తుగ్లక్ నిర్ణయానికి నాలుగేళ్లు

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ఏపీ రాజధాని అమరావతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి నేటికి 4 యేళ్లు నిండిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.

సరిగ్గా నాలుగేళ్ల క్రితం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే దుష్టతలంపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుష్ట నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మూడు రాజధానులు అంటూ మోసపూరిత ప్రకటనతో మూడుముక్కలాటకు సిద్ధమయ్యారు. దాదాపు రూ.10 వేల కోట్లతో అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. జగన్ తుగ్లక్ నిర్ణయంతో ఆందోళన చెందిన రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు.

అమరావతి రాజధాని ఉద్యమంపై జగన్ సర్కార్ కక్ష కట్టి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, బెదిరింపులు, జైళ్లకు పంపటం వంటి కుయుక్తులు పన్నినప్పటికీ అమరావతి రైతులు, మహిళలు ఆదరలేదు, బెదరలేదు. అమరావతి రాజధాని ఉద్యమం నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా సాగి చారిత్రక ఉద్యమంగా పేరుగాంచింది. అమరావతి ఉద్యమకారులకు సిపిఐ తరఫున జేజేలు.

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టీ సుప్రీంకోర్టుకెక్కారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే జగన్ తన ఇష్టానుసారం రాజధాని విశాఖకు తరలిస్తామని పదేపదే ప్రకటనలు చేస్తూ కోర్టులను ధిక్కరిస్తున్నారు.

ఇటీవల పార్లమెంట్ సాక్షిగా అమరావతే ఏపీ రాజధానిగా కేంద్రం స్పష్టం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం దుర్మార్గం. కోర్టులు, కేంద్రం అమరావతినే రాజధానిగా గుర్తించినా జగన్ తన నిరంకుశత్వాన్ని విడనాడలేదు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

హైకోర్టు తీర్పును, కేంద్ర నిర్ణయాన్ని, నాలుగేళ్ల చారిత్రక అమరావతి రాజధాని ఉద్యమాలను ఇప్పటికైనా గౌరవించైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply