– సీఎస్‌పై వేటు వేయలేదేం?
– ఆయనను రక్షిస్తున్నదెవరు?
– పథకాలకు నిధుల బదిలీలో సీఎస్ అత్యుత్సాహం కనిపించలేదా?
– కూటమి ఫిర్యాదులు అరణ్యరోదనే
– పోలింగ్ ముందు డీజీపీ బదిలీ వల్ల ఏం ప్రయోజనం?
– తెలుగు డీజీపీ ఈసీకి పనికిరారా?
– మరి బెంగాల్‌లో స్థానికుడికే ఎలా ఇచ్చారు?
– డీఎస్పీ,సీఐలపై ఎన్డీఏ కూటమి ఫిర్యాదులు నిష్ఫలం
– మాచర్లలో ఇద్దరు ఐజీలున్నా ఎస్పీపైనే వేటా?
– ఎస్పీ నివేదిక ఇచ్చినా ఎస్పీపై చర్యలా?
– పోలీసు పరిశీలకుడి నివేదిక అడగరా?
– మాచర్ల ఘటనలో ఈసీదే వైఫల్యం
– రాష్ట్ర ఎన్నికల సంఘంలో వేగమేదీ?
– ఢిల్లీ నుంచి వస్తేనే చర్యలా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల సమయంలో ఎంత పెద్ద ప్రధాని అయినా.. ఎంత లావు ముఖ్యమంత్రులయినా ఎన్నికల సంఘం ముందు బలాదూరే. ఆ సమయంలో వారే అసలైన పాలకులు. అంటే సర్వాధికారులన్నమాట. చివరాఖరకు కోర్టులు కూడా ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పేశాయి.
మరి అంత పవర్‌ఫుల్ ఈసీ ఏపీలో ఎందుకు చేష్టలుడిగిపోయింది? సొంత నిర్ణయాలు తీసుకోకుండా, ఢిల్లీవైపు ఎందుకు చూసింది? మూడు ప్రధాన పార్టీలు కట్టకట్టుకుని.. కట్టలు కట్టలుగా చేసిన ఫిర్యాదులను ఎందుకు పట్టించులేదు? అందరి వేళ్లూ అనుమానంగా చూపిన సీఎస్‌ను, ఇప్పటిదాకా ఎందుకు బదిలీ చేయలేదు? ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి? ఆయనను ఏ టీటీడీ రెడ్డిగారు రక్షిస్తున్నారు? అసలు పోలింగ్ అనంతర హింసకు, ఈసీ వైఫల్యమే కారణం కాదా? ఇద్దరు ఐజీలు పర్యవేక్షించిన మాచర్ల అల్లర్లకు, ఎస్పీని బలి చేయడం ఏకపక్షం కాదా? అసలు అది ఎన్నికల సంఘమా? లేక ఎన్ని‘కళంక’ సంఘమా?.. ఇదీ సగటు ఆంధ్రుడు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.
ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న సీఎం జగన్ సందేహమే చివరకు నిజమయింది. అధికారులను మార్చిన చోటనే అల్లర్లు జరిగాయన్న.. సలహాదారు సజ్జల కవి హృదయాన్ని ఈసీ అర్ధం చేసుకుంటే, ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు విఫలమయ్యారో స్పష్టమవుతుంది. పోలింగ్ అనంతరం పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన పైశాచికదాడులు, చివరాఖరకు ఎస్పీ కారుపై ముష్కరమూకలు దాడి చేస్తే.. ప్రాణభయంతో పోలీసులు ఇళ్లలో దాక్కున్న సిగ్గుమాలిన పనికి, ఎవరు నవరంధ్రాలూ మూసుకోవాలి? అసలు ఈ వైఫల్యంలో ఈసీ పరిశుద్ధురాలా? కాదా? అన్నది చూద్దాం.
ఏపీలో పాలకులకు పక్కభజనలు చేసే కొందరు పోలీసు అధికారులు.. ఎన్నికల సమయంలో వికృతరూపం చూపిస్తారని, ఎన్డీయే కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ సర్కారుకు భజంత్రీలుగా మారిన ఆ అధికారుల పేర్లు కూడా నివేదించింది. వారితోపాటు కిందిస్థాయిలో ‘ఫ్యాను’కు ‘ఫ్యాన్సు’గా మారిన డీఎస్పీ-సీఐల పేర్ల జాబితా కూడా ఇచ్చింది. అయినా ఈసీ పట్టించుకోలేదు. అప్పుడే ఈసీ కళ్లు తెరచిఉంటే, ఇప్పుడు ఆంధ్రా జాతీయ స్థాయిలో అప్రతిష్ఠ మూటకట్టుకునేది కాదన్నది మేధావుల మాట.
