పరభాషా జ్ఞానాన్ని సంపాదించు..నీ భాషలోనే నువ్వు సంభాషించు..!

(నేడు ఇంగ్లీష్ డే)
బ్రిటిషోడు మనకిచ్చిన
ఓ వరం..అదే శాపం..
ఇంగ్లీషు..
మనం వెటకారంగా
పిలుచుకునే ఎంగిలిపీసు..
గాడిద గుడ్డు
కంకరపీసు..!

ఎలా ఉన్నావురా..
అనే ఆత్మీయతను మరచి
హౌ డూ యూ డూ..
డూడూ బసవన్న
వరకు సాగిన
మన ఇంగ్లీషు భాషయాత్ర..
భారతంలో సుయోధనుడు జరిపిన ఘోషయాత్ర..
మాతృభాషకు చేదుమాత్ర!
వెధవ అనుకరణ..
మన భాష ‘బాసు’పాలు..
మనం అభాసుపాలు..!

చదువుకోక ముందు కాకర..
తర్వాత కీకర..
ఆంగ్లం రాక మునుపు..
అమ్మా నాన్న..
వచ్చాక మమ్మీడాడీ..
అలా ప్రదర్శిస్తూ
ఓ రకం పేరడీ..
ఆధునిక సంస్కృతీ గారడీ..!
అత్త..పిన్ని..ఇద్దరూ ఆంటీలే
ఇద్దరూ ఇంగ్లీషు స్టైల్లో తొడిగేది నైటీలే..
బాబాయి..మామ..
అందరూ అంకుల్సే..
అన్ని పిలుపులూ
ఇప్పుడు ఫాల్సే…!
ఇద్దరూ నిక్కర్లే..
తిరుమలలోనూ
ఆ నిక్కర్లతో చక్కర్లే!

ఏ దేశంలోనైనా పౌరులు
మటాడేది దేశీయ భాషే..
అలా మాటాడితే
మనకు నామోషే..
నమస్తే..వనక్కం..ప్రణామం
ఈ వినయాలకు
ఇప్పుడు పంగనామం!
హాయ్..హాల్లో..
బాసూ..బ్రో..
అమ్మ భాషలో పాండిత్యం..
ఇంగ్లీషు తప్పుల తడకగా
మాటాడే అగత్యం..
హిపోక్రసీ మహత్యం..
ఆ హిపోక్రసీ
ఇప్పటి మన లెగసీ

సరే..ఇప్పుడు ప్రపంచీకరణ
పరవళ్ళలో నిలదొక్కుకోవాలంటే
ఇంగ్లీషు తప్పనిసరి..
ఆ ఇంగ్లీషులో మనలో
చాలామంది సరాసరి…
అయినా వీసా..
విదేశాల్లో హైలేసా..
అంతవరకు ఓకే..
అప్పుడప్పుడూ మాతృభూమికి ఓ విజిట్టు..
బయలుదేరేపాటికే
రిటర్న్ టికెట్టు..
అది మర్చిపోరు..
అమ్మ భాష మాత్రం మరుపు..
వచ్చీ రానట్టు యాస..
ఇంగ్లీషులో పాండిత్యం ప్రదర్శించే ప్రయాస..

రష్యన్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రష్యా భాషే..
దొర ఇంగ్లీషే..
జపనీ పనితో పాటు
ముద్దుగా సాయొనారా..
చైనీ చింగ్లాం చుంచుం..
వేరే భాష పలకడం
రాదు కొంచెం కొంచెమైనా..
మన దేశంలో
భిన్న ప్రాంతాలు..
విభిన్న భాషలు..
మరి ఇంగ్లీషో..
వచ్చినా రాకున్నా
మాటాడ్డం
అదో పెద్ద షో..!

అన్నట్టు..షేక్స్ పియర్
పుట్టిన రోజో..గిట్టిన రోజో..
రెండూ ఒకే రోజో మరి..
ఆయన పుట్టక మునుపూ
ఉంది ఇంగ్లీషు..
కాని ఆయన పుట్టాక
ఆ భాషకు కొత్త సొగసు..
ఆయన మనసు..
ఆంగ్లంతో నిండిన
అందమైన దినుసు..
ఆ గొప్ప రచయిత పేరిటే
ఇంగ్లీష్ డే..
మనమూ అర్పిద్దాము
ఆయనకో బౌ..
మన భాషలో మంగిడీ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్

Leave a Reply