– రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్
జగన్ పెట్టే ప్రతి స్కీం ఒక స్కాం అని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. మోపిదేవి పుణ్యక్షేత్రం, లంకమ్మ దేవస్థానం దర్శించుకున్న అనంతరం ఆయన అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రముఖ అవినీతి రాజకీయవేత్తగా అత్యంత ధనిక సీఎం జగన్ అని జాతీయ మీడియా చెబుతున్న దశలో చంద్రబాబుపై బురద అంటించేందుకే అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయించారని అన్నారు.
జగన్ పాలనలో రాష్ట్ర ఆదాయంలో అరవై శాతం ఎటు పోతుందో లెక్క లేదన్నారు. చివరికి చిన్నపిల్లలకు పెట్టే పప్పుల చిక్కీలో కూడా అవినీతి బయట పడిందన్నారు. చంద్రబాబు హయాంలో, జగన్ పాలనలో చేసిన అప్పులు, అభివృద్ధి, ఆదాయం, సంక్షేమ పథకాలు, సంపద వృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయమంటే ఇప్పటికి చేయలేదన్నారు.
లెక్కలు చెప్పమంటే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బూతులు తిడుతూ బుకాయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన పోయి ప్రభుత్వ పాలన రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. అవినీతి, అరాచక పాలనతో విసిగి పోయిన ప్రజలకు టీడీపీ శ్రేణులు నాయకత్వం వహించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృతనిశ్చయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.