*తిరుమల చరిత్రలో ఇలాంటి ఘాతుకానికి ఏ ముఖ్యమంత్రి పాల్పడలేదు
*హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్న సీఎంకు రాజకీయ సమాధి తథ్యం
*విజయవాడ మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
తిరుమల పవిత్రతకు భంగం కలిగించడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల నుంచి బయటపడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి జగన్ … తిరుమలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “తిరుమల దేవస్థానం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడం రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారుల సంబంధీకులకి పదవులు ఇస్తామని ఆశ చూపినట్లు కథనాలు వెలువడ్డాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఏ ముఖ్యమంత్రి పాల్పడని ఘాతుకానికి ముఖ్యమంత్రి జగన్ పాల్పడ్డారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తిరుమల ప్రతిష్ట, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలకమండలిలో హవాలా వ్యాపారి అయిన శేఖర్ రెడ్డికి ఇచ్చారు.
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రరెడ్డి కి పదవులు కట్టబెట్టి పవిత్ర పుణ్యక్షేత్రంలో కూర్చొబెట్టడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పదేపదే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న జగన్ కు రాజకీయ సమాధి కట్టడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అకృత్యాలకు ధీటైన సమాధానం చెప్పి తీరుతారు.
టీటీడీ ఛైర్మన్ పదవికి బీసీ, ఎస్సీ, ఎస్టీలు పనికిరారా?
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ అయ్యే అర్హత లేదా? టీటీడీ ఛైర్మన్ అవ్వాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యుడైనా, బంధువైనా అయి ఉండాలా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఇన్ని కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఛైర్మన్ పదవికి అర్హత కలిగినవాడే లేరా? రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు అందరూ జగన్ దుర్మార్గాన్ని గమనించి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలి” అన్నారు.