Suryaa.co.in

Andhra Pradesh

పరామర్శ….ఒక నైతిక మీమాంస!

(నవీన్)

కారు కిందపడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని పరామర్శించడం, వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం వార్తలలో నిలిచింది. పైకి చూస్తే, ఇది ఒక ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తుంది.

నాగరిక సమాజంలో పలకరింపు, పరామర్శ, ఓదార్పు అనేవి మానవత్వానికి ప్రతీకలు. అయితే, ఈ సంఘటనను కేవలం మానవతా కోణంలోనే కాకుండా, దాని వెనుక ఉన్న పోలీసు కేసు, నైతిక బాధ్యతల నేపథ్యంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

సింగయ్య మరణానికి కారణమైన ప్రమాదంపై నమోదైన కేసులో జగన్ రెండవ ముద్దాయి (A2). కారు కింద పడిన వ్యక్తిని పట్టించుకోకుండా, పక్కకు లాగి ముందుకు సాగిపోవడం “ఉద్దేశం లేని హత్య” (Culpable Homicide not amounting to Murder) కిందకు వస్తుందని, వాహన యజమానిగా ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం నేరమని పోలీసులు అభియోగం మోపారు.

ఈ అభియోగాన్ని కేసును పూర్తిగా కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) జగన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ, న్యాయమూర్తి “తొందరపాటు చర్యలు తీసుకోవద్దు” అని పోలీసులను ఆదేశించారు. దీని అంతరార్థం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జగన్‌ను అరెస్టు చేయరాదని!

అయితే, అతడిని విచారించవచ్చో లేదో అనే విషయంలో స్పష్టత లోపించింది. చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టే, ఏమి చేయకూడదో ముద్దాయికి కూడా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయం కదా! దీన్నే ఊళ్ళలో ఏమీ చదువుకోని వారు కూడా “తల్లీ బిడ్డల న్యాయం” అంటారు. సమధర్మాన్ని సూచించే తల్లీబిడ్డల న్యాయం కోర్టులో కూడా కనబడాలి కదా!

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా ఏదైనా కేసులో, ముద్దాయి సాక్షులను లేదా బాధితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే, ప్రాసిక్యూషన్ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది న్యాయ ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రం. జగన్ విషయంలో, ఆయన ఇంకా కేసు నుండి బయటపడలేదు. న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించలేదు. అలాంటి సున్నితమైన దశలో, కేసులో బాధితులైన సింగయ్య కుటుంబాన్ని ఏకంగా తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం?

ఈ ప్రాథమిక విషయాన్ని విస్మరించి, బాధితులతో సమావేశమవడం న్యాయ సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది బాధితులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో లేదా క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు, నిందితుడికి లభించిన తాత్కాలిక రక్షణను బాధితులను ప్రలోభపెట్టడానికో, ప్రభావితం చేయడానికో వాడుకోకూడదు.

న్యాయస్థానాలు చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ నిర్ణయాలు కేవలం సాంకేతికంగానే కాకుండా, న్యాయాన్ని అందించేవిగా, ధర్మాన్ని నిలబెట్టేవిగా ఉండాలి. చట్టం (Law): సమాజ క్రమానికి రూపొందించిన నియమాల సమాహారం. న్యాయం (Justice): ఆ చట్టం ద్వారా సాధించాల్సిన అంతిమ లక్ష్యం. ధర్మం (Dharma): చట్టం మరియు న్యాయానికి ఆత్మ వంటిది. ఇది నైతికత, నీతి, సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంటుంది.

సమాజాన్ని ప్రభావితం చేయగల రాజకీయ నాయకులు ఈ “ధర్మాన్ని” నిలబెట్టడంలో అత్యంత కీలకమైన బాధ్యత వహించాలి. వారి ప్రవర్తన సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి. కానీ, ప్రస్తుత సంఘటనలో ఆ బాధ్యత కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కోర్టు ఆదేశాలు, తీర్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులకు లభించే ఊరటలపై సామాన్యులలో సైతం చర్చ జరుగుతోంది. “పోలీసుల కాళ్లు కట్టేసి, దొంగతోపాటు పరుగెత్తమన్నట్లుంది తీర్పు,” లేదా “ఈ కోర్టులో ఇలాగే ఉంటుంది, పై కోర్టులో చూడాలి” వంటి వ్యాఖ్యలు ప్రజాబాహుళ్యంలో వినిపిస్తున్నాయంటే, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ “అప్‌డేటెడ్” ప్రజల అభిప్రాయాలను, వారిలోని నైతిక ఆక్రోశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

న్యాయవ్యవస్థ ప్రాథమికంగా చట్టానికి బాధ్యత వహిస్తుంది, కానీ ఆ చట్టాన్ని న్యాయాన్ని సాధించే సాధనంగా మాత్రమే ఉపయోగించాలి. ఈ మొత్తం ప్రక్రియ “ధర్మం” అనే ఉన్నతమైన నైతిక చట్రంలో జరిగినప్పుడే దానికి సార్థకత. రానురాను ఆ సమతూకం దెబ్బతినడమే నేటి అసలు విషాదం

(రచయిత సీనియర్ జర్నలిస్ట్ )

LEAVE A RESPONSE