ఏపీలో ఆర్థిక కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, తీసుకున్న రుణాలకు వడ్డీల చెల్లింపుకు నిధుల కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులను పూర్తిగా పక్కన పెట్టేసింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో బిల్లులు నిలిపివేసింది. పెద్ద కాంట్రాక్టర్లకు మూడు నెలల నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఇప్పటికే పనులు నిలిపివేశారు. పెద్ద కాంట్రాక్టర్లు కూడా కొన్ని ప్రాజెక్టుల దగ్గర వారం రోజుల నుంచి పనుల్లో స్పీడ్ తగ్గించారు. మరికొన్ని ప్రాజెక్టుల దగ్గర పనులను పూర్తిగా నిలిపివేశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానికి సంబంధించి దాదాపు 4వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ పనులకు సంబంధించి మూడు సంస్థలు పనులు ప్రారంభించారు. చేసిన వర్క్‌కు కూడా బిల్లులు రాకపోవడంతో ఈ మూడు సంస్థలు పనులను నిలిపివేశాయి. వేదాద్రి ఎత్తిపోతల పథకం పనులను మెగా ఇంజినీరింగ్ దక్కించుకుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ఈ పథకానికి రివర్స్ టెండరింగ్ పేరుతో 489 కోట్ల రూపాయల వ్యయంతో మళ్లీ అదే కాంట్రాక్టర్‌కి పనులు అప్పగించారు. ఈ పథకం నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పనులు జరగలేదు, కాంట్రాక్టు సంస్థ అక్కడ ఉన్న మిషనరీని కూడా తీసుకెళ్లిపోయింది. స్థలం సేకరించి ఇవ్వాల్సిన ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడంతో నిర్మాణ సంస్థే స్థానిక రైతుల నుంచి ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. నిర్మాణ పనులు చేపట్టేందుకు రంగం సిద్దం చేసింది. అయితే బిల్లులు ఏమీ రాకపోవడంతో పనులను నిర్మాణ సంస్థ దాదాపు నిలిపివేసింది.
ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు అడిగినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. చివరకు ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్టుల పనుల్లో వేగం తగ్గించాయి. మొత్తంగా ఏపీలో దాదాపు 25వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టు పనులు స్తంభించాయి. ప్రభుత్వం ఎవరికీ భయపడే పరిస్థితి కనిపించడం లేదు. భయం అనేది ఉంటే ఆ పరిస్థితి రాదు. ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలి. సంక్షేమ పధకాలు పరిశీలన చేయాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు ఉండాలి. ఖర్చు తగ్గట్టుగా ఆదాయం ఉండాలి, అన్నీ ఉచితం అనే ఆలోచన పై పరిశీలన చేయాలి.సంక్షేమం పేరుతో ఇవి ఓట్లు కొనే పథకాలే. వీటివల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందవు.
ఆర్ధికాభివృద్ధికి కృషి చేయాలి, అంటే పారిశ్రామిక అభివృద్ధికి తద్వారా ఉపాధి అభివృద్ధికి కృషి చేయాలి.డబ్బులు పంచుతున్నాం, ఎన్నికల్లో గెలుస్తున్నాం అనుకోవచ్చు. డబ్బులు అందని కుటుంబాలు అసంతృప్తి చెందుతాయి. డబ్బులు అందుకున్న కుటుంబాలలో కూడా, ఇవి చాలవని అసంతృప్తి బయలుదేర వచ్చు. అప్పుడు మొదటికే మోసం.నిజానికి కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే అవసరం. వృద్దాప్య పింఛను, పేద పిల్లలకు ఫీజులు, రైతులకు సాయం, వైద్య పధకాలు మొదలైనవి.మిగిలిన ఆర్ధిక పరిస్థితి ని బట్టి పరిశీలన చేయాలి.పరిపాలన బాగుండి, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే,ఉపాధి అవకాశాలు బాగుంటే ,డబ్బులు పంచక పోయినా ప్రజలు గెలిపిస్తారని ప్రభుత్వం గమనించాలి.ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనలు, పరిశీలనలు చేసిన పాపాన పోలేదు. రాష్ట్ర పర్యటన చేస్తూ, స్థానిక పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ ఉండాలి.
కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు, సలహాదారులు, కన్సల్టెన్సీల వేతనాలు ఠంచనుగా ఒకటో తేదీ బ్యాంకు అకౌంట్లలో చేరిపోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బటన్ నొక్కగానే నగదు అందుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థాయికి చేరడం ఒక దురదృష్టకర సంఘటన. కొన్ని శాఖల ఉద్యోగులపై ఒకటో తేదీ అభిమానం చిలకరించారు. అంటే రాష్ట్రమంతా ఒక యూనిట్ గా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్య కనిపించని విభజన రేఖను గీశారు.
