జగన్‌కు తొలి ఝలక్!

– ఆయన నిన్న అసాధారణ నేత.. నేడు సాధారణ నేత
– పార్టీలో ఇక ‘జగనన్న జంకు’ పోయినట్లే
– విస్త‘రణం’తో విస్తుపోయిన అధినేత
– ఎన్టీఆర్‌కే తప్పని తిరుగుబాటు
– జగనన్నపై చెరిగిన ‘మొండి’ముద్ర
– ఇక ‘అన్న’ కూడా అందరిలాంటోడే
-రాజీనామాలతో ‘రింగ్’ రివర్స్
                        ( మార్తి సుబ్రహ్మణ్యం)

జగనన్న ఎవరి బెదిరింపులకూ లొంగే ఘటం కాదు.. ఆయనను బెదిరించేవాళ్లెవరూ ఇంకా భూమ్మీద పుట్టలేదు.. బ్లాక్‌మెయిల్ చేస్తే తొక్కి నారతీస్తాడంతే.. ఎంత సీనియరయినా అన్న చెప్పింది పాటించాల్సిందే.. పార్టీలో అన్న చెప్పిందే వేదం.. అన్నను ఎదిరించే ఆలోచన చేస్తే ఇంకేమైనా ఉందా?.. అన్న దయ మన ప్రాప్తం. ఇవీ పదేళ్ల నుంచి శనివారం వరకూ జగనన్న కెపాసిటీ గురించి వైసీపీలో సర్వత్రా వినిపించిన వ్యాఖ్యలు! కానీ ఆదివారం అవన్నీ అడ్డం తిరిగాయి. జగనన్నకు జిందాబాదులు కొట్టిన అవే నోళ్లు ఆదివారం మధ్యాహ్నం నుంచి ముర్దాబాదులు మొదలుపెట్టాయి. రోడ్డెక్కి నిరసన గళం వినిపించాయి. జాతీయ రహదారులను చుట్టుముట్టి, ధిక్కారస్వరం వినిపించాయి. ఆరకంగా ‘అసాధారణ నేత’ అనుకున్న జగనన్న కూడా, విస్త‘రణం’ పుణ్యాన ‘సాధారణ నేత’ జాబితాలో చేరిపోయారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ప్రజాస్వామ్యంలో ఎంత గొప్పదనుకుంటున్నారో.. ఇదీ ఆ ప్రజాస్వామ్యం గొప్పతనమే. దానిముందు ఎవరైనా ఒకటే.

రాజకీయాల్లో వ్యక్తిస్వామ్యం బలపడితే వచ్చే అనర్ధాలను ఆంధ్రావని ఆదివారం రెండోసారి కళ్లారా చూసింది. అప్పట్లో ఎన్టీఆర్ ఒక్క కలం పోటుతో క్యాబినెట్ రద్దు చేస్తే ఆ తర్వాత వచ్చిన సంక్షోభం.. చాలా ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు జగన్ రూపంలో మళ్లీ ప్రాణం పోసుకోనుంది. ‘నేనే సర్వస్వం’ అని విర్రవీగిన ‘అఖిల భారత అన్న’ గారు, అందుకు ఫలితం అనుభవించారు. ఆరోజుల్లో అన్న గారి ఎదుటపడేందుకే భయపడ్డ ఎమ్మెల్యేలే, తర్వాతి రోజుల్లో ఆయన పతనాన్ని శాసించారు. బాబు సీఎంగా తెరపైకి రావడానికి ఆ అరమ్మతే ఆజ్యం పోసింది. ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్ ప్రధానమే గానీ, దానిపైనే ఆధారపడి చేసే రాజకీయాలు, తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు దీర్ఘకాల రాజకీయాలకు పనికిరావు. ఇది ఎన్టీఆర్ విషయంలో అక్షరాలా నిజమయింది.

