Suryaa.co.in

Andhra Pradesh

మీడియాపై పక్షపాత ధోరణి సమంజసం కాదు

– స్పీకర్, ప్రభుత్వం పునరాలోచించాలి
– అసెంబ్లీ కవరేజికి అందరికీ అవకాశం ఇవ్వాలి

అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజికి కొన్ని పత్రికల, చానళ్ల,రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని , ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు , ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డీ సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ఏచూరి, సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఆమేరకు సోమవారం వారు ఒక మీడియా ప్రకటన జారీ చేశారు.

రాజ్యాంగంలో చట్టసభలకు అత్యున్నత గౌరవం ఉందని, అదే విధంగా పత్రికా రంగానికి కూడా నాలుగో స్థంభంగా కీలకస్థానం ఉందని, శాసనసభ కవరేజికి అన్ని పత్రికల చానళ్ల విలేఖరులకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా కొందరికి అనుమతి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం విచారకరమని , మీడియా పట్ల అలాంటి పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు ఆ ప్రకటనలో అభిప్రాయ పడ్డారు.

ఈ విషయంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటారని తాము ఊహించలేదని, అపారమైన రాజకీయ అనుభవం, ప్రజాస్వామ్య పరిణతి కలిగిన సభాపతి తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

గతంలో వైఎస్ ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని పత్రికలు , ఛానెళ్ల ప్రతినిధులకు శాసనసభ కవరేజికి అవకాశం నిరాకరించడం జరిగిందని , అవే తప్పులను కూటమి ప్రభుత్వం కొనసాగించడం 2024 ఎన్నికల తీర్పులోని ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు.

అలాగే ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు చానల్స్ ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః పరిశీలించి , మీడియా ప్రతినిధులు అందరికీ అవకాశం ఇవ్వాలని , రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ 9, ఎన్టీవీ, టెన్ టీవీ, సాక్షి టీవీ, సాక్షి పేపర్ తో పాటు మిగిలిన అన్ని చానల్స్, పేపర్స్ కు అనుమతి ఇవ్వాలని సోమవారం వారు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE