Home » ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు!

ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు!

రాష్ట్రానికి పట్టిన శని జగన్ ను వదలించడమే మా మొదటి టార్గెట్
14, 15, 16వ తేదీల్లో నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు
ఈనెల 13న మేనిఫెస్టో కమిటీ సమావేశం
17 నుండి ఉమ్మడిగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం
రాష్ట్రంలో నెలకొన్న కరువుపై త్వరలో ప్రజాక్షేత్రంలోకి
ఇకనుండి సమన్వయ సమావేశాలు టీడీపీ-జనసేన కార్యాలయాల్లోనే
టిడిపి-జనసేన జెఎసి సమావేశ వివరాలను వెల్లడించిన అచ్చెన్నాయుడు

విజయవాడ :- రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని వదిలించడమే టీడీపీ-జనసేన మొదటి టార్గెట్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈనె 14, 15, 16వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు ఉంటాయని, ఏయే తేదీల్లో ఏ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టాలో త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. విజయవాడలోని నోవాటెల్ లో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది.

ఈ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు ఇరుపార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు ఇరు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం భేటీ వివరాలను నారా లోకేష్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు.

ఈనెల 13న టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం ఉంటుందన్నారు. జనసేన ఇచ్చిన ఐదారు అంశాలను చేర్చి 17 నుండి టీడీపీ-జనసేన కలసి ఉమ్మడిగా భవిష్యత్ గ్యారంటీ ప్రచారం నిర్వహిస్తాయని తెలిపారు. గత నెల 23న టీడీపీ – జనసేన సమన్వయ సమావేశం రాజమహేంద్రవరంలో నిర్వహించాం..ఇది రెండో సమావేశం. దాదాపు మూడు గంటలపాటు అన్ని విషయాలపై చర్చించాం.

హోటల్ లో జరిగే చివరి సమావేశం ఇదే. ఇక నుండి ప్రతి 15 రోజులకొక సమావేశం జరుగుతుంది. వచ్చే సమావేశాన్ని జనసేన కార్యాలయంలో, తర్వాత టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తాం. ఈ రోజు జరిగిన సమావేశంలో అనేక నిరణయాలు తీసుకున్నాం. మొదటి నిర్ణయం రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు టీడీపీ – జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాం. చంద్రబాబునాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బహిరంగసభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రసంగిస్తారు.

రెండు పార్టీల్లోని అన్ని అనుబంధ విభాగాలు కలిసి ఎక్కడున్నా కలిసి పనిచేస్తాయి. ఉమ్మడి జిల్లాను యూనిట్ గా తీసుకుని ఇటీవల సమావేశాలు నిర్వహించాం. ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మేనిఫెస్టోలో చేర్చాలని కొన్ని అంశాలను ఇచ్చారు..వీటిని కూడా భవిష్యత్ గ్యాంరటీలో చేర్చుతాం. రెండు పార్టీల నుండి ముగ్గరు చొప్పున తీసుకుని మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తాం..టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. రెండు పార్టీల మేనిఫెస్టో కమిటీలు ఈ నెల 13న మొదటి సమావేశమవుతాయి.

17 నుండి టీడీపీ – జనసేన భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రతి ఇంటికీ వెళ్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏపీ చరిత్రలో ఏనాడూ రాని కరువు వచ్చింది. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన కరువు వచ్చింది. కానీ జగన్ మాత్రం కరువు లేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. దీనిపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించి, రైతలు పక్షాణ గట్టిగా పోరాడతాం. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేవరకూ రెండు పార్టీలు పోరాడతాయి. బీమాను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బీమా కంపెనీలకు డబ్బులు కట్టకపోవడంతో రైతులకు బీమా రాలేదు. అందువల్ల ప్రభుత్వమే బీమా పరిహారం అందించాలి.

రాష్ట్రంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసుతున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు, ఇసుకలో అక్రమాలను గుర్తించాం. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంక్షేమాన్ని ఇవ్వడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దమనకాండ సాగుతోంది. చెప్పడానికి వీలులేని విధంగా పరిస్థితుల్లో దాడులు చేస్తున్నారు. అన్ని వర్గాలను చైతన్యం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తాం. ఇందులో మొదటగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పార్లమెంట్ వారీగా నిర్వహిస్తాం.

ఈ సమావేశంల పార్టీల సమావేశంలా కాకుండా..బీసీ సంఘాలు, సంఘాల పెద్దలను పిలిచి సమస్యలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నాం. ఓటర్ లిస్టులో ఇబ్బందులు ఉన్నాయి. దీనిపైనా రెండు పార్టీలు కలసి పని చేస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ చిత్తుగా ఓడుతుంది..అందుకే టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడతున్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ- జనసేన శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై త్వరలో న్యాయ పోరాటం చేస్తాం. కేసుల వివరాలన్నీ సేకరించి న్యాయస్థానాల్లో ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తాం.

స్థానిక సంస్థలు దేశానికే పట్టుకొమ్మలు. కానీ వాటిని నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను దోపిడీ దొంగల్లా మారి తినేస్తున్నారు…దానిపైనా మా పోరాటం ఉంటుంది. స్థానిక సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలో కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం. దిశా యాప్ ఒక బోగస్ యాప్. సీఎంగా ఉండి జగన్ గుడ్డిగా అబద్దాలు చెప్తున్నారు. దిశ చట్టం లేకుండానే యాప్ పెట్టి బలవంతంగా పీకమీద కత్తి పెట్టియాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. విజయనగరంలో దిశ యాప్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకోలేదని ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేశారు.

ఉద్యోగస్తులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపైనా చర్చించాం. వీటిపై జేఏసీ తప్పకుండా పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇకనుంచి గవర్నర్ ను కలవాలన్నా, ఢిల్లీ వెళ్లాలన్నా, ఎన్నికల కమిషన్ ను కలవాలన్నా ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే వెళ్లాలని నిర్ణయించాం. లోకేష్ యువగళం పాదయాత్రలో యువత నుండి బాగా స్పందన వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక యువత నిర్వీర్యమైంది. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు లేక యవత అల్లాడిపోతోంది..దీనిపైనా త్వరలో కార్యక్రమం నిర్వహిస్తాం.

ప్రజా సమస్యలపై ఇక కలిసే పోరాటం చేస్తాం. ఎటువంటి చిన్న సమస్యా లేకుండా రెండు పార్టీలు ముందుకు వెళ్తాయి. 18, 19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై క్షేత్రస్థాయిలో ఆందోళన చేపడతాం. మేనిఫెస్టో కమిటీ సమావేశమై ఏయే అంశాలు చేర్చాలో నిర్ణయించి, తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకెళ్తాం. రాష్ట్రానికి పట్టిన శని జగన్ ను వదిలించడమే టీడీపీ-జనసేన తొలి టార్గెట్. ఈ సమావేశంలో సీట్ల కేటాయింపుపై ఎటువంటి చర్చ జరగలేదు. ఇక నుండి ఏ కార్యక్రమం జరిగినా టీడీపీ-జనసేన కలిసే వెళ్తాయని అచ్చెన్నాయుడు వివరించారు.

Leave a Reply