ఎవరి ప్రభయినా నడిచినంతకాలమే. ఆ కాలంలో ప్రభువులకు తమకు మించినవాళ్లు ముల్లోకాలలో ఎవరూ ఉండరన్న భ్రమల్లో జీవిస్తుంటారు. పక్కన చేరే వందిమాగధులు కూడా వారిని ఆ భ్రమల్లోనే ముంచుతారు. వారి భజనలతో ప్రభువులు సంబరపడతారు. ఆ ఆనందం చివరాఖరకు వారిని దేవతావస్త్రాల కథలో రాజుమాదిరి మారుస్తుంది. అప్పటివరకూ తమకు తిరుగులేదని, తమను ఎదిరించేవారు గానీ, తమ మాటకు ఎదురుచెప్పేవారు గానీ ఉండరని భ్రమిస్తుంటారు. పరాజితులైన తర్వాత గానీ వారికి తత్వం బోధపడదు. కానీ అప్పటికే ఆలస్యమవుతుంది. ఏపీలో జగనన్న సర్కారు క్యాబినెట్ కూర్పు అనంతరం.. రాష్ట్రం నలుమూలలా రేగిన అసంతృప్తి జ్వాలలు చూసిన తర్వాత సరిగ్గా మెడమీద తల ఉన్న ఎవరికయినా ఇలాంటి భావనే తలెత్తడం సహజం.
జగన్ నిర్ణయాన్ని కలలో కూడా వ్యతిరేకించేందుకు భయపడి, నవరంధ్రాలూ మూసుకుని జీ హుజూరన్న ఆయన సైనికులే ఇప్పుడు తిరుగుబాటుబావుటా ఎగరవేసి జగన్‌కు ముర్దాబాదులు కొడుతున్న దృశ్యం… బహుశా ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. మంత్రివర్గ విస‘్తరణం’లో తనకు తాను నిర్మించుకున్న మొండివాడు, ఎవరికీ తలొగ్గడు అన్న ముద్రలు కూడా తనకు తానే చెరిపేసుకున్న వైచిత్రి. నా పార్టీ నా ఇష్టం అని భావించే అంత లావు నేతకు ఇలాంటి తిరుగుబాటు, సర్దుబాటు శరాఘాతమే.

రెండున్నరేళ్ల తర్వాత అందరినీ తొలగించి కొత్తవారిని నియమిస్తానని నిండుసభలో హామీ ఇచ్చిన జగనన్న, తానిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు 6 నెలలు గడువు తీసుకోవలసి వచ్చింది. తొలి మంత్రివర్గ ఏర్పాటులో అంతా తన మాటే చెల్లింది కాబట్టి, మలి విస్తరణలో కూడా అదే జరుగుతుందని భావించిన జగన్‌కు, సొంత పార్టీ సైనికులు నిరసన స్వరాలు వినిపించి ఝలక్ ఇవ్వడం.. దానితో స్వయంగా పట్టుమీదున్న జగన్ మెట్టుదిగి.. సజ్జలలు, శ్రీకాంత్‌రెడ్లు, మోపిదేవిలను ‘బుజ్జగింపు రాయబారులు’గా నియమించాల్సి రావడం విచిత్రమే. ఆయన భాషలో చెప్పాలంటే… ఇది జగన్ మనస్తత్వాలనికి సంబంధించినంత వరకూ ‘రివర్స్ వ్యవహారమే’.

అసలు ఎప్పుడూ నోరు విప్పని మాజీ హోం సుచరిత కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారంటే, జగనన్న నిర్ణయంపై ఏ స్థాయిలో అసమ్మతి రాజుకుంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. జగన్‌కు వీర సైనికుడిగా నిలిచిన మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి కూడా జగనన్న నిర్ణయంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే, ఆయన అనుచరులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. సీఎం సమీప బంధువయిన మాజీ మంత్రి బాలినేని వాసన్న అనుచరగణం, ఏకంగా జగన్ జగన్ డౌన్‌డౌన్ అని నినాదాలు అందుకోవడం.. వైసీపీలో మారుతున్న ధిక్కార రాజకీయాలకు తొలి మలుపు అన్నది నిష్ఠుర నిజం.

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గుడివాడ ఎమ్మెల్యే కొడాని నాని, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి వంటి సీనియర్లంతా జగన్‌కు ఆత్మాహుతిదళం వంటివారే. ఆ కోణంలో చూస్తే వీరంతా మంత్రిపదవులకు అర్హులే. అలాంటి వారి అనుచరులే జగనన్న నశించాలంటూ రోడ్డెక్కి ఆయన దిష్టిబొమ్మకు మంట పెట్టడం చూస్తే, వైసీపీలో ఇక జగనన్న భయం పోయినట్లేనని అర్ధమవుతుంది.

అసలు ఈ సంక్షోభానికి కారణమేమిటో చూద్దాం. మంత్రులందరి దగ్గర రాజీనామాలు తీసుకున్న జగన్, అందరినీ తొలగిస్తే ఏ పంచాయతీ ఉండేది కాదు. 11 మందిని కొనసాగించి, మిగిలిన వారిని తొలగించడమే అనర్ధాలకు కారణమయింది. అంటే ‘ఆ 11 మంది అర్హులు-పనిమంతులు, తాము మాత్రం అనర్హులు-పనికిరానివాళ్లమనా’ అంటూ అసమ్మతికి దిగారు.

ఇక్కడ చెప్పుకోవలసిన మరో అద్భుతఘట్టం జగనన్న పట్టుదల.
ఇప్పటివరకూ అందరి దృష్టిలో జగన్ ఎవరి మాట వినడు, ఎవరికీ బెదరడని కదా ప్రచారం? అలాంటి జగన్ తన క్యాబినెట్ ఫార్ములా అడ్డం తిరిగేసరికి, అలకరాయుళ్ల వద్దకు రాయబారులను పంపించడమే జగన్ రాజకీయ జీవితంలో ‘సర్దుబాటు లాంటి లొంగుబాటు’. బాలినేని ఇంటికి సజ్జల-శ్రీకాంత్‌రెడ్డిని, సుచరిత ఇంటికి మోపిదేవిని పంపించాల్సి రావల్సివస్తుందని, పిన్నెల్లికి ధనుంజయరెడ్డితో ఫోన్ చేయించి బుజ్జగించాల్సి వస్తుందని జగన్ కలలో కూడా ఊహించి ఉండరు. ఇక పదవుల రాని బాలినేని-ఉదయభాను భేటీ మరో మలుపు.

సూటిగా చెప్పాలంటే ఇదంతా జగన్ స్వయంకృతం. ‘అంతా నా ఇష్టం’ అని ఒంటెత్తుపోకడలతో వ్యవహరించేవారికి, ఫలితాలు ఇంతకు భిన్నంగా ఏమీ ఉండవు. సహజంగా తొలగించాల్సిన మంత్రులను పిలిపించి, వారికి తగిన హామీలిచ్చి బుజ్జగిస్తారు. ఏ పరిస్థితిలో తొలగించాల్సి వచ్చిందో వివరిస్తారు. చివరాఖరకు ‘నీకు నేనున్నాను’ అని భరోసా ఇస్తారు. విస్తరణ ముందు ఏ ముఖ్యమంత్రయినా చేసే పనే ఇది. కానీ జగన్ అందుకు భిన్నం.

ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. తనకు తాను దైవాంససంభూతుడిగా భావించుకుంటారు. ఎంతలావు సీనియర్లయినా సీఎంఓ ముందు, అధికారుల పిలుపు కోసం కూడా పడిగాపులుకాయాల్సిన దుస్థితికి నెట్టేశారు. అసలు సీనియర్లు రాజకీయాల్లో ఉండేదే గౌరవం కోసం. అది కరవయితే, సమయం చూసి కరుస్తారు. అప్పటి వరకూ మౌనంగానే ఉంటారు. వారి మౌనాన్ని అసమర్థతగా భావిస్తే, పరిణామాలు ఇదిగో ఇలాగే రివర్సవుతాయి.

ప్రజాస్వామ్యంలో వ్యక్తిస్వామ్యం ఎల్లకాలం చెల్లదు. ఏదైనా ప్రత్యామ్నాయం లేనంతవరకే. అది కనిపిస్తే కాడికింద పడేసేందుకు అంతా సిద్ధంగా ఉంటారు. ప్రభువుల వద్ద గౌరవం లేదని తెలిసిన బోయీలు, అదను చూసి పల్లకీ దింపడంపైనే ఆలోచిస్తారు. అది మానవ సహజం. రాజకీయాల్లో అయితే మరీ సహజం.

 

Leave a Reply