Suryaa.co.in

Telangana

చిక్కుల్లో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు

– ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు పైనా ఫిర్యాదులు
– ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే దుబాయ్ వాసి ఫిర్యాదు
– నా ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం రాయించారు
– ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరుతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు
-50 లక్షలు వసూలు చేశారు
– రేవంత్‌కు ఫిర్యాదు చేసిన శరన్ చౌదరి
– విచారణకు ఆదేశం?

హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో వెలమ సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులు ఎంత చెలరేగిపోయారో డీఎస్పీ ప్రణీత్‌రావు ఉదంతం చూశాం. రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లను ఐన్యూస్ ఎండి శ్రవణ్‌తోకలిసి చేసిన ట్యాపింగ్ వ్యవహారం బట్టబయలయిన విషయం తెలిసిందే.

తాజాగా టాస్క్‌ఫోర్స్‌ను కంటిచూపుతో శాసించిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరాచకాలు ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి. కిషన్‌రావుతో కలసి నాటి ఏసీపీ ఉమామహేశ్వరరావు.. తన నుంచి 50 లక్షలు వసూలు చేశారన్న ఫిర్యాదు, ఇప్పుడు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.

అధికారం అడ్డుపెట్టుకుని, తనను మానసికంగా-శారీరకంగా హింసించిన కిషన్‌రావు-ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శరన్ చౌదరి వేడుకున్నారట. కాగా తనకు వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఎం, దానిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పోలీసు, రెవిన్యూ శాఖను అడ్డాగా చేసుకున్న వెల సామాజికవర్గ అధికారుల అరాచకాల్లో ఆసక్తికరమైన కేసు ఇది.

వివరాల్లోకి వెళితే.. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై సీఎం రేవంత్ రెడ్డికి దుబాయ్ నుంచి బాధితుడు శరన్ చౌదరి ఫిర్యాదు చేశారు. రాధా కిషన్ రావు, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను వేధింపులకు గురి చేశారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

2023 ఆగస్టు 21వ తేదీన ఆఫీస్‌కి వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో సివిల్ డ్రెస్సులు కొంతమంది పోలీసులు తనని కిడ్నాప్ చేశారని శరన్ చౌదరి తెలిపారు. సివిల్ డ్రెస్ లో వచ్చి ప్రైవేట్ కార్లు తనని సీసీఎస్‌కు తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని బాధితుడు చెప్పాడు.
చాలామంది నుంచి డిపాజిట్లు తీసుకున్నానని తనపై కేసు నమోదు చేశారని అన్నారు.

తన ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం సృష్టించి విజయ్ అనే వ్యక్తికి తన ఫ్లాట్‌ను రాయించారని ఫిర్యాదు లో తెలిపారు. విజయ్ అనే వ్యక్తి మాజీ మంత్రి దయాకర్ రావుకు దగ్గర బంధువు అని చెప్పారు. రాధా కిషన్ రావు ఆదేశాలతో సీసీఎస్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

బూట్ కాలుతో తన్నుతూ, చెప్పుతో కొట్టారని వాపోయారు. బలవంతంగా రెండు రోజులపాటు కస్టడీలో పెట్టుకొని అక్రమంగా బంధించారని చెప్పారు. టాస్క్ ఫోర్సు, సీసీఎస్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక విజయ్‌కి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించడానికి అంగీకరించానని వివరించారు. తాను పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో డబ్బులు ఇవ్వాలని తన కుటుంబంపై తీవ్ర ఒత్తిడితో గురి చేశారని చెప్పారు. తన స్నేహితుడి నుంచి రూ. 50 లక్షలు బదిలీ చేయించుకున్నారన్నారు.

న్యాయం కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే తమ ఇంటి పైకి పోలీసులు పంపి బెదిరింపులకు దిగారని ఆందోళన వ్యక్తం చేశారు. తన రిట్ పిటిషన్ ఉపసంహరించు కొనేంత వరకు ఉమామహేశ్వరరావు , రాధా కిషన్ రావు ఒత్తిడి చేశారని అన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు శరన్ చౌదరి వేడుకున్నారు. దీనిపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

LEAVE A RESPONSE