– వారి పాటలు మన ఆస్తి
దినకరా.. శుభకరా.. అంటూ సూర్యభగవానుని గురించి పాడాలన్నా,
వాతాపి గణపతిం భజే.. అంటూ వినాయకుని పూజించాలన్నా,
నమో వెంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ ఏడుకొండల వెంకన్నను ఎలుగెత్తి పిలవాలన్నా,
హరహరహర శంభో.. అంటూ శివుడ్ని నోరారా కీర్తించాలన్నా,
పాడవోయి భారతీయుడా.. అంటూ ప్రజల మదిలో దేశభక్తిని నింపాలన్నా,
నీవేనా నను పిలిచినదీ.. నీవేనా నను తలచినదీ.. అంటూ ప్రియురాలి గుండెల్లో ప్రేమమాటల ఈటెలను దింపాలన్నా,
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. అంటూ జీవితంలోని నగ్నసత్యాన్ని తెలుసుకోవాలన్నా,
బావా.. ఎప్పుడు వచ్చితివి.. అంటూ ప్రేమగా పలకరించే కమ్మని సొగసైన పద్యం వినాలన్నా,
లేచించి.. నిద్రలేచించి మహిళాలోకం.. అంటూ స్ర్తి సమాజాన్ని ఉత్తేజపరచాలన్నా,
జానపద పాటలు, ఎంకి పాటలు వినాలన్నా, ఒక పుష్పవిలాపంతో మనస్సులోని బాధను బయటపెట్టాలన్నా,
మనకు వినిపించే ఒకే ఒక స్వరం.. అది ఘంటసాల వెంకటేశ్వరరావు యుగళం.
1942లో స్వర్గసీమ సినిమాలోని ‘ఒహో నారాజ’ పాట ద్వారా ఘంటసాల తన గళాన్ని తెలుగు చిత్రసీమలో ప్రారంభించారు. ఇదే 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని తన దేశభక్తిని చాటారు స్వర్గీయ ఘంటసాల. ఒకనాటి అగ్రశ్రేణి నటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ వంటి ప్రముఖ నటులకే కాక చలం, గుమ్మడి, ఎస్పీ రంగారావు వంటి గొప్ప నటులకు తన గానామృతంతో అద్భుతమైన పాటలు అందించారు ఘంటసాల.
స్వర వైవిధ్యం కోసం అప్పట్లో ఘంటసాల పడిన శ్రమ అంతాఇంతా కాదు. అక్కినేనికి ఒకలా, ఎన్టీఆర్‌కు మరోలా పాటలు పాడి సినీ అభిమానులందరినీ మెప్పించారాయన. ఘంటసాలకు పాడటం అంటే మహా ఇష్టం. దాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నారు. మంచి పాటలు పాడటం కోసం ఘంటసాల కఠోర తపస్సు చేసేవారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. ఘంటసాల పాటలు పాడటంలో తీసుకున్న శ్రద్ధను నేటి యువ గాయనీ, గాయకులు ఆదర్శంగా తీసుకుంటే తెలుగులో మంచి పాటలు వస్తాయి.
ఆ పాటలు చిరస్మరణీయంగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. అందుకు ఉదాహరణ జగదేకవీరుని కథలో శివశంకరి పాట. ఈ పాటను 14రోజులు రిహార్సల్స్ వేసి పాట మొత్తాన్ని ఒకే టేకులో రికార్డింగ్ జరిపించిన ఘనుడు ఘంటసాల. అధునాతన రికార్డింగ్ సదుపాయాలు లేని ఆనాడే సంగీతప్రియుల హృదయాన్ని దోచిన మహా మాయగాడు ఘంటసాల వెంకటేశ్వరరావు.
తెలుగు, తమిళ భాషల్లో ఆయన దాదాపు 13వేల పాటలు పాడారు. అంతేకాదు దాదాపు 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలన్నీ చిరస్థాయిగా నిలిచిపోయినవే. ఉదాహరణకు షావుకారు, లవకుశ, గుండమ్మకథ, దేవదాసు వంటి చిత్రాలకేగాక మాయాబజార్ వంటి గొప్ప పౌరాణిక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి చిరస్మరణీయంగా మిగిలిపోయారు ఘంటసాల.
ఈయన గానానికి మెచ్చి తిరుమల – తిరుపతి దేవస్థానం వారు తమ ఆస్థాన సంగీత విద్వాంసునిగా గౌరవించారు. ఆయన తిరుమల – తిరుపతి దేవస్థానం తరపున అనేక వందల అన్నమాచార్య కీర్తనలను స్వామివారిపై పాడి భక్తిరసాన్ని ప్రపంచమంతా కురిపించారు. ఈ మహాగాయకునికి అతి ఇష్టమైన గాయకుడు ఎవరో తెలుసా? ప్రముఖ హిందుస్థానీ గాయకుడు బడే గులాం అలీఖాన్.
ఘంటసాల గారితో ఎంతోమంది సినీ గాయనీ గాయకులు ఒక్కపాటైనా పాడటానికి పోటీపడేవారు. అలా అవకాశం దక్కించుకున్న వారిలో పి సుశీల, ఎస్ జానకి, భానుమతి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది సత్యం వంటి గాయనీ గాయకులు ఉన్నారు. ఎన్నో స్వరాలను కూర్చిన, పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రతిభకు భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1971లో యుఎస్‌ఎ ప్రభుత్వం శాంతి పతకాన్ని అందజేసింది.
అది 1974వ సంవత్సరం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితంలో చివరి అంకం. ఈ చివరి మజిలీలో కొన్ని విశేషాలు జరిగాయి. వాటిలో ఒకటి తన అంత్య దశలో తెలుగు ప్రజలు మరచిపోలేని, ఎన్నిసార్లు విన్నా తనివితీరని అజరామయమైన భగవద్గీత ’ను ఘంటసాల పాడారు. భగవద్గీత వింటుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఘంటసాల రూపంలో వచ్చి మనకి (అర్జునుని) భగవద్గీత బోధిస్తున్నారా అన్నట్లు ఉంటుంది.
తెలుగు మాటను, తెలుగు పాటను తనదైన స్వరంతో అలరించిన మహానుభావుడు ఘంటసాల. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, తెలుగువారి పెదాలపై నాట్యం చేసేది ఘంటసాల పాటలే. స్వర్గంలో నారద, తుంబుర గానం మనం వినలేకపోవచ్చు. కానీ భువిపై గానగంధర్వుడి గానం వినే అదృష్టం మనకు మాత్రమే దక్కిందని సగర్వంగా చెప్పుకోవచ్చు.
తెలుగు వారు గర్వించదగిన, స్వచ్ఛమైన తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మాత్రమే. వారి పాటలు మన ఆస్తి. అలాంటి గానగంధర్వుడిని ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒకచోట మనం తలుచుకొంటూనే ఉంటాం.
-సేకరణ