వంశ వృక్షం

బంధాలు…బాంధవ్యాలు..
ప్రేమాభిమానాలు కరువై
కల్మషమైన భూమిపై
నిర్మానుష్యమైన జీవితం
నేటి మనిషి గమనం….!!

మారుతున్న కాలంలో
భద్రత లేని
బ్రతుకులు ఎన్నో….!!

గత స్మృతులు గాలికి వదిలేసిన
రాగద్వేషాలలో
ఖాళీ అయిపోయిన
కల్మషం లేని
బాల్య జ్ఞాపకాలు ఎన్నో….!!

పెరుగుతున్న వ్యాపకాల్లో
వెన్నెల సాక్షిగా
ఒక్కటైన జంటలు
బండగా మారి దూరమైన
చేదు సంఘటనలు ఎన్నో…!!

ఉరుకులు పరుగుల జీవితంలో
ఆవిరైనా…
ఆస్వాదించని క్షణాలెన్నో….!!

ఏదో ఆశతో
ఇంకేదో పొందుదామనే
అర్థంలేని ఆలోచనలకు
స్వస్తి చెప్పి……

ప్రేమతో పిలిస్తూ
ఆత్మీయంగా
ఆలింగనం చేసుకునే
ముడతలు పడిన దేహాల్ని
అక్కున చేర్చుకో….!!

తరతరాల అనుబంధం
అనుభవాల శరీరం
ఆప్యాయతల సంబంధం
కుటుంబానికే వారు
మూలధనమని నేర్చుకో….!!

అనుబంధాలు అన్నీ కలిసి
కుటుంబానికి బంధమై నిలిచే
ప్రేమ కుసుమాలతో
“వంశ వృక్షాన్ని”
చిగురింప చేసుకో…!!

– నలిగల రాధికా రత్న.

Leave a Reply