Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల కొండపై అందరికీ ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షన్లు

• అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
• దావోస్ సర్యటనలో సీఎం, మంత్రి లోకేష్ అనేక సంస్ధలతో భేటీలు
• విద్యా శాఖ మంత్రిగా లోకేష్ ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు
– ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి

విజయవాడ: ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సెట్ టాప్ బాక్సులను ఏపీ ఫైబర్ నెట్ వినియెగదారులకు అందిస్తామని ఎపి ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల ఫైబర్ నెట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ దావోస్ లో అనేక దిగ్గజ కంపెనీలతో ఒప్పందాల వల్ల మా ఫైబర్ నెట్ సంస్థ ఛానెల్ పార్ట్ కూడా ఉందన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ లు దావోస్ పర్యటనలో అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ఆ పెట్టుబడులు, ఒప్పందాలు వల్ల రాష్ట్రంలోని యువతకు వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినా మా సంస్థ సర్వీస్ ను ఉపయోగించుకోవాల్సిందేనన్నారు.

ముఖ్యమంత్రి దావోస్ పర్యటనల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ తన సొంత కాళ్లపై నిలబడి ఎదిగారన్నారు. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. తమ శాఖలో సమర్థవంతంగా పాలన చేస్తూ అనతి కాలంలోనే మంచి పరిపాలనా దక్షుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారన్నారు.

తిరుమల కొండపై ఉన్న అన్ని కార్యాలయాలు, దుకాణాలు, ఇళ్లకు ఉచితంగా ఎపీ ఎస్ఎఫ్ఎల్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ లో ఉద్యోగులను నిబంధనలకు విరుద్దంగా అడ్డగోలుగా, అక్రమంగా నియమించారన్నారు. అలా నియమించిన వారిలో ఇప్పటికే 400 మందిని తొలగించామని, తరువాత మరో 200 మందిని, ఇప్పటి వరకు అలా తొలగించిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 600 కు చేరిందన్నారు.

జిల్లాల్లో పనిచేస్తున్న నెట్ వర్క్ మేనేజర్లు, నెట్ వర్క్ ఎగ్జిక్యూటివ్స్ పై అనేక ఆరోపణలు వచ్చాయని వారిలో 50 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. ఇక చేపట్టబోయే ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా విధానంలో చేస్తామన్నారు. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి సమర్థత, అర్హత ఉన్నవారికే ఉద్యోగాలిస్తామన్నారు.

గత ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టి వారిపై దాదాపు రూ. 100 కోట్ల పెనాల్టీలు వేశారన్నారు. అన్యాయంగా పెనాల్టీలు వేసిన వాటిని రద్దు చేస్తామన్నారు. గతం ప్రభుత్వంలో వినియోగదారులకు రెంటల్ పేరిట పెట్ టాప్ బాక్స్ లు ఇచ్చారన్నారు. ప్రతి నెలా ప్రతి కనెక్షన్ కు 59 రూపాయలు చొప్పున అక్రమంగా వసూలు చేశారన్నారు. మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా రెంటల్స్ వసూలు మొత్తాన్ని రద్దు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల మధ్య మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను కేక్ కట్ ఘనంగా నిర్వహించారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిగా పారదర్శకంగా విచారణ జరుపుతున్నామన్నారు. అన్ని వివరాలు పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. ఇప్పటికే దీనిపై విచారణ ముగిసిందన్నారు. మేము రాజకీయం కోసం అడ్డగోలు ఆరోపణలు చేయడం లేదన్నారు. ఆధారాలతోనే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం ఫైబర్ నెట్ కు రూ. 900 కోట్లతో నష్టాలు మిగిల్చి రూ. 1,260 కోట్లు అప్పుల పాలు చేసారన్నారు. అవి చెల్లించాల్సిన మాపై ఉందన్నారు. ఎపీఎస్ఎఫ్ఎల్ ను మరింత అభివృద్ధి చేసేందుకు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు కావాలన్నారు. వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి నిధుల సమీకరణ చేస్తున్నామన్నారు. ఎపీఎస్ఎఫ్ఎల్ కు సెట్ టాప్ బాక్సులు సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావచ్చన్నారు. బిడ్స్ ద్వారా సెట్ టాప్ బాక్సుల సప్లైకి ఎవరైనా ముందుకు రావచ్చన్నారు.

పీఎస్ఎఫ్ఎల్ ప్లాన్స్ ను రివైజ్ చేస్తామన్నారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ ను ప్రజలకు అందిస్తామన్నారు. పేదల కోసం బేసిక్ ప్యాకేజీని తక్కువ ధరకు అందిస్తామన్నారు. ప్రైవేటు వారితో పోల్చితే సగం ధరలకే నాణ్యమైన సేవలను అందించేందుకు మేం సిద్దంగా ఉన్నామన్నారు. ప్రైవేటు ఆపరేటర్ల కంటే తక్కువ ధరకే ఇంటర్నెట్ తో కూడిన కేబుల్ సేవలు అందిస్తామన్నారు. మాది లాభాపేక్ష సంస్థ కాదని, సర్వీస్ అందించే సంస్థ అని తెలిపారు.

LEAVE A RESPONSE