Home » ఓటీఎస్ వసూళ్లతో పేదలకు ఉరితాళ్లు బిగించొద్దు

ఓటీఎస్ వసూళ్లతో పేదలకు ఉరితాళ్లు బిగించొద్దు

ఓటీఎస్ వసూళ్లతో పేదలకు ఉరితాళ్లు బిగించొద్దు

– అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించిన టీడీపీ శ్రేణులు
ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్ల దందాలకు పాల్పడటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నియోజకవర్గ కేంద్రాలలో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. అంబేద్కర్ 65వ వర్థంతిని పురస్కరించుకుని ఘనంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన పాదాల వద్ద వినతిపత్రాలు ఉంచి అంబేద్కర్ స్ఫూర్తిని జగన్ రెడ్డి కాలరాస్తున్నారని, ఓటీఎస్ వసూళ్లతో పేదలకు ఉరితాళ్లు బిగించకుండా ప్రజల హక్కులను కాపాడాల్సిందిగా విన్నవించుకున్నారు.
“మీరు ఏ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని ఈ దేశప్రజలకు అందించారో, ఆ స్ఫూర్తికి విరుద్దంగా నేడు ఆంధ్రప్రదేశ్ లో పాలన జరుగుతోంది. బడుగు, బలహీనవర్గాల హక్కులను కాలరాస్తూ మీరు మాకు ఇచ్చిన స్వేచ్చను జగన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హరిస్తోంది” బడుగు, బలహీనవర్గాలు ఈ సమాజంలో జీవించే హక్కును కల్పిస్తూ అంబేద్కర్ ముందుచూపుతో రాజ్యాంగంలో ఆర్టికల్ -21ను పొందుపర్చారు. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం జిఓ నెం.82 విడుదల చేసి ఓటిఎస్ పేరుతో డబ్బు చెల్లించాలని వేధిస్తూ జీవించే హక్కును హరించే విధంగా వ్యవహరిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజలపై డబ్బుల కోసం నేటి ప్రభుత్వ పెద్దలు జులుం చెలాయిస్తున్నారు. హక్కుల కోసం ప్రశ్నించిన వారి గొంతునొక్కే విధంగా పోలీసులను ప్రయోగిస్తూ రాజ్యహింసకు పాల్పడుతున్నారు. ఈ అరాచక ప్రభుత్వం ఆగడాలను నుంచి కాపాడేందుకు మరోమారు మీరు ఈ భువిపై అవతరించి కాపాడాల్సిందిగా ప్రార్థించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పేదల ఇళ్లపై ఓటీఎస్ (వన్‌టైన్ సెటిల్‌మెంట్) కడితేనే పథకాలు అమలు చేస్తామని వైసీపీ నాయకులు, అధికారులు పేదలను ఒత్తిడి చేయడాన్ని ఖండించారు. ఓటీఎస్ పథకం కింద రాష్ట్రంలో పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి అందస్తామని పేదలకు భరోసా ఇచ్చారు. సంపద ఏ విధంగా సృష్టించాలో తెలియక పేదలపై భారం వేసి సంపద సృష్టించాలనుకుంటున్నారని ఆరోపించారు. కట్టలేమని వేడుకుంటున్న కనికరించకుండా అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. రాబోయే రోజుల్లో రూ.50-60 వేలు అవుతుందంటూ పేదలను భయపెడుతున్నారు.
పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983లో తొలిసారిగా పక్కాగృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఖజానా నింపుకోవడానికి వన్‌టైమ్ సెటిల్ మెంట్ పేరుతో పేదల నుంచి రుణ బకాయిలు వసూలు చేస్తున్నారు. తనకు సంబంధం లేని ఇళ్లకు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అని పేరు పెట్టుకున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా, ఎవరో కట్టిన ఇళ్లకు తన పేరు పెట్టుకోవాలనే విచిత్రమైన ఆలోచనకు కార్యరూపమిచ్చారని ఆరోపించారు. 1983 నుంచి 2011 వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణబకాయిలు ఇప్పుడు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని పేదల నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం రూ. 4,800 కోట్ల రూపాయలు రాబట్టేందుకు సిద్దమైందన్నారు. ఒకవైపు ఈ పథకాన్ని స్వచ్చందంగా అమలు చేస్తామంటూనే నాట్ విల్లింగ్ అనే అప్షన్‌ను తొలగించి లబ్ధిదారుల మెడపై కత్తిపెట్టి ఈ పథకం కింద డబ్బు వసూలు చేసేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు.
వాలంటీర్లు, వీఆర్వోలు, గ్రామ సచివాలయాల ఉద్యోగులకు టార్గెట్ లు ఇచ్చి మరీ పేదలకు ఓటీఎస్ పథకాన్ని బలవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఓటీఎస్ పథకాన్ని ఆంగీకరించకపోతే పెన్షన్లు తొలగిస్తామని, రేషన్ కార్డులు తీసేస్తామని, పథకాలు కట్‌ అవుతాయని వాలంటీర్లతో బెదిరించి మరీ పేదల నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వాలంటీర్లపై కూడా కఠన చర్యలు తీసుకుంటామని, సదరు వసూలు సొమ్ముకు వాలంటీర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు. దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న ఇల్లు తాకట్టులో ఉందని, దానిని మూడు నెలల్లో విడిపించుకోకపోతే ఇబ్బందులు పడతారన్న విధంగా ప్రభుత్వం బెదిరించడం సరికాదన్నారు. పేదల నుంచి రూ. 4,800 కోట్ల రూపాయల మేర రాబంట్టేందుకు వ్యూహరచన చేయడాన్ని మానుకోవాలన్నారు. తలకుమించిన అప్పులతో ఊబిలో కూరుకుపోయిన జగన్ రెడ్డి.. ఓటీఎస్ పేరుతో పేదలపై భారం మోపుతున్నారు. జగన్ ప్రభుత్వం వేసిన ఉచ్చులో పేదలెవరూ పడొద్దని, అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు రిజిస్టర్ చేసి అందజేస్తామని టీడీపీ నేతలు ఈ సందర్భంగా తెలిపారు.


ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వేగుళ్ళ జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీలు అంగర రామ్మోనరావు, బచ్చుల అర్జునుడు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, పల్లా శ్రీనివాస్, బుద్దా నాగజగధీష్, తోట సీతారామలక్ష్మి, గన్నీ వీరాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, కొనకళ్ల నారాయణ, అబ్దుల్ అజీజ్, గొల్లా నరసింహ యాదవ్, పులవర్తి నాని, గౌరు వెంకట రెడ్డి, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్, గొల్లపల్లి సూర్యరావు, ఆలపాటి రాజా, అమర్నాథ్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులు బీద రవిచంద్ర, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply