Suryaa.co.in

Editorial

ఎన్‌కౌంటర్ సరే రెడ్డిగారూ…కేటీఆర్ ట్వీట్ సంగతేమిటి?

– పోలీసులు కేటీఆర్‌నూ పక్కదారి పట్టించారా?
– షర్మిలక్క- ‘మంచు ఫ్యామిలీ’కి ‘ఆంధ్రా ఆక్రందన’లు వినిపించవా?
(మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్)
అది హైదరాబాద్ మహానగరంలోని సింగరేణి కాలనీ అనే ఒక అతి పేదలబస్తీ. రెక్కాడితేగానీ డొక్కాడని వేలాదిమంది దీనులకు ఆ బస్తీ కేరాఫ్ అడ్రస్. అలాంటి కడుపేదల బస్తీని మంత్రి కేటీఆర్ దత్తత కూడా తీసుకున్నారు. సో.. ఆ బస్తీ బాధలు తీర్చాల్సిన బాధ్యత కూడా ఆయనదేనన్నమాట. సరే.. కేటీఆర్ బోలెడన్ని పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి, ఆ బస్తీ సంగతి గుర్తురాకపోవచ్చు. అది వేరే విషయం. ఆమాటొస్తే దత్తత తీసుకున్న వారెవరూ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎంతయినా సొంతం సొంతమే. దత్తత దత్తతే!
అదే బస్తీలో ఆరేళ్ల చైత్ర అనే ఆరేళ్ల చిన్నారిపై, రాజు అనే ఓ మానవమృగం హత్యాచారం చేసి పరారయిన, ‘పరువుతక్కువ’ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీలన్నీ తమ మైలేజీ పెంచుకోవడానికి అక్కడికి వెళ్లి, టన్నుల కొద్దీ సానుభూతి కుమ్మరించాయి. బాధిత కుటుంబానికి, 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరికొన్ని మహిళా సంఘాలయితే, ఆ మృగాడిని ఎన్‌కౌంటర్ చేయాలని నినదించాయి. టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూనలాంటివారయితే, ఆ మానవ మృగం అంగాన్ని ఖండించాలన్న కొత్త చర్చకు తెరలేపారు. ఈ అమానుషకాండ రాష్ట్రంలో ఇంత రగడ సృష్టిస్తున్నా.. అక్కడే ఉండే హోంమంత్రి గానీ, కనీసం మహిళామంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడమే ఆశ్చర్యం.కేటీఆర్ అంటే చాలా బిజీ మినిష్టర్ కాబట్టి, ఆయన వెళ్లలేకపోయారనుకుందాం. మిగిలిన మంత్రులంతా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పీకల్లోతు మునిగిఉన్నందున, వారంతా అక్కడే యమా బిజీగా ఉన్నారని అర్ధం చేసుకోవచ్చు. మరి లోకల్‌గా ఉండే హోంమంత్రి వెళ్లడానికి ఏమయిందన్నది ప్రశ్న.దీనితో చివరాఖరకు చాలారోజుల తర్వాత హోంమంత్రి, మహిళామంత్రికి బాధిత కుటుంబంపై దయకలిగి, ఓదార్పు యాత్ర చేపట్టారు. ఓ 20 లక్షల చెక్కు, త్రిబుల్ బెడ్‌రూము ఇచ్చేశారు.
ప్రభుత్వం, పోలీసులు నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని శపథం చేశారు. మంత్రి మల్లారెడ్డి ఎన్‌కౌంటర్ చేస్తామన్నారు. పోలీసులు వైన్‌షాపుల వద్ద జల్లెడ వేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ల దగ్గర కాపుకాశారు. కానీ ఆ మృగాడు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వకుండా, తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడు(ట). స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం ఉన్నట్లు, మృతుడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా అతగాడే మృగాడని పోలీసులు కూడా తేల్చాశారు. సో.. మంత్రి మల్లన్న చెప్పిన ఎన్‌కౌంటర్ కోరిక, పార్టీల ఉరి డిమాండ్లేవీ నెరవేరకుండానే.. నిందితుడి ప్రాణం పట్టాలపైనే పోయింది. పైగా ఈ మృతిపై సందేహాలున్నప్పటికీ, ఈ పదిరోజులూ ఎవరూ మాట్లాడరు. కాబట్టి. మరి ఈ కథ ఇప్పటికి సుఖాంతమయినట్లే.
అంతకుముందు కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ చాలామందిని మెప్పించింది. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన రాజు అనే మానవమృగం దొరికిందన్నది ఆ ట్వీట్ సారాంశం. హత్యాచారానికి పాల్పడ్డ మృగాడిని వెతికి వెంటాడి పట్టుకున్న పోలీసులు, తమ సత్తా చాటారని సమాజం సంబరపడింది. కానీ.. అంతలోనే అదే కేటీఆర్.. ‘మృగాడు దొరకలేదన్న’ దిద్దుబాటు ట్వీట్, అదే సమాజాన్ని నిరాశ పరిచింది. పైగా.. సదరు మృగాడిని పట్టిస్తే పదిలక్షల రివార్డు ఇస్తామంటూ పోలీసు శాఖ చేసిన ప్రకటన, పోలీసుల ఆశక్తతను వేలెత్తి చూపింది. ఏ చిన్న నేరం చేసినా దుర్భిణి వేసి వెతికి మరీ పట్టుకునే పోలీసులకు, జనావాసాల మధ్య హత్యాచారానికి పాల్పడ్డ ఓ మృగాడు.. ఇప్పటిదాకా దొరకలేదన్న మాటే నమ్మబుల్‌గా లేదన్నది జనాభిప్రాయం.
అసలు కేటీఆర్ అంటే ఎవరు? దాదాపు సీఎంతో సమానమైన మంత్రి! పరిపాలన ఆయన చుట్టూనే పరిభ్రమిస్తోంది. కాలం కలసివస్తే ఈ రాష్ట్రానికి, టీఆర్‌ఎస పార్టీకి ఆయనే ఉత్తరాధికారి. అలాంటి సూపర్‌పవర్ మంత్రికి సైతం.. నిందితుడు దొరికాడని చెప్పడానికి, పోలీసులకు ఎంత ధైర్యం? అసలు అంత అబద్ధం చెప్పడానికి వారిది గుండెనా? చెరువా? ఒక ‘సూపర్‌పవర్ మినిష్టరు’నే బోల్తా కొట్టించారంటే, దానికెంత ధైర్యం కావాలి? దొరక్కపోయినా దొరికినట్లు సమాచారం ఇవ్వడం, సర్కారునే తప్పదోవపట్టించడం కదా? మరి దీనిపై ఇంతవరకూ చర్యలు లేకపోవడమే వింత.
ఈలోగా ‘ఉన్నత విద్యావంతుడయిన’ మంత్రి మల్లారెడ్డి చేసిన ప్రకటన, ఈ ఎపిసోడ్‌ను కొత్త మలుపు తిప్పింది. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనని, కచ్చితంగా ఎన్‌కౌంటర్ చేస్తామని మంత్రి మల్లన్న చేసిన ప్రకటన బోలెడన్ని అనుమానాలకు తెరలేపింది. వెంటనే రంగంలోకి దిగిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.. మంత్రి మాటలు బట్టి… ఓట్ల కోసం హుజురాబాద్ ఉప ఎన్నికల ఎన్నిక సమయంలో, నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తారేమోనన్న కొత్త అనుమానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బహుశా… ‘ఉన్నత విద్యావంతుడైన’ మంత్రి మల్లారెడ్డి కవి హృదయాన్ని, కొండా విశ్వేశ్వరరెడ్డి సరిగా అర్ధం చేసుకోలేదేమో?!


సరే దాన్నలా పక్కనపెడితే.. ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత, సినీనటుడు మంచు మనోజ్ హటాత్తుగా సింగరేణికాలనీలో ఊడిపడ్డారు. జరిగిన ఘటన తనను కలచివేసిందని కన్నీరు కార్చి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని 24 గంటల్లో ఉరి తీయాలని మంచుబాబు ఆవేశపడ్డాడు. బాగానే ఉంది.మంచు చిన్నోడి బాధ అర్ధం చేసుకోదగ్గదే. మరి ఇలాంటి అత్యాచారాలు, హత్యాచారాలు అటు ఆంధ్రాలోనూ శరపరంపరగా జరుగుతున్నాయి కదా? పైగా సీఎం నివాసం ఉండే తాడేపల్లికి కూతవేటు దూరంలోపాటు, ఆయన ఉన్న గుంటూరు జిల్లాలోనే, మహిళలపై అకృత్యాలు విజయవంతంగా జరుగుతున్నాయి కదా? మరలాంటప్పుడు మంచు బాబు.. అక్కడికి ఇప్పటిదాకా ఎందుకు వెళ్లలేదు? వెళ్లి.. సింగరేణికాలనీలో మాదిరిగానే ఎందుకు కన్నీరు కార్చలేదు? కార్చిన నీరు ఇంకిపోయిన తర్వాత, సింగరేణిలో మాదిరిగానే ‘మృగాళ్లను ఉరి తీయాలని’ ఎందుకు గళమెత్తలేదు? పైగా గుంటూరులో రమ్య హత్య తర్వాత సీఎం జగనన్నను కలిసిన మంచుబాబు.. తమ మీటింగు ప్రొడక్టివ్‌గా జరిగిందని చెప్పారే తప్ప, రమ్య హత్యపై ఎందుకు మాట్లాడలేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

ఇక లేటయినా లేటెస్టుగా వచ్చిన షర్మిలక్క కూడా.. సింగరేణి ఘటనపై కేసీఆర్ సర్కారును దుమ్మెత్తిపోశారు. న్యాయం జరిగేవరకూ అక్కడి నుంచి కదిలేదని శపథం చేసి, అక్కడే హఠం వేశారు. సాటి మహిళల పట్ల, అందులోనూ ఒక చిన్నారి హత్యాచారంపై షర్మిలక్క మనసు ‘మంచుకొండల్లా కరిగిపోవడం’ గొప్పతనమే. మృగాళ్లకు బలయిపోతున్న మహిళల పక్షాన, నిర్భయంగా పోరాడటం అభినందనీయమే. ఈ కాలంలో, సాటి మహిళల పట్ల ఆపాటి సానుభూతి ఉన్నవాళ్లెంతమంది?! అయితే… షర్మిలక్క సింగరేణిలో కేసీఆర్ సర్కారుపై వేసిన కేకలే.. అటు ఆంధ్రాలో ‘అన్నయ్య సర్కారు’ పైనా వేసినట్టయితే, ఆమె ప్రతిష్ఠ హిమాలయమంత ఎత్తుకు ఎదిగి ఉండేది.

గుంటూరులో రమ్య హత్యపై రాష్ట్రమంతా రగిలిపోయింది. నిన్నటికి నిన్న నెల్లూరులో ఒక మృగాడు, ఓ మహిళను వ్యభిచారం చేయమంటూ కొడుతూ, ఏకంగా ఆ ఘనతను వీడియో తీయించాడు. అదే నెల్లూరులో వాలంటరీ, ఓ మహిళను వేధించిన వైనం వెలుగుచూసింది. తండ్రీకొడులిద్దరు ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశారు. సత్తెనపల్లి దగ్గర భర్తను చెట్టుకు కట్టేసి, భార్యపై నలుగురు సామూహిక అత్యాచారం చేసిన అరాచకవైనం, హృదయమున్న అందరి గుండె పిండేసింది. అంతా లెక్కవేస్తే.. గత రెండున్నరేళ్ల నుంచి ఏపీలో ఆడబిడ్డలపై జరిగిన అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యాచారాలు కలిపితే 518. మరి పుట్టినింట ఆడబిడ్డలపై ఇన్ని అత్యాచారాలు నిర్నిరోధంగా జరుగుతుంటే.. షర్మిలక్క ఒక్కసారైనా గళం విప్పకపోవడమే ఆశ్చర్యం. కేసీఆర్ పాలనపై ఒంటికాలితో లేస్తున్న షర్మిలక్క.. ‘ఆంధ్రా అన్నయ్య’ పాలనలో కూడా అవే ఘటనలు నిత్యకృత్యాలవుతున్నా, గర్జించకుండా సొంత రాష్ట్రంపై సీతకన్నేయడం ఏమీ బాగోలేదన్నది జనాభిప్రాయం.

సరే.. షర్మిలక్కంటే తెలంగాణ కోడలిగా కొత్త బంధుత్వం ఉంది కాబట్టి.. ఆంధ్రాలో జరిగే అరాచకాలపై మాట్లాడేందుకు, సవాలక్ష సమస్యలు- చెప్పలేని మొహమాటాలు ఉంటాయనుకోవచ్చు. మరి విజయమ్మ ఆంధ్రాలోనే ఉంటున్నారు కదా? కనీసం ఆమెయినా ఏపీలో సాటి మహిళలపై జరుగుతున్న దాడులకు స్పందించి, ఒక్క బాధితురాలికయినా ఓదార్పు ఇవ్వకపోవడమే అందరి ఆశ్చర్యానికి కారణం. ఓదార్పులో ముందుండే వీరంతా, ఈసారెందుకో దానిని పక్క రాష్ట్రానికే పరిమితం చేస్తుంటడమే వింత.

LEAVE A RESPONSE