Suryaa.co.in

Devotional

జ్ఞాన విజ్ఞాన యోగము

భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారం లో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు తిరిగి ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రకృతి శక్తి, మాయ, బలీయమైనది దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృప కు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు.
తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చి, మరియు తన యందు భక్తి లో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు వివరిస్తాడు. తన భక్తులలో, ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో, తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో, వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తాను అని అంటున్నాడు. తమ బుద్ధి ప్రాపంచిక కోరికలతో కొట్టుకోపోయిన కొందరు, దేవతలకు శరణాగతి చేస్తారు. కానీ, ఈ దేవతలు కేవలం తాత్కాలిక భౌతిక ఫలాలని మాత్రమే ఇవ్వగలరు, వాటిని కూడా తమకు భగవంతుడు ప్రసాదించిన శక్తి ద్వారానే ఇస్తారు.
అందుకే, మనం భక్తి పూర్వకంగా ఉండటానికి, భగవంతుడే అత్యంత యోగ్యుడు. సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము మరియు సర్వశక్తిమత్వం వంటి దివ్య గుణములను కలిగి ఉండి, తనే పరమ సత్యమని మరియు అంతిమ లక్ష్యమని, శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆయన నిజ వ్యక్తిత్వం, తన యోగమాయా శక్తి యొక్క తెరచే కప్పివేయబడి ఉంది, అందుకే తన యొక్క దివ్య మంగళ స్వరూపము యొక్క నిత్య శాశ్వతమైన స్వభావం అందరికీ తెలియదు. ఆయనను మనం ఆశ్రయిస్తే, ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనను తెలుసుకున్న తరువాత మనకు కూడా ఆత్మ జ్ఞానము మరియు కర్మ క్షేత్రము గురించి జ్ఞానం, అవగతమవుతుంది.

LEAVE A RESPONSE