పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

• ప్రకృతిని ప్రేమించటం, కలిసి జీవించటం జీవన విధానంలో భాగం చేసుకోవాలి
• మన పూర్వీకులతో పాటు, పవిత్ర గ్రంథాలన్నీ ఇదే విషయాన్ని నొక్కి చెప్పాయి
• ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి, దాని రక్షణ కోసం అన్ని విధాల ప్రయత్నం చేయాలి.
– పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు
• విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణార్థులతో ముచ్చటించి, వారికి ధృవపత్రాలు అందజేత

విజయవాడ, 18 నవంబర్ 2023: పర్యావరణ పరిరక్షణ మనందరి సమష్టి బాధ్యత అని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మానవ చర్యల కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందన్న ఆయన, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, తుఫానులు, తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫానులు, కరువుల రూపంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. నీటికొరత, నదులు ఎండిపోవడం, కాలుష్యం పెరగడం లాంటి ప్రతికూల పరిస్థితులు మానవ జాతితో పాటు పలు జంతు, వృక్ష జాతుల మీద సైతం తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితి మారాలంటే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. ప్రకృతిని ప్రేమించటం ప్రకృతితో కలిసి జీవించటం ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్న ఆయన, ప్రకృతి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలని, ప్రకృతి పరిరక్షణ కోసం అన్ని విధాల ప్రయత్నం చేయాలని సూచించారు. మన పూర్వీకులుతో పాటు, భారతీయ ప్రాచీన పవిత్ర గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయని పేర్కొన్నారు.

విజయవాడ పర్యటనలో ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణార్థులతో ముచ్చటించారు. అనంతరం కోర్సులు పూర్తి అయిన వారికి ధృవపత్రాలు అందజేశారు.

ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశం…..
గత కొన్నేళ్ళుగా సునామీలు, భూకంపాలు, కొండచరియలు విరిగి పడడం లాంటి ఎన్నో ప్రకృతి విపత్తుల గురించి మనం పత్రికల్లో చదివాం. భూతాపం విపరీతంగా పెరిగిపోవడం, అడవుల్లో కార్చిచ్చులు, తీవ్రమైన కరువులు, వడగాలులు, తుపానులు, వరదలు, అకాల భారీవర్షాలు, మంచుపర్వతాలు కరగడంతో పెరుగుతున్న సముద్ర మట్టాలు వంటివి విపత్కర మార్పుల కారణంగా పర్యావరణంలో పెనుమార్పులను గమనిస్తున్నాం. విచ్చలవిడిగా చెట్లు కొట్టేయడం వల్ల భూతాపం విపరీతంగా పెరుగుతోంది. పర్యావరణ అసమతుల్యతల కారణంగా… కాలం గాని కాలంలో వర్షాలు, పిడుగులు పడి తీవ్రమైన నష్టాలు వాటిల్లుతున్నాయి.

అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది, వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణం పెరుగుతోంది, చెరువులు, నదులు వంటి జలవనరులను ఆక్రమించుకోవడం కారణంగా వరదల ద్వారా ప్రకృతి ప్రకోపాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యతగా గుర్తించాలి. ఇందు కోసం మనమంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతితో కలిసి జీవించండి. మన పూర్వీకులు, మన పవిత్ర గ్రంథాలు, అదే విధంగా ఆధ్యాత్మిక భావాలు కలిగిన గ్రంథాలన్నీ కూడా ప్రకృతి – మానవుల మధ్య ఉన్నక అవినాభావ సంబంధాన్ని పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల గౌరవం కలిగి ఉండాలి. అదే విధంగా దాని రక్షణ కోసం అన్ని విధాల ప్రయత్నం చేయాలని మన పురాతన పవిత్ర గ్రంథాలన్నీ పేర్కొన్నాయి.

మన పురాతన రుగ్వేదం ప్రకృతి ప్రాధాన్యతను వివరించింది. మన సంస్కృతిలో నేటికీ నదులు, పర్వతాలు, చెట్లను దేవి దేవతలుగా ఆరాధించే సంప్రదాయం ఉంది. రుగ్వేదంలోని అనేక మంత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వేదాంతానికి పునాదులైన ఉపనిషత్తుల్లో కూడా ప్రకతితో కలిసి జీవించటం అవసరం అని పేర్కొనటాన్ని మనం గమనించవచ్చు. వేదాల వ్యాఖ్యానంగా చెప్పే “బ్రాహ్మణం” కూడా మనవ జాతి ప్రకృతి పట్ల నిర్వర్తించాల్సిన విధుల గురించి, ప్రకృతి మనల్ని ఏ విధంగా కాపాడుతుందనే అంశాల గురించి సమగ్రంగా వివరించారు.

మహాభారతంలో గోవర్థనోద్ధర ఘట్టం మొదలుకుని అనేక సందర్భాల్లో ప్రకృతి ప్రాధాన్యత మన కనిపిస్తుంది. భగవద్గీతలో సైతం శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణ గురించి అర్జునుడికి బోధించాడు. ధర్మాన్ని పరిరక్షించటమంటే తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించటం. అందులో ప్రకృతి పట్ల ప్రేమ కూడా ఒక కర్తవ్యం అనే విషయాన్ని మనం గమనించాలి.

జైనమత సిద్ధాంతాల్లో కూడా అహింస ప్రధానమైనది. అన్ని ప్రాణుల పట్ల దయ, గౌరవం కలిగి ఉండాలన్న సందేశాన్ని ఇస్తూ, ప్రకృతికి కనీస ఇబ్బంది కూడా కలగకుండా జీవనాన్ని రూపొందించుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. బౌద్ధ ధర్మంలో కూడా పర్యావరణాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను గౌతమ బుద్ధుడు వివరించారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా ప్రకృతితో కలిసి జీవించాలని చెప్పారు. పరస్పర గౌరవం కలిగి ఉండటం, ప్రకృతిలోని అన్ని ప్రాణులను రక్షించుకోవటం మన బాధ్యత అని పేర్కొన్నారు.

మన అనేక హిందూ పండుగల్లో కూడా ప్రకృతి ఆరాధన ప్రముఖంగా ఉంటుంది. నవరాత్రులు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఫృద్వీపూజ అంటే భూమి పూజ పండుగ ప్రకృతిని పరిరక్షించుకునే అవసరాన్ని చెబుతోంది. ప్రకృతి పట్ల గౌరవ భావం, ఆరాధన కలిగి ఉండాలని కూడా మన పెద్దలు చెబుతుంటారు.

మనిషి ఎప్పుడూ ప్రకృతితో కలిసి జీవించాలి. ప్రకృతి, మన సంస్కృతి అదే మన భవితకు మంచి మార్గం. ఈ పవిత్ర మార్గాన్ని గుర్తుంచుకుని యువత తమ జీవనంలో ఆచరించటంతో పాటు ఇతరులకు కూడా మార్గదర్శనం చేయాలి. యువత మన దేశ భవిత అని చెబుతుంటాం. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన భవిష్యత్తు కోసం ప్రకృతితో కలిసి జీవించాలి.

Leave a Reply