– తెలంగాణలో కొందరు రాజకీయం చేస్తున్నారు
-బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు
– అమరావతిలో భూసేకరణకు పాత నిబంధనలే
– రెవిన్యూ పనితీరుపై పెదవి విరుపు
– జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సుపరిపాలనలో తొలి అడుగు
– క్యాబినెట్ భేటీలో మంత్రులకు బాబు దిశానిర్దేశం
అమరావతి: వివాదంగా మారిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులపై మంత్రులు ప్రజల్లోకి వాస్తవాలు వివరించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.
‘ఈ అంశంపై తెలంగాణలో కొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారు. బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టమేమీలేదు. వృధాగా పోయేనీటినే వాడుకుంటున్నాం. మనం ఏ రాష్ట్రంతోనూ ఘర్షణ కోరుకోం. తెలంగాణ కట్టే ప్రాజెక్టులపై మనం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేద’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
క్యాబినెట్ భేటీ తర్వాత పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులపై తెలంగాణ నేతల విమర్శలు, అమరావతిలో మలి దశ భూసేకరణ, సుపరిపాలనలో తొలి అడుగు అంశాలపై చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా.. బనకచర్ల-పోలవరం అనుసంధాన ప్రాజెక్టులపై వాస్తవాలను మంత్రులంతా జనంలోకి వె ళ్లాలని ఆదేశించారు. మనం వృధాగా పోయే నీటినే వాడుకుంటున్నామన్న విషయాన్ని స్పష్టం చే యాలన్నారు.
ఇక అమరావతి మలి దశ భూసేకరణపైనా చర్చ జరిగింది. పాత నిబంధనలే అమలుచేయాలని, దానికోసం రైతులతో మాట్లాడే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అధిక సంఖ్యలో రైతులు భూసేకరణకు ముందుకొచ్చారని చెప్పారు.
‘సుపరిపాలనలో తొలిఅడుగు’ ఏడాది పాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించాలని, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు వచ్చే నెల 1 నుంచి ఇంటింటికీ వెళ్లి ఏడాది విజయాలను వివరించాలన్నారు.
రెవిన్యూ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఏడాదిలో రెవిన్యూకు సంబంధించిన అన్ని సమస్యలూ పరిష్కరించాల్సిందే. సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకోవద్దు. మీకేమైనా ఇబ్బందులుంటే నాతో మాట్లాడండి. రెవిన్యూ సమస్యలపై నేను రెగ్యులర్‌గా అడుగుతూనే ఉంటా. అన్నీ సార్టవుట్ చేసుకోండి’ అని బాబు రెవిన్యూ మంత్రికి సూచించారు.