ప్రస్తుత కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన ఆకుల దుర్గను ఆ గ్రామంలో అందరి పిల్లల మాదిరిగానే సర్కారీ బడిలో అయిదువరకూ చదివిం చారు. ఆ తర్వాత చెముడులంక జిల్లా పరిషత్ హైస్కూలులో 1997-98 సంవత్సరం పదవ తరగతి పూర్తయింది. అక్కడితో చాలా మంది అమ్మాలు చదువు ఆపేసే రోజులవి.కాని ఇటుకబట్టీ నిర్వంచే దుర్గ తండ్రి ఆకుల రామకృష్ణ
ఇంటర్మీడియట్ చదివితే మంచి పెళ్ళి సంబంధం వస్తాదనే ఉద్దేశంతో రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేయించారు. అది కూడా సిఇసి గ్రూప్.డిగ్రీ కూడా చదివితే ఉద్యోగస్తుడైన భర్త దొరుకుతాడని బి.కాం కూడా అదే కాలేజీలో పూర్తిచేయించాడు ఆ తండ్రి.డిగ్రీ 2003లో అయింది.ముందే అనుకున్నట్లుగా ఆ తర్వాత సంవత్సరం అంటే 2004 లో పెళ్ళి చేసేసారు.
అందరి గృహిణులు మాదిరిగానే పెళ్ళి అవ్వగానే అత్తారింటి పేరుతో ఆధార కార్డు మార్పించేసారు.దుర్గకు బదులు ముద్దుగా పిలుచుకునే శ్రీరమ్య పేరుతో ఆధార కార్డు వచ్చేసింది. అంటే ఆకుల దుర్గ పేరు వెలిది శ్రీరమ్య అయ్యింది.2006లో వాళ్లకు అమ్మాయి వైష్ణవి(ఇంటర్మీడియట్) ,2007లో అబ్బాయి నిరంజన్ (9వ తరగతి) పుట్టారు.ఆ పిల్లలు ఇద్దరూ స్కూల్స్ కి వెళుతున్నారు.పిల్లలు స్కూల్స్‌కి వెళ్లాకా గృహిణులు టివీలో సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే అలా టివీ సీరియళ్ళతో కాలం గడపడానికి ఇష్టపడలేదు ఈవడ.అదీగాక భర్త బంధువుల్లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఈవిడ కూడా ఏదో ప్రభుత్వ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చూడమని భర్తను పదేపదే అడగడం మొదలు పెట్టింది.నెలకు ఓ పదివేల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది.
2012 లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్లో ఆ విషయం తెలుసుకుని భర్త సహకారంతో దరఖాస్తు చేసింది.లక్షల్లో రాసే ఈ పోటీ పరీక్షకు కోచింగ్ తీసుకుంటే బాగుంటుందని అందరూ చెప్పడంతో కోచింగ్ సెంటర్ కోసం ప్రయత్నించగా అప్పుడు వీళ్లుండే విశాఖ జిల్లా గాజువాకలో కోచింగ్ సెంటర్ లేదు. అయినప్పటికీ విశాఖపట్నం వెళ్ళి ఆర్నెల్లు కోచింగ్ తీసుకుని పరీక్ష రాసినా దగ్గర వరకూ కూడా చేరుకోలేకపోయింది. అయితే ఏదో చేయాలనుకుంటుంది కదా అని భర్త శ్రీనివాస్ ఇంటివద్దనే వాటర్ ప్లాంట్ పెట్టించాడు.దీంతో చదువు పక్కన పెట్టి ఆ ప్లాంట్ నిర్వహిస్తూ తీరిక లేకుండా ఉన్న సమయంలో….
మళ్ళీ 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది.అయితే ఈ సారి గాజువాకలో కోచింగ్ సెంటర్ వచ్చింది కాబట్టి మరోసారి ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకుని మళ్ళీ చదవడం మొదలు పెట్టింది.ఈసారి వస్తాదని కాకపోయినా తానేంటీ నిరూపించుకోవడానికి అన్నట్లుగా కసిగా చదివింది. ఆరు లక్షలు మంది పరీక్ష రాయగా ప్రిలిమ్స్ లో ఏభైవేల మంది ఉత్తీర్ణులయ్యారు. గాజువాకలో కోచింగ్ తీసుకున్న 200మందిలో ఈమెతో పాటు కొరకు సెలక్టయ్యారు. ఆ ఇద్దరకీ కోచింగ్ చెప్పలేనని చెప్పడంతో మళ్ళీ విశాఖ నగరానికి పయనం. కేవలం 950 ఉద్యోగాలకు సంబంధించిన ఈ పరీక్షలో జనరల్ కేటగిరీ నుంచి నెగ్గుకు రావడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు.అయితే అందులో కూడా సత్తా చాటి గ్రూప్ 2 కు అర్హత సాధించింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ మెదలైదంది.ఉద్యోగాలు 950 మాత్రమే. సెలక్టు అయిన వాళ్ళు రెండు వేలమంది. ఇప్పుడంతా రికార్డు పరిశీలన. చదువుకున్న సర్టిఫికేట్స్ లో ఉన్న పేరు ఆకుల దుర్గ.కానీ పెళ్ళి తరువాత ఆధార కార్డులో ఉన్న పేరు వెలిది శ్రీ రమ్య . ఇప్పుడు ఏం చేయాలి…? అప్పటికే పేరు మార్పుకు సంబంధించి గెజిట్ దరఖాస్తు చేసుకున్నారు. అది సకాలంలో అవుతుందా..? లేదా..? అనే బెంగ.ఇంత కష్టపడి సాధించినా పేరు మార్పు వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితి.పడిన శ్రమంతా వృదా అయిపోతుందనే భయం. అయితే ఆమె కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చింది. అందుకునే సర్టిఫికేట్ వెర్పికేషన్ కు ముందు రోజు పేరు మార్పుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఆమోదం వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మందికి ట్రజరీ అండ్ అకౌంట్స్ శాఖలో ఉద్యోగాలు రాగా అందులో ఈమె ఒకరు.ప్రస్తుతం తుని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీ రమ్య భవిష్యత్తులో మంరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది అనడంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా శ్రీ రమ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివించడానికి ఈరోజుల్లో కూడా వెనకాడుతున్నారని అది సరైనది కాదన్నారు.ప్రోత్సాహం ఇస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించగలరని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.తాను గ్రూప్ 2 రాయాలనుకున్నప్పడు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన భర్త, తల్లిదండ్రులకు, అత్తమామలకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు