Suryaa.co.in

Devotional

రాధ అంటే ఎవరు?

ఒకరు ప్రియురాలు అని, వేరొకరు కృషుని బంధువు అని, కొందరు కన్నయ్యకు అత్త అని… ఇలా ఏవేవో ఊహలు… కాని ఒక ధ్యాని, సాధకుడు, యోగి మాత్రమే కృష్ణ తత్వాన్ని గ్రహించ గలుగుతారు. ధ్యాన స్థితిలో సాధకుడుగా సత్యం ఏమిటి అని ఒక్క క్షణం పరికిస్తే, రాధ అంటే భగవంతుని విశేషముగా ఆరాధించునది అని (భక్తి) అర్థం. అనగా అత్యంత భక్తురాలు.

రాధ: ధారా…అదో నిరంతర వాహిని.
కుండలిని నుండి మూలాధార వరకు జాలువారుతున్న అమృత బిందువులను (విశ్వశక్తిని) ధారలా భూలోకమునుండి (మూలాధార)వైకుంఠము(సహస్రారం) నకు తీసుకుని వెళ్లగలిగే ఒక శక్తి…ధారా… రాధ.. ఇదో నిరంతర వాహిని.
ఇదే ధ్యానం….భక్తి…ప్రేమ.
కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్థం. నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మటుంది.
కానీ మన అంతరాత్మ మాట మనం వినం.. ఇంద్రియాలు చెప్పింది చేస్తూ ఉంటాం.
రాధ అనగా సిద్దింప చేయునది అని అర్థం.(మోక్షం)
కృష్ణ (సాధకుడు) ఎక్కడ ఉంటే (నిరంతర ధార) రాధ అక్కడ ఉంటుంది.
నా దేహం వేరు,నా శ్వాస వేరు అని చెప్పగలమా! లేదే ఇరువురు ఒకటే.
కృష్ణుని అంతర్ స్వరూపము రాధ గాను, బాహ్య స్వరూపము పురుషుడు గానూ,
అలాగే రాధ యెక్క అంతర్ స్వరూపము పురుషుడైన కృష్ణుడుగాను బాహ్య స్వరూపము రాధగానూ ఉన్నారు.. ఇద్దరూ ఒక్కటే అని ఇద్దరూ వేరు వేరు కాదని సాధన ద్వారా మాత్రమే తెలుస్తుంది..
కృష్ణుడు కోసం 16,000 మంది గోపికలు వచ్చారు.
ఈ గోపికలంతా ఎవరు?వీరితో కృష్ణుడు రాసలీలలు జరిపాడని అని వ్యర్థ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు.
యద్భావం తద్భవతి. వారిని మార్చలేము కాని సత్యం మాత్రం ఇదే….
ఎప్పుడు బాహ్య నేత్రాలతో చూడటమేనా?
ఒక్కసారి అంతర్ముఖులమై మనో నేత్రంతో ఆత్మ స్థితిలో చూస్తే,
పరమాత్ముని కోసం పరితపిస్తున్న మహర్షులు, 16,000 మంది నిరంతర ధ్యాన యజ్ఞంలో సమిధలుగా మారి, సత్య జ్ఞానాన్ని (ఎరుక) పొందిన సిద్ధులు ఈ గోపికలు.

వారి లక్ష్యం వెతుకులాట ఆ మహా చైతన్యం కోసం వెతుకులాట.
ఆ వెతుకులాటలో జ్ఞాన మార్గం చూపినవాడు కృష్ణుడు.
జీవుడు దేవుడిని చేరుకునే మార్గం చూపిన మార్గదర్శి కృష్ణుడు.
శోధన నుండి సాధన వైపు సత్యాన్ని ఎరుక పరచినవాడు కృష్ణుడు.
ఆబాల గోపాలం అంతా సిద్ధులు, యోగులు, తాపసులు.
గోకులం అంటే వైకుంఠం. అందులో భక్తి రాధ. వైకుంఠం+ధ్యానం కలసి ఉన్నదే బృందావనం.
కావున బృందావనం అంటే ఓ సమూహం. జీవసమూహం. ధ్యాన జీవుల సమూహం.
ఇకనైనా రాధా మాధవ తత్వాన్ని అర్థం చేసుకుందాం!

– ఎంబీఎస్ గిరిధర్‌రావు

LEAVE A RESPONSE