Suryaa.co.in

Devotional

పూజలచేత దేవతలు సంతృప్తి చెందుతారా?

“ధర్మరాజు : ఓ మహాత్మా! పూలు, ధూపమూ, దీపమూ, నైవేద్యము మేలైన పూజా సాధనాలని, వాటితో దేవతలను పూజిస్తారు. ఏమిటి వాటి విశేషాలు?”

“పితామహుడు : కుంతీ పుత్రా! నీవడిగిన ఈ విషయం మొదట శుక్రుడు బలిచక్రవర్తికి, బలిచక్రవర్తి మనువుకూ, మనువు సువర్ణుడనే తాపసికీ, ఆ సువర్ణుడు నారదునికి, ఆ నారద మహర్షి నాకు చెప్పాడు. ఆ విషయాన్నే నేను కూడా నీకు చెబుతాను సావధానంగా విను.”

“భీష్ముడు : కురువంశ శ్రేష్ఠా! ఓషధులు అమృతం వంటివి. వాటి నుండి వచ్చే పూలు మరింత మేలైనవి. పూలతో దేవతలను పూజించడం వలన మానవులకు మంచి మనసు కలుగుతుంది. అందువలననే పూలకు సుమనస్సులు అనీ, ఆ పూలతో పూజించే మానవుల కోరికలను దేవతలు మంచి బుద్ధితో తీరుస్తారు, కనుక వారికి సుమనస్కులు అనీ పేరు కలిగింది. మంచి వాసనా, మంచి రూపమూ, తెల్లదనమూ, కలిగి ముళ్ళు లేని చెట్ల నుండి పువ్వులను సేకరించి పూజ చేస్తే దేవతలు సంతోషించి ఆ పూజలను గ్రహిస్తారు.”

“నలినంబులు జాజులునుందులసి దళములు బ్రభూత తోషము గీర్వా
ణులకుం జేయును యక్షాదులుకు జలోద్భవము లెల్లఁ దుష్టి యొనర్చున్'”

“తామరపూలు, జాజిపూలు, తులసీదళాలు దేవతలకు పరమానందం కలిగిస్తాయి. కలువలు వంటి నీటి పూలు యక్షులు మొదలగు వారికి సంతోషం కలిగిస్తాయి. ఎర్రనివీ, ముళ్ళ చెట్ల నుండి పుట్టినవీ, ఘాటైన వాసన కలవీ, అయిన పువ్వులను క్షుద్ర ప్రయోగాలలో అధర్వ మంత్రాల కూర్పుతో ఉపయోగిస్తారు. ఇటువంటి పూలు రాక్షసులకు భూత, ప్రేతాలకు ప్రీతినిస్తాయి. నలుపు, తెలుపు రంగు కలిగి మంచి వాసన, కాంతి వున్న పూలు మానవులకు ఇష్టమైనవి.”

“విను దేవాలయమునఁ బితృవనమునఁ, బుట్టు కుసుమములు వలదు వివాహం
బునకు శాంతిక పౌష్టికవనితా జన రంజనాది వర్తనములకున్'”

“ధర్మరాజా! దేవాలయాలలోని పూలు దైవ పూజలకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ఇతరత్రా వాడకూడదు. స్మశానంలోని పూలు భూత ప్రేతాలకుసంబంధించినవి కనుక అవి వివాహాలకు, శాంతి కార్యాలకు, పుష్టి కర్మలకు, స్త్రీలను సంతోష పెట్టె కార్యాలకు ఉపయోగించరాదు.”

“ధర్మరాజా! పూల వాసనలతో దేవతలు, వాటి దర్శనంతో (చూడడం వలన) యక్షులు, వాటి అనుభవంతో సర్పములు, ఈ మూడు అనుభవాలతో(సువాసన, చూడడం,అనుభవించడం) మానవులు ఆనందిస్తారు. తగిన పూలతో పూజలు చేస్తే దేవతలు సంతోషించి మంచి మనసు కలవారై అప్పటి కప్పుడు మానవుల కోరికలను ఫలింప చేస్తారు.”

“ధూప దానం ఎందుకు వే (చే)యాలి?”
“ధర్మరాజా! ధూపం ఇచ్చే విషయంలో అందుగు (సాంబ్రాణి) చెట్టు నుండి తీసిన పొడితో పొగ వేయడం దేవతలందరికీ ఇష్టమైనది. దాని కంటే గుగ్గిలం మేలైనది. అగరు గంధర్వులకు,యక్షులకు, నాగులకు ప్రీతి కరమైనది. ధూపం ఇచ్చే విషయంలో అన్నిటి కంటే మేలైనది కర్పూర ధూపం.”

“రాజా! తీపి కలిగిన ధూపం దేవతలకు, కారం కలిగిన ధూపం యక్షులకు, ఘాటు కలిగిన ధూపం రాక్షసులకు ప్రీతి కరమైనవి. దేవతలకు ధూపం వేసే కర్త వారి నుండి పుష్టిని, ఆయువునూ, పొందుతాడు. ధూపం వలన యక్షులు, రాక్షసులు,గంధర్వులు ప్రీతి చెంది మెచ్చి కోరికలను సఫలీ కృతం చేస్తారు. గంధపు పొడి, అగరు,సాంబ్రాణి, వంటి వస్తువులు వేడుక కోసం దూపంగా వేస్తే వేసిన వారి హృదయాలకు ఎంతో ప్రీతినిస్తాయి.”

