సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి

- ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- ఎన్ఓసీ జారీకి సానుకూలంగా స్పందించిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
హైదరాబాద్: సమ్మక్క సాగర్ బ్యారేజీకి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఛత్తీస్గఢ్ సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించి, ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న కాలంలో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో గోదావరి జలాలను నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముంపు తగ్గించేందుకు బ్యారేజీ ప్రాంతం మార్పు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో పాటు 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతాపరమైన మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. దీంతో ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.
ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్గఢ్లో సుమారు 33 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. భారీ వరదల సమయంలో కూడా ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని నివేదికలో పేర్కొన్నారు.
అధ్యయన నివేదిక సమర్పణ
అధ్యయనం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలలోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్పూర్ తన అధ్యయన నివేదికను జూలై 30న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది.
6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం దీనికి ఉంది. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఓసీని త్వరగా జారీ చేయాలని, మిగిలిన అనుమతులను కూడా త్వరితగతిన మంజూరు చేయాలని ఆయన కోరారు.