చెప్పకనే సగటు ఉపాధ్యాయులపై అవిశ్వాసం ప్రకటించింది. ప్రభుత్వం. విచిత్రంగా ఉపాధ్యాయులకు నవంబర్ జీతాలు ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో జమ కానీ పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది కుటుంబాల్లో ఆర్ధిక దిగ్బంధనం ఏర్పడింది. కేవలం జీతాలపైనే జీవితాలను వెళ్లదీస్తున్న కుటుంబాల్లోని పొయ్యిలో నుండి పిల్లి బయటకు లేవని స్థితి కూడా ఉంది. ఇటీవలి కాలంలో ఒకటో తేదీ అంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. కారణం కూటికి, గుడ్డకు సంబంధించిన అంశమే కాదు. గతకాలపు అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీ. సకాలంలో చెల్లించకపోతే పరువు నష్టం సమస్య. ఇల్లు గడవాలంటే జీతమే ఆధారం కావడం. ఆయా ఉద్యోగులపై ఒకరికి నలుగురు ఆధారపడి ఉండటం. ప్రభుత్వోద్యోగి అంటే ఒకప్పుడు సమాజంలో మర్యాద, మన్నన ఉండేది. ఇప్పుడా పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వద్యోగులకు అప్పు పుట్టని స్థాయికి చేరింది. ఒక చులకన భావం ఆయా వ్యక్తుల చుట్టూ ఆవర్తనంలా ఆవరించింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ అవసరాలు తీరక ఆయా కుటుంబాలు నవ్వుల పాలవుతున్నాయి కూడా!
గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ తటస్థించ లేదు, 010 హెడ్ లేనప్పుడు కూడా ఒక్క మార్చి నెల జీతం తప్ప. ఏప్రిల్ నెల జీతాన్ని ఏప్రిల్ 24 నే (పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మరుసటి రోజు) చెల్లించేవారు. అంటే ఏప్రిల్ నెలలో 20 రోజుల తేడాతో రెండు జీతాలు అందుకునే వారు. ముందస్తు ఆడిట్ ఉన్న మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మాత్రమే వేతనాల చెల్లింపులో కొద్దిగా జాప్యం జరిగేది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పనిదినం రోజున వారికి రావలసిన సమస్త ప్రయోజనాలను అందజేసి, చివరకు పెన్షన్ పేపర్లు సైతం చేతిలో పెట్టి సాదరంగా ఇంటికి పంపే ఆనవాయితీ ఉండేది. అదొక మర్యాద. అది అనాడున్న రాజనీతి. ఆనాడు పాలకులకు ఉద్యోగులపై వున్న గౌరవం. ఉద్యోగులను ఆంతగా ఆదరించారో చెప్పనలివి కాదు. 1956 నుండి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగస్వామ్యానికి పాలకులు అగ్రాసనం వేశారు. తదనుగుణంగానే ఉద్యోగులు స్వేచ్ఛగా స్వామి భక్తితో పని చేశారు. ప్రజలకు సేవలను కొనసాగించారు. వృత్తిరీత్యా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి నేరుగా చొరవ చూపేవారు. సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.
ప్రజలనాడిని, ప్రజా సమస్యలను పత్రికల్లో వచ్చే వార్తల ద్వారా కూడా స్వీకరించేవారు. అందుకోసం సమాచార, పౌర సంబంధాలశాఖ ఉండేది. పత్రికలలో మూడు సెంటీమీటర్ల సింగిల్ కాలమ్ వార్త వచ్చినా విచారణ జరిపించే సంస్కృతి ఉండేది. బాధ్యులపై తక్షణ చర్యలుండేవి. బాధితులకు సత్వర న్యాయం జరిపించేవారు. మధ్యవర్తులు, సలహాదారుల పెత్తనం అసలు ఉండేది కాదు. సంఘాల నేతలు అనుసంధానకర్తగా ఉంది స్తబ్దతను తొలగించేవారు. పీఆర్సీ చర్చలకు సైతం కాలయాపన ఉండేది కాదు. పాతికో పరకో ఎంతో కొంత తేల్చి ఉత్తర్వులను ఒకేసారి జారీచేసేవారు. కానీ ఇప్పుడు కాలం తలకిందులైంది. ప్రతి విషయాన్ని సమస్యగా చూపుతున్నారు. సున్నితమైన అంశాలు కూడా వివాదాస్పదం చేస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు వాయిదాల పర్వం కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది.
చివరకు బాండ్లు ఇచ్చే సంస్కృతి ఆరంభమైంది. పదవీ కాలం పూర్తయిన వారి చెల్లింపులకు నిధులు లేక ఉద్యోగ విరమణ వయసును సైతం పెంచుకుంటూ పోవడం ఇటీవల కాలపు పాలకులకు ఆనవాయితీ అయింది. తమ సమస్యలను ప్రస్తావించడానికి కూడా అవకాశం లేదు. ఆందోళనలు చేస్తే ఇంటిదగ్గరే అరెస్టు చేస్తారు. పని చేస్తున్న చోటనే అదుపులోకి తీసుకొంటున్నారు. కనీసం స్వాతంత్య్రం సాధించుకున్న మార్గంలో ఒక ధర్నా చేసే వీలు లేని పాశవిక విధానాలకు పాలకులు అంకురార్పణ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఐక్య ఉద్యమాలు చేయాలి.