Suryaa.co.in

Telangana

రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ హత్యలే…

ఏ మాత్రం సోయి ఉన్నా రైతుల కుటుంబాలను ఆదుకోవాలి
ధరణి పోర్టల్ ద్వారా భూమి నష్టపోతున్న రైతులు
రైతు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ షర్మిల
తెలంగాణ వచ్చినా రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ధరణి పోర్టల్ లో భూమి సమస్య ఇలా రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ కేసీఆర్ హత్యలేనని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి లేదని అధికారులు చెప్పడంతో చింతల స్వామి అనే రైతు మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లి గ్రామంలో చింతల స్వామి కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మాట్లాడుతూ…
సీఎం సొంత నియోజకవర్గం గజ్వెల్ లో చింతల స్వామి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామికి భార్యా, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అధికార పార్టీ తీసుకువచ్చిన ధరణీ పోర్టల్ తో స్వామి అన్న భూమి చూపించడం లేదు. చింతల స్వామి అన్న తండ్రి నర్సయ్య భూమి కోసం ఏడాది కిందట అధికారుల చుట్టూ తిరిగి ఆకరికి చనిపోయాడు. రైతు నర్సయ్య చనిపోయి సంవత్సరం అవుతున్నా భూమి సమస్యను అధికారులు పరిష్కరించలేదు. సర్పంచ్ లతో సహా అందరికీ ఈ సమస్య తెలుసు. సాక్షాత్తూ సీఎం నియోజకవర్గంలో కూడా రైతులు ధరణి పోర్టల్ లో భూమి కోసం చనిపోతే, సమస్యను పరిష్కరించడం లేదు.
చింతల స్వామి కూడా ఇదే భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. అధికారులు భూమి లేదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చి లేఖ రాసి ఉరి వేసుకుని చనిపోయాడు. ధరణి పోర్టల్ సమస్యతో ఈ కుటుంబంలో ఇద్దరూ చనిపోయారు. ఒకే ఇంట్లో ఇద్దరి ప్రాణాలను తీసింది ధరణి పోర్టల్..? ఇంత వరకు భూమి సమస్య పరిష్కారం కాలేదు. భూమి సమస్య పరిష్కారమౌతుందన్న నమ్మకం స్వామి పిల్లలకు కూడా లేదు. అధికార పార్టీ నిరంకుశ పాలనతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ ఇలా పాలన చేస్తే ఎవరికైనా ఎలా నమ్మకం కలుగుతుంది..?
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందనట్టుగా ఉంది కేసీఆర్ తీరు. ఎవరి కోసం ధరణి పోర్టల్ తీసుకువచ్చారు…? ఎవరికి మేలు చేయడానికి ధరణి పోర్టల్ ను కొనసాగిస్తున్నారు..? దండుపల్లిలో చాలా మంది రైతులకు ధరణి పోర్టల్ లో భూమి సమస్య ఉందని వారు చెబుతున్నారు. అధికార పార్టీ ఏం చేస్తున్నట్టు..? సమస్యలను ఏం పరిష్కరిస్తున్నారు..? ఇంత మంది ఆఫీసర్లు ఉండి ఏం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం. సీఎం ఏం చేస్తున్నారు..? ఫాం హౌస్ లో పడుకుని నిద్ర పోయేందకేనా ముఖ్యమంత్రిని చేసుకుంది. ప్రజల సమస్యలు సీఎం తీర్చరా..?
ఒకే ఇంట్లో ఒకే సమస్యతో ఇద్దరు రైతులు చనిపోతే ఒక్క అధికారి అయినా వచ్చి స్వామి అన్న కుటుంబాన్ని పరామర్శించారా..? స్వామి అన్న కుటుంబానికి ఏం సాయం కావాలని ఒక్కరైనా అడిగారా..? ఇంత వరకు అధికారులు ఎవరైనా నష్టపరిహారం అందచేశారా..? ఒక్క పైసా అయినా స్వామి అన్న కుటుంబానికి అందిందా అని చింతల స్వామి కుటుంబ సభ్యులను అడగగా…వారు మా ఇంటికి ఏ ఒక్క అధికారి రాలేదని జవాబు ఇచ్చారు. నర్సయ్య అనే రైతు చనిపోయి సంవత్సరం కావస్తున్నా ఆయన భార్యకు పింఛన్ కూడా ఇవ్వడం లేదు. వృద్దురాలు అయిన ఆ తల్లి ఎలా బతకాలనుకున్నారు..? కేసీఆర్ స్వంత నియోజకవర్గంలో ఇలా అయితే వేరే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..? నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకునేందుకు కేసీఆర్ కు సిగ్గుండాలి. స్వంత నియోజకవర్గంలో ఒక్కరిని కూడా ఆదుకోని ముఖ్యమంత్రి ఏం పాలన చేస్తున్నట్టు..? అవసరమా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు..?
నర్సయ్య, స్వామి రైతులవి ఆత్మహత్యలు కావు. వీరిద్దరి చావులకు కారణం కేసీఆర్. ధరణి పోర్టల్ తీసుకువచ్చింది కేసీఆర్. రెండు ఎకరాలున్న రైతుకు ఎకరం, ఎకరం ఉన్న రైతుకు అర ఎకరం ధరణి పోర్టల్ లో చూపిస్తోంది. అర ఎకరం ఉన్న రైతుకు అసలు భూమి కూడా ధరణి పోర్టల్ లో చూపించడం లేదు. ఎందుకు ఈ సమస్య వస్తోందని కేసీఆర్ ను అడుగుతున్నాం..? ఎందుకు ఇంత మందిని కేసీఆర్ పొట్టన పెట్టుకుంటున్నారు..? కోట్లకు కోట్లు కమీషన్లు మింగుతున్నారు కదా..? ఇప్పుడు భూమి కూడా మింగుతారా..? ఎంత తింటే మీ కడుపు నిండుతుంది కేసీఆర్..? ఎంత మందిని పొట్టన పెట్టుకుంటే మీ దాహం తీరుతుంది..? ముమ్మాటికీ రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ హత్యలే. ఏ మాత్రం ఇంగితమున్నా కేసీఆర్ 50 లక్షల రూపాయలు స్వామి అన్న కుటుంబానికి నష్టపరిహారంగా అందజేయాలి. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ పాపం పోదు. వీళ్ల ప్రాణాలు తిరిగి రావు. కనీసం బతికున్న వాళ్లనైనా ఆదుకోవాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఇంత వరకు స్వామి అన్న తల్లికి పింఛన్ లేదు. ఆయన భార్యకు పింఛన్ వస్తుందన్న నమ్మకం లేదు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. కేసీఆర్ సీఎంగా ఉండి ఎందుకు..? ఏ మాత్రం సోయి ఉన్నా రైతుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోవాలి.

LEAVE A RESPONSE