Suryaa.co.in

Andhra Pradesh

మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్‌ రాజీనామా

-చిలకలూరిపేట వైసీపీకి బిగ్‌ షాక్‌
-నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిక
-పెద్దఎత్తున టీడీపీలోకి వలసలు

చిలకలూరిపేట వైసీపీ మాజీ సమన్వయకర్త ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. రాజేష్‌ నాయుడుతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున చేరిన వారిలో ఉన్నారు. హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో శుక్రవారం చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వారంతా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న విడుదల రజినిని పక్కనపెట్టి గుంటూరు 2 సీటును ఇచ్చారు. దాంతో చిలకలూరిపేటకు మల్లెల రాజేష్‌నాయుడు సమన్వయకర్తగా ప్రకటించారు.

కొంతకాలం ఆయన ఆర్థికంగా ఖర్చు పెట్టుకుని చురుకుగా పనిచేశారు. అనూహ్యంగా ఆయనను పక్కనపెట్టి మూడో కృష్ణుడిగా గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మల్లెల రాజేష్‌నాయుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యా రు. మనోహర్‌నాయుడు చిలకలూరిపేటలో పార్టీ కార్యక్రమాలను ప్రారంభించటంతో అక్కడ రెండు గ్రూపులుగా చీలాయి. అనూహ్యంగా నేడు రాజేష్‌నాయుడు టీడీపీ తీర్థం పుచ్చు కోవడం వైసీపీకి బిగ్‌ షాక్‌ అనే చెప్పవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత మల్లెల రాజేష్‌ స్థానికుడు కావడం కూడా ఆ పార్టీకి చెంపపెట్టుగా మారింది. స్థానికేతరుడైన కావటి మనోహర్‌నాయుడు చిలకలూరిపేటలో రాణించడం కష్టమేనని ఆ పార్టీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాజేష్‌నాయుడు టీడీపీలో చేరడం ఆ పార్టీలో పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. అసలు చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా రాజేష్‌నాయుడును ప్రకటించేందుకు విడుదల రజిని రూ.6 కోట్లు ముడుపులు తీసుకున్న ట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు బహిరంగంగానే రాజేష్‌నాయుడు ఫిర్యాదు చేయడం ఆ పార్టీలో పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడటం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో చిలకలూరిపేట వైసీపీలో కుమ్ములాటపై మహానా డు అనేక కథనాలను ప్రచురితం చేసింది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుకు బాగా కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు.

LEAVE A RESPONSE