సుపరిపాలనకు తొలి అడుగు.. ఇంటింటికి సంక్షేమ సందేశం
– సమస్యలు తెలుసుకుంటూ.. కరపత్రాలు పంచుతూ..
– విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం..
– ప్రజల అభిప్రాయాలకే ప్రాధాన్యం
– మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం: ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం రామచంద్రపురం మండలంలోని ఓదూరు గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” రెండో రోజు కార్యక్రమం మంత్రి సుభాష్ ప్రారంభించారు.
అనంతరం నరసాపురపు పేట, అగ్రహారం, చోడవరం, యనమదల తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం గావించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులతో మాట్లాడి, కుశల ప్రశ్నలు అడిగి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు మంత్రి కు అడుగడుగున హారతులు ఇస్తూ పూల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రజలకు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు అందించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి రూ.15 వేల రూపాయలు, దీపం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఏట మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందన్నారు.
204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచి 65 లక్షల మంది లబ్ధిదారులకు అందిస్తున్నామని, 16,347 పోస్టులతో డీఎస్సీ నియామకాలు, పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టామని, పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమ విషయంలో కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తూ గూగుల్, టిసిఎస్, హెచ్సీఎల్, సుజలాన్, కనిజంట్, ఎన్టీపీసీ, టాటా, ఎల్జీ తదితర కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లకు దక్కిందన్నారు.
.