Suryaa.co.in

Andhra Pradesh Telangana

కవిత అరెస్టు జరిగాక కూడా, కెటిఆర్ ఇలాంటి వ్యాఖ్యలకే కట్టుబడి ఉండాలి

చదవేస్తే ఉన్న మతిపోయిందంట
కెటిఆర్ వ్యాఖ్యలకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య కౌంటర్

అధికారం తలకెక్కితే కన్నూ మిన్నూ కానరాదు అనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ కూడా ఒక విద్యార్థి అని, కాబట్టే జగన్ పలుకులు పలుకుతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు తెలంగాణాలో వ్యక్తమవుతున్న నిరసనలను ఆయన తప్పు పట్టటం, చదవేస్తే ఉన్న మతిపోయిందంట అన్నట్లుగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వాలు తప్పు చేస్తే, నిరసనలు తెలపటం పౌరుల ప్రాథమిక హక్కు అని చెప్పారు. ప్రభుత్వాలు ఇది నా రాష్ట్రం, మా ప్రభుత్వం అంటూ రాష్ట్రాలను, ప్రజలను బర్త్ డే కేకు ముక్కలుగా కోచుకుంటారా? అని ప్రశ్నించారు.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ లలో చంద్రబాబు అరెస్టుకు నిరసనలు జరిగాయని, కెటిఆర్ కు ఉన్న అపార రాజకీయ అనుభవం అక్కడి ప్రభుత్వాలకు లేదా? అంటూ ఎద్దేవా చేశారు. శత్రువు శత్రువుకు మిత్రుడు అన్నట్టు వైసీపీ, టిఆర్ఎస్ మిత్రులు అన్న సంగతి తెలుగు ప్రజలకు కెటిఆర్ మరోసారి స్పష్టం చేశారు అని పేర్కొన్నారు. మద్యం కేసులో చెల్లెలు అరెస్టు జరిగాక కూడా, కెటిఆర్ ఇలాంటి వ్యాఖ్యలకే కట్టుబడి ఉండాలని బాలకోటయ్య సూచించారు.

LEAVE A RESPONSE