“దీపదానం(దీపారాధన) చేస్తే …?”
“దైవతార్చ లపుడు తామస భూత రక్షో ముఖంబు లైన కుత్సితంపు
జాతు లెల్ల దీప సన్నిధి నడఁగు నట్లగుట దీపదాన మదిక ఫలము'”

“దేవతల పూజలు చేసే టప్పుడు తమోగుణం కల యక్ష, రాక్షస, భూతపిశాచాది చెడు గుణాలు కల జాతులన్నీ దీపం దగ్గర నశించి పోతాయి. కాబట్టి దీపదానం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. దీపం వెలిగించడ మంటే వెలుగును ప్రసాదించడం. ఆ మంచి పని చేసిన వ్యక్తికి పరమాత్మ ధర్మాలను దర్శించే భాగ్య మబ్బుతుంది. నెయ్యి తక్కువగా వుండడం కానీ, వత్తిలేనిది కావడంకానీ, కొంచెం వెలిగించి పెట్టడంవంటివి దీప దానానికి (దీపారాధనకు) పనికి రావు. దీపజ్వాల బాగా ప్రకాశించే విధంగా దీప దానం చేయాలి.”

“ధర్మరాజా! ఇతరులు దేవుడికిచ్చిన దీపాన్ని దొంగిలిస్తే పాతక మేర్పడుతుంది. ఆ పాతకం వలన అతడు అంధుడు అవుతాడు. బాట (దారి)మీద కల చావడిలోనూ, దేవాలయం మీద, కొండమీద దీపం పెట్టిన వ్యక్తి ఐశ్వర్య వంతుడు అవుతాడు.”

“ఆల నేయి ముఖ్యము మహిషాది మేష జనిత ఘృతములుఁ దైలంబు మనుజ నాథ!
మధ్యమము లగు మేదో౯స్థితి మాంస రసము లారయ నిం‍ద్యముల్ దీప సమర్పణకు'”

“రాజా! దీపారాధన చెయ్యడానికి ఆవు నెయ్యి శ్రేష్ఠమైనది. గేదె, మేక, గొర్రె మొదలగు వాటి నెయ్యి, నువ్వుల నూనె మధ్యమము. మాంసము, ఎముకలు, క్రొవ్వు మొదలగు వాటి రసాలు నింద్యములు కనుక వీటితో దీపం వెలిగించరాదు. దీపదానం జ్యోతిర్లోక సమాన స్థితిని, కులం వెలుగొందడాన్నీ, మహాజ్ఞానాన్నీ ప్రసాదిస్తుంది. దీపారాధన చేసిన వాడికి దేవతలను పూజించడమనే సుఖం కలుగుతుంది.”

“రాజా! దేవతలకు ముందుగా భక్తితో నైవేద్యమిచ్చి తరువాత అన్నం భుజించాలి,అలా చేయని బుద్ధి హీనుడు రాక్షసుడవుతాడు.”

“తన యింట గలుగు నన్నము మును దేవతలకు నివేద్యముగఁ జేసి ప్రణా
మ నియమ సహిత సమర్పణ మునఁ కృత కృత్యుఁడుగ వలయుఁ బురుషుం డనఘా'”

“రాజా! మానవుడు తన యింటిలో చేసిన భోజన పదార్థాలను ముందుగా దేవతలకు నమస్కార పూర్వకంగా సమర్పించాలి.నివేదన క్రియల్లో నువ్వుల పిండి,పెరుగు,పాలు,సువాసనగల వస్తువులు దేవతలకు ప్రీతిని కలిగిస్తాయి. నివేదనతో అర్చించే వ్యక్తికీ ఇలవేల్పులు సకల శుభాలను కలిగిస్తారు. ఆపని చేయని వాడిని చెడు పనులు చేసే వాడిగా గుర్తిస్తారు.”

“ధర్మరాజా! రక్తం, మాంసం కలిపిన అన్నపు ముద్దలను, బాగా ఎర్రగా మెరిసే పేలాలను, కల్లును నివేదనగా పెడితే నాగులు, యక్షులు, రాక్షసులు సంతోషించి మేలు చేస్తారు. మంచి ప్రవృత్తి కలవారు మంచి బలులను, దుష్ప్ర వృత్తి కలవారు ఉగ్రమైన బలులను ఆయా దేవతలకు సమర్పిస్తారు. ఫలితం కూడా వాటి కనుగుణంగానే వుంటుంది.”

“రాజా! సౌమ్యబలిని ఇచ్చేవాడు మంచి వన్నె కలవాడు, బలం కలవాడు, బుద్ధి కలవాడు, లోకానుగ్రహానికి పాత్రుడై, పగవారిని అణిచి వేసేసమర్థత కలవాడుగా, పరతత్త్వంలో నిష్ఠ కలవాడుగా అవుతాడ’ని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు తాతతో ‘తాతా! పూలూ,ధూపము, దీపము, నివేదన మొదలగు వాటి వలన వచ్చే మహాఫలితాలను గురించి నీ ద్వారా ఇంకా వినాలని వుంది వివరించవా? అని కోరగా దానికి భీష్ముడు నహుషుడు చేసిన దీపదానాన్ని గురించి దాని వలన అతడు పొందిన ఫలితాన్ని గురించి ఇలా వివరించాడు.”

LEAVE A RESPONSE