Suryaa.co.in

Editorial

కొడుకును చూసి ‘తల్లి’డిల్లిన విజయమ్మ

– సమాధి వద్ద ఎవరి నివాళి వారిదే!
– వైఎస్ జయంతిలో ‘కుటుంబ చిత్రం’
– జగన్, షర్మిల వేర్వేరు నివాళులు
– కొడుకును చూసి విజయలక్ష్మి కన్నీళ్లు
-కూతురుని చూసి కన్నీరు పెట్టుకున్న తల్లి
– ఓటమి తర్వాత విజయమ్మ ‘తొలి ఓదార్పు’
( మార్తి సుబ్రహ్మణ్యం)

అన్నా చెల్లెళ్ల లెక్కలు ఇంకా సెటిలయినట్లు లేదు. బిడ్డల మధ్య త ల్లి సయోధ్య కుదుర్చుతున్నారన్న, సోషల్‌మీడియా వార్తలు కూడా అబద్ధమేనని తేలింది. అందుకే తండ్రి జయంతికి అన్నా చెల్లెళ్లు ఎవరి దారిలో వారు నివాళులర్పించారు. ఇదీ ఇడుపులపాయ వైఎస్ సమాధి సాక్షిగా కనిపించిన పులివెందుల ‘కుటుంబ చిత్రం’!

వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.. ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద, మళ్లీ పాత చిత్రమే కొత్తగా కనిపించింది. తొలుత కొడుకు, మాజీ సీఎం జగన్ వచ్చి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. అంతకుముందే తల్లి విజయమ్మ అక్కడికి చేరుకున్నారు.

ఎన్నికల ముందు కూతురుకు దీవెనలిచ్చి.. కొడుకుకు దూరంగా లండన్‌కు వెళ్లిపోయిన విజయమ్మ, ఆయన ఓటమి తర్వాత బహిరంగంగా కలుసుకోవడం ఇదే తొలిసారి. అయితే కూతురు షర్మిలతో కలసి ఇండియా వచ్చిన విజయమ్మ, అటు నుంచి అటే జగన్ ఇంటికి వెళ్లారు. కానీ ఒక కార్యక్రమంలో ఇలా బహిరంగంగా కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఓటమితో కుంగిపోతున్న కొడుకుని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. అంతకుముందు ఐదేళ్లు సీఎం హోదాలో సమాధి వద్దకు వచ్చిన కొడుకు, ఇప్పుడు అధికార వియోగం అనుభవిస్తుండటం చూసిన తల్లి మనసు బాధపడింది. దానితో ఆమె కొడుకును దగ్గరకు తీసుకుని, ముద్దుపెట్టి ఓదార్చారు. కొడుకు జగన్ కూడా ‘ఏం చేస్తాం మమ్మీ.. ఆ ప్రభువుకూ నేనంటే గిట్టలేదు’ అన్నట్లు తల్లి వైపు చూశారు. ఆవిధంగా కొడుకు ఓటమి తర్వాత, భర్త సమాధి సమక్షంలో కొడుకుకు ఓదార్పు చేసి ముందుకెళ్లారన్నమాట.

అన్నియ్య వెళ్లిపోయాడని తెలుసుకున్న చెల్లెమ్మ షర్మిల, ఇడుపులపాయ సమాధి వద్ద ఎంటరయ్యారు. అక్కడ కూడా సేమ్ టు సేమ్ సీన్. కాకపోతే కొడుకు స్థానంలో కూతురు. మిగిలిన కన్నీరు, ఓదార్పు యాత్ర సేమ్ టు సేమ్. ఆ విధంగా ఎన్నికల్లో ఓడిన కొడుకు-కూతురుకు ఓదార్పుయాత్రతో తల్లి విజయమ్మ స్వస్థత చేకూర్చారు. అయితే అన్నచెలెళ్లు కలసి వచ్చి ఉంటే, సమయం-కన్నీరు వృధా కాకుండా, ‘జమిలి ఓదార్పు’నకు అవకాశం ఉండేది కదా అన్నది వైఎస్ అభిమానుల వ్యాఖ్య.

ఓడినా తగ్గని ‘జగనా’భిమానం
తన పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ, జగన్‌కు జనాభిమానం లభిస్తుండటం కొంత ఊరట. ఇటీవలి ఆయన నెల్లూరు జైలు పర్యటన, తర్వాత పులివెందుల పర్యటన, తాజాగా ఇడుపులపాయకు వచ్చిన జగన్‌ను వేలాదిమంది కలిసే ప్రయత్నం చేశారు. ఆయనతో షేక్‌హాండ్‌కు ప్రయత్నించడం కనిపించింది.

LEAVE A RESPONSE