• అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం
• శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రణాళిక
• దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచి అందిద్దాం
• ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి
• అటవీ శాఖను ఆదాయార్జన శాఖగా తయారు చేయాలి
• గ్రేట్ గ్రీన్ వాల్ రాష్ట్రానికి వరం కావాలి
• అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం
• రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్
కొండపావులూరు: ‘అడవులు జాతీయ ఆస్తి. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయలకు తావుండదు. రాజీకి తావుండదు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవుల రక్షణ విషయంలో మార్గదర్శకం చేస్తున్నారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాల’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే, అప్పటి వ్యవస్థలో అధికారులు ఎందుకు మిన్నకుండిపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని, పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యతను అటవీ అధికారులు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “అటవీ శాఖలో విభిన్నమైన బాధ్యతలు పంచుకోవడానికి సరిపడినంత సిబ్బంది లేరని ప్రతి సమీక్షలోనూ అధికారులు నా దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ సమస్య అధిగమించడానికి ఉన్న మార్గాలను కేబినెట్ ముందు ఉంచాం. సిబ్బంది నియామకం వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలి. ఎలాంటి సిఫార్సులకు తావివ్వవద్దు. అడవుల్ని సంరక్షించాలంటే అటవీ శాఖ అధికారుల భద్రత ప్రధానమైనది. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉంది.
విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతంగా నన్ను కలిసి సమస్యను చెప్పండి. శ్రీశైలం ఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నాను. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశాం. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావివ్వవద్దు.
రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు ఉన్నాయి. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చు అని అంచనా. అయితే ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపై సమగ్ర సర్వే చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలి.
ఆక్రమణలు ఎక్కడ ఉన్నా, చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దు. 2047 నాటికి రాష్ట్ర భూ భాగంలో 50 శాతం పచ్చదనంతో నిండేలా పని చేయాలి. దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరం. భావితరాలకు పచ్చదనాన్ని పెంపొందించేలా చైతన్యవంతులను చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం.
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్… గొప్ప ప్రయత్నం
974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత రక్షణకు మడ అడవుల పెంపకం ప్రధానం. తీరం వెంబడి ఖాళీ ప్రదేశాల్లో తాటి చెట్లు, పాల్మిరా, పాడనస్ వంటి తీర ప్రాంత జాతుల మొక్కలు పునరుద్దరణపై దృష్టి సారించి ఆకు పచ్చని గోడ నిర్మాణానికి కాల వ్యవధి పెట్టుకుని పని చేద్దాం. దీని వల్ల తీర ప్రాంతాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి బతుకు భరోసా లభిస్తుంది.
తుపాన్లు, సునామీల వంటి విపత్తుల నుంచి సహజ సిద్ధమైన రక్షణ పొందవచ్చు. సముద్ర జీవ జాతులను కాపాడవచ్చు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. సంవత్సరానికి 10 అడుగులకు పైగా సముద్ర గర్భంలో కలసిపోతుంది. ఇలాంటి కోతలను కూడా మడ అడవుల పెంపకం ద్వారా నివారించవచ్చు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గొప్ప ప్రయత్నంగా ప్రారంభిస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. లక్ష్యాన్ని అధిగమించేలా పనిచేయాలి.
ఎర్రచందనం విత్తనాలు చల్లేందుకు ప్రణాళిక
శేషాచలం అడవుల్లో 1987 ప్రాంతంలో హెలీకాప్టర్ల ద్వారా విస్తారంగా ఎర్రచందనం విత్తనాలు చల్లారు. అది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి బీజాలు వేసింది. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు మరోసారి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు విస్తారంగా చల్లే కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీంతోపాటు ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధంతోపాటు ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతున్న ఎర్రచందనాన్ని తిరిగి రాష్ట్రానికి రప్పించే చర్యలు తీసకుంటున్నాం. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లిన సందర్భంగా ఆ రాష్ట్ర అటవీ అధికారులు మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న రూ.110 కోట్ల ఎర్ర చందనాన్ని పట్టుకుని వేలం వేసుకున్నట్టు తెలిపారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అందుకోసం అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని ప్రభావవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటీష్ హయాంలో అడవులు ఆదాయ మార్గాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మన దేశ అవసరాల కోసం ఏటా రూ.22 వేల కోట్ల విలువైన 900 లక్షల క్యూబిక్ మీటర్ల కలపను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అడవులను కాపాడుకుంటూనే, డీనోటిఫై చేసిన ప్రాంతాలను కలప పెంపకానికి ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలి.
ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి చోటా కలప పెంచాలి. అవసరం అయితే పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాలి. అడవి ఆదాయ వనరుగా ఉంటేనే సిబ్బంది కొరత సమస్యను అధిగమించగలం. దేశానికి అవసరం అయ్యే కలపను రాష్ట్రం నుంచి అందించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలి.
హస్త కళలకు అవసరమయ్యే వృక్షాలు పెంచాలి
ఉడ్ బ్యాంక్స్ ఏర్పాటు, ఎకో టూరిజం మీద దృష్టి సారించాలి. పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలి. తద్వారా గిరిజన యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలి. అడవులను కాపాడుకుంటూ, గిరిజనుల జీవనాధారానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. అడవుల అందాలను ప్రజలు ఆస్వాదించే ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజంపై దృష్టి సారించాలి. అది భవిష్యత్ పర్యాటక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి ముడి కలప కొరత ఉంది.
అంకుడు, తెల్ల పొనికి చెట్లను విస్తృతంగా పెంచి ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి ఇబ్బందులు లేకుండా చూడాలి. కళాకారుల అవసరానికి తగినంతగా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొండపల్లి బొమ్మల తయారీకి వినియోగించే తెల్లపొనికి చెట్ల పెంపకం సవాలుతో కూడుకున్న వ్యవహారం. అవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. వీటి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి. ఒక పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలి.
మానవులు – జంతువుల సంఘర్షణను అరికట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలి. రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అయిన చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మదపుటేనుగుల సంచారం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో సమస్య పరిష్కారానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చాం. శ్రీకాకుళంలో తొమ్మిది ఆడ ఏనుగులు సంచరిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇవి ఒడిశా నుంచి వచ్చాయి. ఒడిశాలో మైనింగ్ పెరిగిపోవడంతో అవి ఇటు వైపు వలస వచ్చినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో అవి తిరుగుతున్న ప్రాంతం మొత్తం పంట పొలాలున్న ప్రాంతం. ఈ సమస్య పరిష్కారానికి అవసరం అయితే ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి వాటిని తిరిగి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటాం.
అడవుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, గిరిజనుల కోసం ఏదైనా చేయాలన్న తపన, నిబద్దతతో పని చేయాలని ముందుకు వచ్చే అధికారులకు కూటమి ప్రభుత్వం తరఫున మావంతు సహకారం అందిస్తాం. అడవులను కాపాడుకుంటూ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుంటూ పచ్చని హరితాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం” అన్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్ పోస్టర్ల విడుదల
ఈ సందర్భంగా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రచార పోస్టర్లు అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. అంతకు ముందు ఎన్ఐఆర్డీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి ప్రతి మొక్క వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. జమ్మి చెట్టును నాటారు. ఈ వర్క్ షాప్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జున రావు, శాఖ ఉన్నతాధికారులు రాహుల్ పాండే, శాంతిప్రియా పాండే, ఎన్ఐఆర్డీ డైరెక్టర్ పి.ఎస్. రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.