Suryaa.co.in

Devotional

భగవంతుడికి పాత్రులం కోసమే శ్రీ విష్ణు సహస్ర నామాలు

అతి ప్రేమతో కానీ, అతి కోపంతో కానీ పలికే మాటలకు ఏమిటి అర్థం అని విచారణ చేయకూడదు. అతి ప్రేమను పొందిన వ్యక్తి ఆవలి వ్యక్తి ఏమి చెబుతున్నాడు అని విచారణ చేయకుండానే స్వీకరిస్తాడు. అలానే అతి కోపంతో, అతి ద్వేషంతో పలికిన పలుకులని మనం.. ఏమిటి దీని తాత్పర్యం అని విచారణ చేయకూడదు.

భగవంతుడిపై అతి ప్రేమతో మనస్సులో అనుభవించిన ఆనందాన్ని లోపల ఇముడ్చుకోలేక పైకి వెలువరిస్తే, దాన్ని తరువాతి వారు విని, తద్వారా మనవరకు ఉపదేశంగా వచ్చినవే శ్రీ విష్ణు సహస్ర నామాలు.

ప్రేమతో పాడుకున్నవి కనక వాటి అర్థం ఎంత అనే విచారణ అవసరం లేదు. వారు పాడుకున్నది అతి ప్రేమవల్ల అయినా ఆ కల్గిన ప్రతి కదలిక, చేసే ప్రతి చేశ్ట కూడా తరువాత వారికి చాలా ఉపాదేయం గానూ వారిని తరింపజేసేదిగానూ ఉంటుంది. భగవంతుడిని తలచి ఏడిచినవారి ఏడుపు కూడా తరువాత వారికి గొప్ప రక్షగానే ఉంటుంది.

‘హృదురుః సుస్వరం రాజన్’- సుస్వరంగా వారంతా ఏడ్చిరి అంటూ పరిక్షిత్తుకి శ్రీసుఖ మహర్షి ఉపదేశం చేసేప్పుడు చెబుతాడు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళాల్సి వస్తుంది అని తలచిన కౌసల్య తను ఇటూ అటూ తత్తరపాటుతోటి, బెంగచేత, భాదపడుతూ పరుగులు పెడుతుంటే, ఆహా! అద్భుతమైన కౌశలం కల్గినటివంటి ఒక ఆమె ‘నృత్యతీ మివ’ నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తుందట. అది ఒక నేర్పరి వేసిన అడుగులాగ. భగవంతుడి అనుభవం వల్ల వస్తున్నది కనక అది ఎంతో ధివ్యమైనదై, తరింపజేసేదై, అర్థవంతమయ్యే ఉంటుంది.

మామూలుగా భగవంతుడి గురించి చెప్పాలంటే ఎవరైనా, జాగ్రత్తగా శాస్త్రం చూసుకొని, అర్థం చేసుకొని చెప్తారు. ఎంత శాస్త్రం నేర్చినా పరిపూర్ణంగా ఉండవు, అనుభవం అనేది ఉండదు కాబట్టి. కానీ సహజమైన అనుభవం నిండిన వారి వెంట శాస్త్రాలు పరుగెత్తుతాయి. ఆ శాస్త్రంలో ఉన్న విధులు వారిని అనువర్థిస్తూ ఉంటాయి. లోకాన్ని ఉజ్జీవింపజేసే మాటలు అన్నీ కూడా, నన్ను పలుకు అని వారికోసం వరుసన నిలబడుతాయి.

అట్లా భగవత్ భక్తులు పొందిన అనుభవాన్ని తరువాతి వాళ్లు తలచుకొని, ఇది మాకు రక్షకం అని ఉపాసిస్తూ ఉంటారు. అట్లాంటి నామాలే శ్రీవిష్ణు సహస్రనామాలు. ఏవో కొన్ని తలచుకొని తృప్తిపడదాం అని చెప్పినవే కానీ, ఇన్నే నామాలు అని కాదు. వాటిని తల్చుకుంటే భగవత్ ప్రేమకి పాత్రులం అవుతాం.

– ఎంబీఎస్ గిరిధర్‌రావు

LEAVE A RESPONSE