-నల్లగొండ పొట్టేలు మాంసానికి భారీ డిమాండ్
-విజయవంతంగా రెండో విడత గొర్రెల పంపిణీ
-పెంపకం దారులందరకూ గొర్రెలు
-తెలంగాణాలో కుల వృత్తులకు ప్రోత్సాహకాలు
-ముందుకు వచ్చిన వారికి చేయూత నివ్వడం ప్రభుత్వ బాధ్యత
-అర్థం తెలియని వారే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు
-మాంసం ఉత్పత్తులకు భారీ డిమాండ్
-మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో మాంసం దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయికి ఎదగ బోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జంట నగరాలలో నల్లగొండ పొట్టేలు మాంసానికి భారీ డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు.రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నేడు సూర్యాపేట మండలం టేకుమాట్ల గ్రామంలో ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో యం పి పి రవీందర్ రెడ్డి,జడ్ పి టి సి జీడీ బిక్షం జిల్లా పశు సంవర్ధకశాఖా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా పొట్టేలు మాంసానికున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గొర్రెలను పెంచగలిగితే గొర్ల కాపరులు ఆర్థికంగా సుసంపన్నం అవుతారు అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు.
అందులో భాగమే కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు.ఇది తెలియక గొర్లు,బర్రెలు అంటూ వక్ర బాష్యాలు చెబుతాన్నారని ఆయన విరుచుకుపడ్డారు. కుల వృత్తులు చేసుకుంటామంటూ ముందుకు వచ్చే వారికి చేయుత నివ్వడం ప్రభుత్వ ధర్మమని వారు అధికారంలో ఉండగా ఆ ధర్మాన్ని విస్మరించి అధర్మంగా పాలించినందునే తెలంగాణాలో ఆకలి చావులు ఆత్మహత్యలు సంభవించాయని ఆయన మండిపడ్డారు.
అటువంటి సంక్షోభం నుండి తెలంగాణాను బయట గట్టెక్కించడం తో పాటు సుభిక్షంగా మార్చిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.అధికారంలో ఉండగా ఏనాడు ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని నేతలు ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా కువిమర్శ లకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.అర్థం తెలియని వారే అడ్డ దిడ్డంగా మాట్లాడి కుల వృత్తులను కించ పరుస్తూన్నారని ఆయన ఆరోపించారు.
గొర్రెల పెంపకం మునుముందు రాష్ట్రానికి పెద్ద పెట్టుబడిగా మారనుందన్నారు.గొర్రెల పెంపకానికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వేసులు బాటు ఉంటుందన్నారు.అందులో మొదటిది తోళ్ల పరిశ్రమ అయితే మరోటి మాంసాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందన్నారు.చివరి లబ్ది దారుడి వరకు గొర్రెలను పంపిణీ చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు.