ పార్టీల ఆలోచనా తీరు.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE