ప్రవాసాంధ్రులు, తానా పాత్ర మరువలేనిది

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-తానా అధ్యక్షుడు శృంగవరకు నిరంజన్‌కు సత్కారం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రస్థానంలో ప్రవాస భారతీయులు, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, వినుకొండ టీడీపీ అభ్యర్థి ప్రశంసించారు. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా ఉన్న ఉత్తర అమె రికా తెలుగు సంఘం(తానా) మొదటి నుంచి ఈ విషయంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు. అటువంటి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న శృంగవరపు నిరంజన్‌ మరెంతో ప్రత్యేకమని కొనియాడారు. కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న నిరంజన్‌ను జీవీ వినుకొండకు ఆహ్వానించారు.

ఆయన ఆహ్వానం మేరకు శనివారం వినుకొండ రాగా జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు సాదర స్వాగతం పలికారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వినుకొండ నియోజక వర్గ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్‌ మాట్లాడుతూ తానా బృందంతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు, కంటి చికిత్స శిబిరాలు, కేన్సర్‌ బాధితులకు అండగా ఉండడం, రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు, పేద విద్యార్థులకు తోడ్పాటు, ఉపకార వేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు వంటి వాటిని పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయంలో అమెరికాలో ఉన్న తెలుగువారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటా యన్నారు. అనంతరం జీవీ ఆంజనేయులు సేవా కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ తానా సేవా కార్యక్రమాల్లో ఈ ప్రాంతానికి ప్రాధాన్యమిస్తే కరవు పీడిత పల్నాడుకు ఎంతో మేలుచేసినట్లు అవుతుందని కోరారు. వారి వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.

Leave a Reply