అన్నింటికీ మించి.. జగన్ సర్కారు మళ్లీ రావాలని కోరుకునే సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించాలని కాళ్లకుబలపాలు కుట్టకుని తిరిగింది. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసింది. స్వయంగా ఎన్డీయే నేతలే వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపి, ప్రముఖ న్యాయవాదని కనకమేడల రవీంద్ర అయితే ఢిల్లీలోనే తిష్ఠవేసి, ఆంధ్రాలో రోజువారీ జరిగే అరాచకాలపై పుంఖానుపుంఖాల ఫిర్యాదులిచ్చారు. అయినా పాపం ఆయనకు మిగిలింది కంఠశోషనే.
సీఎస్ జవహర్‌రెడ్డిని తొలగించాలని చివరకు.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చేసిన ఫిర్యాదులను ఈసీ బుట్టదాఖలు చేసింది. ఎన్నికలపై ప్రభావం చూపిస్తున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని బదిలీ చేయాలని కోరితే, ఆయన సర్వీసు పొడిగించిన ఘనత మన కేంద్రానిది. బదిలీల సందర్భంలో చేసే సిఫార్సులో సీఎస్ చాలా తెలివిగా వ్యవహరించి, తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఈసీ జాబితాలో చొప్పించారన్నది ప్రధాన ఆరోపణ.
పోలింగ్ ముందురోజు లబ్ధిదారులకు లాభం చేకూర్చడం ద్వారా, తన కడప జిల్లా వాసిని మళ్లీ సీఎం చేయాలన్న ఆయన తపన ఫలించలేదు. దానికి ఈసీ అంగీకరించలేదు. పేదలకు మంచిచేద్దామంటే, ఈసీతో కలసి కూటమి కుట్ర చేస్తోందని జగన్ సహా వైకాపేయులంతా ఇల్లుపీకి పందిరేశారు. మరి పోలింగ్ అయిన తర్వాత ఈసీ కూడా.. ‘‘పథకాల డబ్బు ఆపినందుకు మీరు మమ్మల్ని బద్నాం చేశారు. ఇప్పుడు పోలింగ్ ముగిసింది కాబట్టి, మీరు చెప్పిన డబ్బులు లబ్థిదారులందరికీ ఒకేసారి వేయండి ’’ అని ఈసీ ఆదేశిస్తే, నిజంగా అది ఎన్నికళంక’ సంఘం కాకుండా.. ఎన్నికల సంఘమే అయ్యేదని బుద్ధిజీవుల ఉవాచ.
డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెస్పెన్షన్ చెల్లదని, క్యాట్ విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోమని సీఎస్‌ను ఆదేశించింది. బుర్ర-బుద్ది ఉన్న వారెవరయినా.. తక్షణం అంటే ‘వెంటనే’ అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయినా ఇప్పటిదాకా సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మామూలురోజుల్లో అయితే, సీఎం నిర్ణయం కోసం ఎదురుచూడాలి. కానీ ఇప్పుడు స్వయంగా సీఎస్ నిర్ణయాధికారి.
అయినా సరే ఆయన ఏబీకి పోస్టింగ్ ఇవ్వలేదు. పైగా హైకోర్టుకు అపీలుకు వెళితే కోర్టు తిరస్కరించింది. హైకోర్టు-సుప్రీంకోర్టు-చివరకు క్యాట్ కూడా.. ఏబీ సస్పెన్షన్ చెల్లని విస్పష్టమైన తీర్పు ఇచ్చి, ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించాయి. కానీ సీఎస్ మాత్రం ఏబీకి పోస్టింగు ఇవ్వకుండానే, రిటైర్ చేయించాలన్న కృషి చేయడం ఎవరి కళ్లలో ఆనందం చూసేందుకన్నది సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్న ప్రశ్న. వెంకన్న తిరుమల సన్నిథిలో తిష్టవేసిన ఓ రెడ్డిగారే, ఈ మొత్తం యవ్వారంలో చక్రం తిప్పితే, అది తెలుసుకోలేని ఎన్డీయే కూటమి కళ్లు మూసుకుంది.
సీఎస్ ఉత్సాహానికి సంబంధించి కళ్లెదుట ఇన్ని ఉదంతాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోకుండా ఈసీ ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తే.. మరి అది ఎన్నికల సంఘం అవుతుందా? ఎన్ని‘కళంక’ సంఘం అవుతుందా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. పోనీ డీజీపీనయినా.. ఫిర్యాదులొచ్చిన వెంటనే మార్చారా అంటే అదీలేదు. మీనలేషాలు లెక్కబెట్టి నిర్ణయం తీసుకునేలోగా, పోలింగ్ గడువు దగ్గరపడింది. ఇక ఆయనను బదిలీ చేసి ఏం ప్రయోజనం? పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు డీజీపీని మార్చిన ఈసీకి.. కొత్త డీజీపీ మాట, కిందస్థాయి అధికారులు వింటారా? ఆయన సంసారం చక్కబెట్టుకోవడానికి ఎంతకాలం పడుతుందన్న సందేహం ఈసీకి రాకపోవడమే విచిత్రం.
మరి డీజీపీ ఎంపికలో ఈసీ ఏమైనా, అందరూ మెచ్చే నిర్ణయం తీసుకుందా? అంటే అదీ లేదు. సీనియారిటీలో మొదటి పేరున్న ద్వారకాతిరుమలరావును పక్కనపెట్టి, హరీష్‌గుప్తాను పీఠమెక్కించింది. కారణం ద్వారకా తిరుమలరావు స్థానికుడు కావడమేనట. అంటే స్థానికుడైతే నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకోలేరన్నది ఈసీ కవిహృదయం కామోసు! డీజీపీ ఎంపికలో ఇంత జాగ్రత్తలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం, మరి కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే పశ్చిమబెంగాల్ డీజీపీఐ వేటేసింది. అదే పని ఏపీలో చేయలేకపోయింది. అది వేరే విషయం!
మరి బెంగాల్‌లో కూడా స్థానికుడికి కాకుండా, ఉత్తరాది అధికారికి డీజీపీ ఇచ్చిందా అంటే అదీ లేదు. అక్కడ 1989 బ్యాచ్‌కు చెందిన సంజయ్ ముఖర్జీకి, డీజీపీ ఇవ్వాలని సిఫార్సు చేసింది. సదరు అధికారేమీ ఇక్కడ డీజీపీ మాదిరిగా ఉత్తరాది అధికారి కాదు. పదహారణాల బెంగాలీబాబే! గత ఎన్నికల్లో కూడా ఈసీ ఉత్తరాది అధికారులకే పట్టం కట్టడాన్ని విస్మరించలేం. మరి పశ్చిమబెంగాల్ న్యాయం.. ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వర్తించదని ప్రశ్నించిన వారేలేరు. అంటే విధి నిర్వహణలో ఉత్తరాదివారు తప్ప, మిగిలినవారెవరూ మొనగాళ్లు కాదన్న ఈసీ సిద్ధాంతాన్ని అంతా అంగీకరించాలి..అంగీకరించారన్నమాట!
ఇక గుంటూరు-అనంతపురం ఎస్పీలపై ఈసీ వేసిన వేటు కూడా, నిస్సందేహంగా విమర్శలకు అర్హమైనవే. తనకు సరిపడా సిబ్బంది ఇవ్వమని వేడుకున్న, గుంటూరు ఎస్పీ బిందుమాధవ్‌ను సస్పెండ్ చేసిన ఈసీ.. హింస జరిగిన అదే మాచర్లలో పర్యవేక్షకులుగా ఉన్న ఇద్దరు ఐజీలను మాత్రం ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. ఒకేచోట ఇద్దరు ఐజీలను పెట్టి, వారి కింద ఒక ఎస్పీని పనిచేయమంటే.. కింది స్ధాయి పోలీసులు ఎవరి మాట వింటారన్న తెలివి, మెడపై తల ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ తెలివి ఈసీకి లేదని, అది తీసుకున్న నిర్ణయంతో తేలిపోయింది. అనంతపురం-తిరుపతిలో కూడా అదే పరిస్థితి.
కింద స్థాయిలో పనిచేసే వీరభక్త వైసీపీ అభిమాన అధికారులను తొలగించకుండా, ఎస్పీలు ఎలా స్వేచ్ఛగా పనిచేస్తారన్న స్పృహ కూడా ఈసీకి లేకపోవడం మన దౌర్భాగ్యం. ఇద్దరు ఐజీల పర్యవేక్షణలో ఉన్న మాచర్లలో, వారి క ళ్లు కప్పి అక్కడి ఎమ్మెల్యే-ఆయన సోదరుడు పరారయిపోవడం ఎవరి నిర్లక్ష్యం? దానికి శిక్ష వేయాల్సింది ఎవరికి? అక్కడి జిల్లా ఎస్పీకా? అక్కడే ఉండి శాంతిభద్రతలు పర్యవేక్షించిన ఇద్దరు ఐజీలకా? ఈ ప్రశ్నకు జవాబిచ్చే ధైర్యం ఈసీకి ఉందా?
పోలింగ్ అనంతర హింసకు కారణమయిన ఐఏఎస్-ఐపిఎస్, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలపై వరసగా వేటు వేసి చేతులుదులిపేసుకున్న ఈసీ.. అసలు వారి బాసులయిన డీజీపీ-సీఎస్‌లపై, ఎందుకు వేటు వేయలేదు?వారేమైనా బదిలీలకు అతుతులా? అన్నది పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్న. ఎన్నికలకు ముందే పాలకపార్టీ అడుగులకు మడుగులొత్తే వారి జాబితాను, ఎన్డీయే కూటమి జిల్లాల వారీగా ఇచ్చింది. వారిపై చర్యల కొరడా ఝళిపించకుండా.. గుప్పెడునిద్రమాత్రలు మింగిన వారిలా మత్తుగా జోగిన వైనాన్ని, ఎన్ని‘కళంక’ సంఘమంటే తప్పేమిటన్నది పౌరసమాజం ప్రశ్న. ఎందుకంటే.. ఈసీ వైఫల్యం కళ్లెదుటే కనిపిస్తోంది కాబట్టి!