దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ

– నరేంద్రమోదీ అధికారులకు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్త చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) మంగళవారం ట్వీట్ చేసింది.

అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవనరుల స్థితిగతులను సమీక్షించిన మీదట మోదీ నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది. ‘ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవవనరుల స్థితిగతులను ప్రధాని మోదీ సమీక్షించారు. అనంతరం 10 లక్షల నియామకాలపై ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేశారు’ అని పీఎంఓ పోస్టు పెట్టింది. దేశంలోని నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల గురించి కేంద్రం దృష్టికి తీసుకువస్తుంటాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ నియామకాలపై తాజా ఆదేశాలు వచ్చాయి.