– ఉన్నతస్థాయి సమన్వయ కమిటీలో ఉండేదెవరు?
– జిల్లా స్థాయి సమన్వయకమిటీలుంటేనే మంచిదంటున్న టీడీపీ-జనసేన నేతలు
– అప్పుడే ఓటు బదిలీ అవుతుందన్న విశ్లేషణ
– గత తెలంగాణ ఎన్నికలకు భిన్నంగా ఉండాలన్న సూచన
– సమన్వయ కమిటీలు లేకపోవడం వల్లనే దెబ్బతిన్న టీడీపీ-కాంగ్రెస్ పొత్తు
-టీడీపీ-జనసేన కలసి కార్యక్రమాలు చేస్తేనే ఫలితాలు
– బీసీ,కాపు,మాదిగ నేతలు కమిటీలో ఉంటేనే ప్రయోజనం
– సీమలో రెడ్డి-బలిజ-బీసీ నేతలుండాలని సూచన
– త్వరలోనే రెండు పార్టీల సమన్వయకమిటీ ఆవిర్భావం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ-జనసేన పొత్తు నిర్ణయం ఒకటి. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ స్వయంగా రాజమండ్రి జైలుకు వెళ్లి.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న విషయం తెలిసినప్పటికీ, అది ఎప్పుడన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ పవన్ ఒకడుగు ముందుకేసి.. రాజకీయాల కోసం కాకుండా, రాష్ట్రం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని వెల్లడించారు.
పవన్ ప్రకటనతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. దానితో టీడీపీకి ఆరోజు నుంచి నైతికస్ఱైర్యం పెరిగినట్లు కనిపించింది. చంద్రబాబునాయుడుకు, మేనల్లుడయ్యే జూనియర్ ఎన్టీఆర్ అంతటివాడే.. బాబును అరెస్టు చేయించడంపై తప్పించుకున్న విషయాన్ని శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. అలాంటిది కేవలం ఒక లక్ష్యం కోసం, పవన్ స్వయంగా జైలుకు వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, టీడీపీకి మనోస్థైర్యం ఇచ్చే అంశమేనంటున్నారు. ఈ పరిణామాల తర్వాత పొత్తు బంధాన్ని క్షేత్రస్థాయికి చేర్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆమేరకు చంద్రబాబు-యనమల రామకృష్ణుడు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే.. పొత్తును కిందిస్థాయికి చేర్చడం ఆషామాషీ వ్యవహారం కాదు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా, ఓట్లు బదిలీ కాలేదు. కాంగ్రెస్ వ్యతిరేకవిధానాలతో పుట్టిన టీడీపీ.. అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని, సంప్రదాయ టీడీపీవాదులు జీర్ణించుకోలేకపోయారు. దానితో టీడీపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు.
ఫలితంగా ఎవ రూ సంతృప్తికర స్థానాలు సాధించలేకపోయాయి. టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, జిల్లా-రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటుచేయలేకపోయారు. దానితో పొత్తు లక్ష్యాన్ని ప్రజలను వివరించలేకపోయారు. అందుకు ఫలితం అనుభవించాల్సి వచ్చింది.
ఇప్పుడు ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు తదనంతర పరిణామాలు, ఆవిధంగా ఉండకూడదన్న అభిప్రాయం, ఇరు పార్టీల నేత ల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా పొత్తు లక్ష్యం- పొత్తు అవసరం క్షేత్రస్థాయికి వెళ్లాలంటే.. జిల్లా స్ధాయి సమన్వయ కమిటీలు అత్యవసరమని నేతలు స్పష్టం చేస్తున్నారు. జిల్లాల్లో నియోజకవర్గాలపై పట్టు ఉన్న నేతలను ఎంపిక చేసుకోవాలంటున్నారు.
నియోజకవర్గాల వారీగా కుల మతాలకు సంబంధించిన లెక్కలు, స్థానిక నేతల ప్రాధాన్యాలు తెలిసిన వారిని జిల్లా సమన్వయ కమిటీల్లో నియమించాలంటున్నారు. ఇవన్నీ పొత్తును క్షేత్రస్థాయికి తీసుకువెళతాయని నేతలు విశ్లేషిస్తున్నారు. ఇందులో బీసీ-కాపు-మాదిగ వర్గాలకు చెందిన మాజీ మంత్రుల స్ధాయి వారిని నియమిస్తే, సానుకూల ఫలితాలు వస్తాయంటున్నారు. ఇతర కులాలకు చెందిన ప్రముఖులను కూడా చేరిస్తే, సమతుల్యం ఉంటుందని సూచిస్తున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులైన బీసీ-కాపు-మాదిగ వర్గ నేతలను రాష్ట్ర సమన్వయ కమిటీలో నియమిస్తే, దాని ప్రభావం కింది స్థాయికి చేరుతుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం దానిపైనే కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు ఆదేశాలతో, లోకేష్ వీటిపై కసరత్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తాజాగా చంద్రబాబు-యనమల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బీసీల్లో సంఖ్యాబలం ఉన్న యాదవ, శెట్టిబలిజ, కొప్పుల వెలమ ప్రముఖలకు స్థానం కల్పిస్తే, సానుకూల ఫలితాలుంటాయని చెబుతున్నారు. సీమ నుంచి రెడ్లు-బలజలకు స్థానం కల్పిస్తే, పొత్తు చర్చలు అర్ధవంత ంగా ఉంటాయంటున్నారు.
ఆ ప్రకారంగా రాష్ట్ర స్థాయి సమన్వయకమిటీలో.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి యనమల రామకృష్ణుడు(యాదవ), పితాని సత్యనారాయణ(శెట్టి బలిజ), కోస్తా నుంచి కన్నా లక్ష్మీనారాయణ (కాపు), వర్ల రామయ్య (మాదిగ); ఉత్తరాంధ్ర నుంచి అయ్యన్నపాత్రుడు (బీసీ వెలమ), దక్షిణ సీమ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీమ నుంచి పయ్యావుల కేశవ్ (కమ్మ), చెంగల్రాయుడు( బలిజ) ని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
వీరంతా రాష్ట్రంలో తమ కులానికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్నవారే. అది పొత్తు చర్చలకు అక్కరకొస్తుంది కాబట్టి.. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలో వీరు ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రధానంగా తూర్పు-పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు పైనే ఇరు పార్టీలూ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల బలం ఎక్కువగా ఉన్న క్రమంలో.. అక్కడ వారంటే గిట్టని శెట్టిబలిజ, దళితులను సమన్వయం చేసుకోవలసి ఉంటుంది. సీట్ల పంపిణీలో సమతుల్యం ఉండేలా చూడాలంటే, సీనియర్లు అవసరం. ఇక ఉత్తరాంధ్రలో బీసీ కాపు-యాదవ-తూర్పు కాపుల సంఖ్య ఎక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది.
వీటన్నింటికంటే ముందు… సమన్వయ కమిటీల ఏర్పాటు తర్వాత, జిల్లా స్థాయి కమిట నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తేనే, పొత్తు ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దానివల్ల ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అవుతాయని స్పష్టం చేస్తున్నారు.