అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్ భవన్ లో ఆమె గవర్నర్ కు కొండపల్లి బొమ్మ జ్ఞాపికను అందించగా ఆయన ఆత్మీయంగా పలకరించారు. చైర్ పర్సన్ గా నియామకమైన తర్వాత గజ్జల లక్ష్మి తొలిసారిగా గవర్నర్ ను కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మహిళా కమిషన్ కార్యక్రమాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతతో సహా పలు అంశాలపై కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి వివరణాత్మకంగా చర్చించారు. కుటుంబంలో అత్యంత శక్తిమంతమైన బరువు మోసే మహిళలకు మహిళా కమిషన్ ఊతమివ్వాలని గవర్నర్ సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్, ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్‌లో మహిళా కమిషన్ ప్రోత్సాహం అవసరమన్నారు.
గజ్జల వెంకట లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా కమిషన్ వివిధ శిక్షణా కార్యక్రమాల పట్ల దృష్టి సారించినట్లు తెలిపారు. మహిళా సాధికారతకు సంబంధించిన కమిషన్ కార్యక్రమాలకు అన్నివిధాలా అండగా ఉంటానని గవర్నర్ ఆమెకు హామీ ఇచ్చారు.