Suryaa.co.in

Editorial

నా బెంచ్‌కు బెయిల్ పిటిషన్లు పంపకండి

– వాటిని ఇంకో బెంచ్ ముందు చూసుకోండి
– నాపై వస్తున్న ట్రోలింగ్స్ చూశా
– సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ వ్యాఖ్య
– హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
– వైసీపీ నేతలకు బెయిళ్లపై సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు
– ఎవరెవరికి జడ్జి బెయిల్ ఇచ్చారంటూ సోషల్‌మీడియాలో వివరాలు
– దానితో మనస్తాపం చెందిన జడ్జి శ్రీనివాసరెడ్డి
– గతంలో లోకేష్‌కు సీఐడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించిన ఇదే జడ్జి శ్రీనివాసరెడ్డి
-న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన జడ్జి వ్యాఖ్యలు
-వైసీపీ జమానాలో హైకోర్డు జడ్జిలపై వైసీపీ సోషల్‌మీడియా దారుణ వ్యాఖ్యలు
-విచారణ చేయలేమంటూ సీఐడి నిస్సహాయత.. సీబీఐకి బదిలీ
– ఇప్పటిదాకా నిందితులను శిక్షించలేని వైఫల్యం
– ఇంతవరకూ విదేశాల నుంచి రాని పంచ్ ప్రభాకర్
– ప్రభుత్వ న్యాయవాదుల వాదనలపై టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు
కల్తీ కేసును పార్టీ లాయర్లే వాదిస్తే ఎలా?
– గాలి జనార్దన్‌రెడ్డితరఫున వాదనలా?
– వైఫల్యాలపై సమీక్షించాల్సిన అవసరం ఉందని వాదన

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన హైకోర్డు జడ్జి కొనకంటి శ్రీనివాసరెడ్డి. జగన్ జమానాలో చంద్రబాబును జైల్లో వేసిన తర్వాత బాబు పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించిన జడ్జి ఆయన. నిజానికి ఆయన పేరు అప్పటిదాకా న్యాయవాద వర్గాలకు తప్ప, మిగిలిన వారికి పెద్దగా తెలియదు. మామూలుగా అయితే 2019 జూలైలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన శ్రీనివాసరెడ్డి, తన ప్రతిభతో రెండున్నరేళ్ల కాలంలోనే జడ్జి కాగలిగారు.

బాబు అరెస్ట్-రిమాండ్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కొట్టేయడంతో, ఆయన పేరు చర్చల్లోకి వచ్చింది. అయితే ఆ కేసులో తాను బెంచ్‌పై ఉండటం మీకు ఇష్టమేనా? అని జడ్జి అడిగితే, బాబు న్యాయవాదులు వ్యతిరేకించకుండా.. ఇష్టమేనని అంగీకరించారు కూడా అది వేరే విషయం. ఆ విషయంలో ఆయన న్యాయ, నైతిక ధర్మాన్నే ప్రదర్శించారు. ఆ తర్వాత సీఐడి కేసులో లోకేష్‌పై ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని ఇదే జడ్జి శ్రీనివాసరెడ్డి మంజూరు చేశారు. ఆ సందర్భంలో సీఐడీపై జడ్జి శ్రీనివాసరెడ్డి, సురేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలిప్పుడు జడ్జి శ్రీనివాసరెడ్డి ముచ్చట ఎందుకువచ్చిందంటే.. కల్తీనెయ్యి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ సందర్భంలో జడ్జి శ్రీనివాసరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను రెండురోజుల నుంచి సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్‌కు బాగా పనికివస్తాయి. నా ముందున్న అన్ని బెయిల్ కేసులు వచ్చేవారం వేరే బెంచ్‌కు పంపించండి’’ అంటూ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి బెయిల్ కేసులను మంగళవారానికి వాయిదా వేశారు.

జడ్జి శ్రీనివాసరెడ్డిని అంతగా బాధించిన ఆ ట్రోలింగులేమిటో ఓసారి చూద్దాం. సత్తెనపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య మృతికి సంబంధించి, పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలంటూ జగన్ వేసిన పిటిషన్‌ను, జడ్జి శ్రీనివాసరెడ్డి ఉన్న బెంచ్ స్వీకరించింది. దానితో ఆయనపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.

‘ అది వేశ్యల రాజధాని’ అని వ్యాఖ్యానించి జైలుపాలయిన జర్నలిస్టు కృష్ణంరాజుకు సైతం.. జడ్జి శ్రీనివాసరెడ్డి ఉన్న బెంచ్ బెయిల్ మంజూరు చేయడం కూడా, మరో ట్రోలింగ్‌కు కారణమయింది. అలా ఒకేరోజు మూడు తీర్పులిచ్చిన వైనంపై సోషల్‌మీడియాలో ట్రోల్ అయింది.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై 10 రోజుల పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవదన్న జడ్జి శ్రీనివాసరెడ్డి తీర్పు కూడా ఆయనపై ట్రోలింగ్‌కు మరో కారణమయినట్లు కనిపిస్తోంది.

కాకినాడ పోర్టువాటాల బదలాయింపు కేసులో ..ఎంపి వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి మీద ఉన్న లుకౌట్ సర్క్యులర్‌పై, స్టే విధించడం కూడా జడ్జి శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్‌కు మరో కారణంగా స్పష్టమవుతోంది.

‘ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ జగన్నాటక పరిస్థితులను అర్ధం చేసుకుంటూ గత మూడేళ్లుగా తన విచక్షణతో ఎన్నోసార్లు విశిష్ట తీర్పులిచ్చిన శ్రీరెడ్డిగారికి మరో మూడేళ్ల పదవీకాలం ఉంది. ఈ మూడేళ్లు ఎలాంటి బదిలీలు లేకుండా, ఏపీ హైకోర్టులోనే ఆయన తన సేవలు అందించాలని కోరుకుంటున్నాం. ఆయనను హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వీరమణ గారికి కూడా శతకోటి వందనాలు. అమరావతి మహిళలపై నీచ కామెంట్లు చేసిన జర్నలిస్టుకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసిన ఈ న్యాయమూర్తిగారు, పాత్రికేయ హక్కులను కూడా కాపాడారు. ఒకేరోజు మూడు విశిష్ట తీర్పులిచ్చినందుకు, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు’’ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెట్టారు.

బహుశా వాటిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి శ్రీనివాసరెడ్డి.. భవిష్యత్తులో వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను, తన బెంచ్‌పై కాకుండా మరో బెంచ్‌కు మార్చాలని ఆదేశించినట్లు కనిపిస్తోంది.

కాగా జగన్ సీఎంగా ఉన్న కాలంలో.. ఆయన ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. అప్పటి హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చారు. దానితో వైసీపీ సోషల్‌మీడియా హైకోర్టు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేసింది. ‘‘అది హైకోర్టు కాదు. టీడీపీ ఆఫీసు’’ అంటూ కొందరు న్యాయమూర్తులను కులం పేరుతో ప్రస్తావించడం జడ్జిలకు ఆగ్రహం కలిగించింది.

తమను ట్రోలింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, విచారణ చేయాలని సీఐడీని ఆదేశించింది. అయితే తాము విచారణ చేయలేమని సీఐడీ నిస్సహాయత వ్యక్తం చేయగా, ఆ కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఆ కేసు ఇప్పటివరకూ తెమల్చకపోవడమే మంచి ప్రభుత్వంలో కనిపించిన మరో అద్భుతం. అది వేరే వ్యవహారం.

కాగా ప్రస్తుతం టీడీపీ సొషల్‌మీడియా సైనికుల ఆగ్రహానికి గురైన జడ్జి శ్రీనివాసరెడ్డిని టీడీపీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న సుప్రీంకోర్డు మాజీ సీజీ జస్టిస్ ఎన్వీరమణ సిఫార్సు చేశారని, టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్తలే పేర్కొనడం విశేషం.

కాగా జస్టిస్ ఎన్వీ రమణకు సీజే ఇవ్వవద్దని స్వయంగా జగన్, నాటి సుప్రీంకోర్టు సీజేకి ఫిర్యాదు చేశారు. సాక్షిలోనూ వ్యతిరేక కథనాలు రాశారు. అమరావతి భూముల విషయంలో ఆయన బంధువులను ే సులతో వేధించారు. అయితే ఎన్వీ రమణ సీజే అయిన తర్వాత జగన్ ప్రభుత్వం అమరావతిలో ఆయనను స్వాగతిస్తూ ఆకాశమంత ఎత్తులో ఫ్లెక్సీలు కట్టడం మరో విశేషం. ఆ తర్వాత వారిద్దరి మధ్య నోవాటెల్ వేదికగా సయోధ్య కుదిరిందన్న వార్తలు, పసుపు దళాల ఆగ్రహానికి కారణమయింది.

విచిత్రంగా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అదే ఎన్వీ రమణను ప్రమాణ స్వీకారానికి పిలవడంతోపాటు.. ఆయన శిష్య న్యాయవాదవర్గానికే మళ్లీ ప్రభుత్వ పదవులు కట్టబెట్టడంపై ‘మా సానబట్టిన వజ్రాల కొన్ని బంధాలు అలాగే ఉంటాయంటూ’ సొంత పార్టీలోనే ట్రోలింగ్ నడిచింది.
వైఫల్యాలను కప్పిపుచ్చే వ్యూహమేనా?

కాగా దీనిపై టీడీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఒక కీలక వ్యక్తి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని, న్యాయవాది సమర్ధవంతంగా వాదిస్తే బెయిల్ ఎందుకు మంజూరవుతుందని ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు వేసిన పిటిషన్‌తోపాటు.. పార్టీ నేతలు వేసిన ఏ పిటిషన్‌కు సంబంధించి, ఆ ప్రముఖుడు కోర్టుల్లో వాదించిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.

అప్పట్లో చంద్రబాబుకు సంబంధించి ఏసీబీలో కేసు ఉన్నందున, ఆ కేసులో బెయిల్ రాదని స్పష్టంగా తెలిసినప్పటికీ అదే బెంచ్‌పై బెయిల్ పిటిషన్ వేశారని, టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మరి అదే జడ్జి శ్రీనివాసరెడ్డి టీడీపీ యువనేత లోకేష్‌కు సీఐడి నుంచి రక్షణ కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేతలకు వస్తున్న వరస బెయిల్స్‌కు కారణం ఏమిటి? న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఎందుకు వస్తున్నాయన్న అంశంపై, సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు.

‘‘మన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే బదులు, సమర్ధవంతులైన న్యాయవాదులను నియమించుకోవాలని ఈ తాజా తీర్పులు చాటి చెబుతున్నాయి. మన లోపాలు సరిదిద్దుకోకుండా ఇలా ఎంతకాలం ఇతరులను ఎందుకు దోషులుగా చిత్రీకరిస్తారు’’ అని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

కల్తీ లడ్డు కేసులో నిందితుల తరఫున పార్టీ న్యాయవాదులా? 

యావత్ హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం గుర్తుందా? దానిపై సిట్ వేసిన సర్కారు నిందితులను అరెస్టు చేసింది. అయితే అందులో ఒక నిందితుడి తరఫున ఎవరు వాదిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని, టీడీపీ కోసం గత ఎన్నికల్లో పనిచేసిన లాయర్లు చెబుతున్నారు.

‘ఆ కేసులో నిందితుల తరపున అడ్వకేట్ ఆన్‌రికార్డు సీఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారి బావమరిది అయితే, కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది టీడీపీ కేసులు వాదించే మరో కీలకనేత. వృత్తికి-కేసులకు-పార్టీలకు సంబంధం లేకపోవచ్చు. అలా అనుకుంటే జాతీయ స్థాయిలో కేసులు వాదించే లాయర్లు తమ ఎదుటి రాజకీయపార్టీ వారి కేసులు కూడా వాదిస్తుంటారు. దానికి ఫీజులే కొలమానం. కానీ ఇక్కడ కల్తీ లడ్డుపై సిట్ వేసి నిందితులను అరెస్టు చేసింది మా పార్టీ సర్కారే. అందులో నిందితుల తరఫున వాదించేదీ మాకు సంబంధించిన వారయితే, మనం జనాలకు ఏం సంకేతం ఇస్తున్నట్లు? ఇప్పుడు సీఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారి భార్య.. గత జగన్ సర్కారులో ఆ పార్టీ లీగల్‌సెల్ కన్వీనర్‌గా చేశారని, అలాంటి అధికారిని సీఎంఓలో ఎలా తీసుకుంటారని నానా గత్తర చేశారు. మరి ఇప్పుడు మా పార్టీకి చెందిన వారే నిందితుల తరఫున వాదిస్తుంటే దాన్ని ఏమనాలి? అంటే మనకు అనుకూలమైన అంశాలను ఎక్కువగా మాట్లాడి, నచ్చని విషయాలను వ్యూహాత్మకంగా పక్కనపెట్టడం ఏం పద్ధతి? మనకు నచ్చిన వారిని ఎత్తుకుని, నచ్చనివారిపై అభాండాలు వేయడం సబబేనా? రేపు ఒకవేళ కోర్టులో కల్తీ లడ్డు నిందితులకు బెయిల్ వస్తే అప్పుడు వైఫల్యం పార్టీదా? పార్టీ నాయకత్వం వహించే సర్కారుదా’’ అని.. గత ఎన్నికల్లో వైసీపీపై న్యాయసమరం చేసిన, ఓ హైకోర్టు సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించడం గమనార్హం.

న్యాయ పోరాటాలకు గుర్తింపు ఏదీ?

కాగా జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై న్యాయపోరాటం చేసిన, ఓ పది మంది సీనియర్ న్యాయవాదులకు సర్కారు ఇప్పటివరకూ కనీస గుర్తింపు ఇవ్వ పోవడంపై.. టీడీపీ న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివి లక్ష్మీనారాయణ, ఆదినారాయణరావు, ఉన్నవ మురళీధర్, నర్రా శ్రీనివాసరావు, ఇంద్రనీల్, పదిరి రవితేజ, ఉమేష్‌చంద్ర వంటి ఓ పదిమంది న్యాయవాదులు జగన్ పాలనపై లీగల్‌వార్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా వివి లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, నర్రా శ్రీనివాసరావు వంటి న్యాయవాదులు అమరావతి రాజధాని రైతుల పక్షాన లీగల్‌ఫైట్ చేశారు. కుప్పంలో బాబు పక్షాన నాటి మంత్రి పెద్దిరెడ్డి నియమించిన స్పెషల్ ఆఫీసర్‌కు వ్యతిరేకంగా వాదించారు. ఉపాథిహామీ పథకం ెపెండింగ్ బిల్లులు నాలుగువారాల్లో చెల్లించాలన్న తీర్పు వచ్చేలా పోరాడారు. జగన్ సర్కారులో అడ్డగోలుగా వ్యవహరించి జత్వానీని అరెస్టు చేసిన కేసులో.. ఆమె తరఫున పోరాడటమే కాకుండా, నిందితులను జైలుకు పంపించడంలో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదన ఫలించడంతోపాటు.. పీఎస్‌ఆర్, గున్ని, కాంతితాతా వంటి ఐపిఎస్‌ల సస్పెన్షన్‌కు దారితీసింది.

ఇక నాడు బాబు కాన్వాయ్‌పై రాళ్లేసిన ఘటనను సమర్ధించిన నాటి డీజీపీ గౌతంసవాంగ్‌ను, కోర్టులో నిలబెట్టిన సంచలనాత్మక కేసును వాదించింది మరో న్యాయవాది పదిరి రవితేజ. .నాటి డీజీ ఏబీ వెంకటేశ్వరరావును అమానవీయంగా.. నాలుగున్నరేళ్లు సస్పెండ్ చేసిన వైనాన్ని సవాల్ చేసి, ఆయనను రిటైర్మెంట్ రోజునయినా తిరిగి ఉద్యోగం ఇప్పించేలా పోరాడిన సీనియర్ న్యాయవాది ఆదినారాయణ. మరో యువ న్యాయవాది ఉమేష్‌చంద్ర కూడా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా వాదించారు.

ఈ నేపథ్యంలో కనీసం సీనియర్ న్యాయవాదులయిన వివి లక్ష్మీనారాయణ, ఆదినారాయణరావుకయినా ఉన్నత పదవులు వస్తాయని టీడీపీ న్యాయవాద వర్గాలు భావించాయి. కానీ వారికి బదులు సర్కారు వచ్చిన వెంటనే.. సీఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారి సోదరికి జీపీ పదవి ఇవ్వడం బట్టి.. జీపీ, ఏజీపీ, పీపీ, ఏపీపీల పోస్టింగులలో ఎవరు చక్రం తిప్పుతున్నారో.. వాటికి ఎలాంటి అర్హతలను కొలమానంగా పెట్టారో అర్ధమవుతోందని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

‘‘సీనియరు లాయర్లు, డొక్కశుద్ధి ఉన్న లాయర్లతోపాటు, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం ఉన్న వారు ఎంటరవడం మాదగ్గర కొందరికి ఇష్టం లేదు. వారికి అదో అభద్రత. నాయకత్వం కూడా అనేక మొహమాటాలు, ఒత్తిళ్లు, సిఫార్సులతో అలాంటి వారినే కొనసాగిస్తోంది. అసలు వీరంతా పార్టీ విపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ, ఎన్నిసార్లు కోర్టుకు హాజరయ్యారు? ఎన్ని కేసులు వాదించారు? ఎన్ని కేసుల్లో విజయం సాధించారన్న డేటా తీసుకోమనండి’’ అని మరో హైకోర్టు సీనియర్ న్యాయవాది సవాల్ చేశారు.

సుపీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కేసు ఎందుకు పలచబడుతోంది? కడప ఎంపి అవినాష్‌రెడ్డి ఎందుకు బేఫర్వాగా తిరుగుతున్నారు? టీడీపీని వ్యతిరేకించే గాలి జనార్దన్‌రెడ్డితరఫున తెలంగాణ హైకోర్టులో వాదించే లాయర్ ఎవరు?ఎవరి ఆఫీసులో జూనియర్‌గా పనిచేస్తున్నారు? ఇవన్నీ సీఎం బాబు-లోకేష్ కూర్చుని సమీక్షిసే.. తమ వెనక ఏం జరుగుతుందో వారికే అర్ధమవుతుందని టీడీపీ లాయర్లు స్పష్టం చేస్తున్నారు.

 

LEAVE A RESPONSE